ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 04 : శనివారం హైదర్ గూడా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న ఆటో పైన జిహెచ్ఎంసి నిర్లక్ష్యం వల్ల చెట్టు కూలి ఆటో డ్రైవర్ మహమ్మద్ గౌస్ పాషా(36)పై పడి డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని అఖిల భారత అసంఘటిత కార్మికుల ఉద్యోగుల సంఘం కాంగ్రెస్ ఆటో సెక్టార్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి దయానంద్, పింగిలి సంపత్ రెడ్డిలు అన్నారు. తక్షణమే ప్రభుత్వం మహమ్మద్ గౌస్ పాషా కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జిహెచ్ఎంసి నిర్లక్ష్యం వైఖరిపై ఖండిస్తూ వెంటనే స్పందించి ఖైరతాబాద్ నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే రోహిన్ రెడ్డితో మాట్లాడి వారి కుటుంబాన్ని పరామర్శించారు. వారు సానుకూలంగా స్పందించి వారి పిల్లలకి ఉన్నతమైన విద్యను అందించడానికి, వారి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జిహెచ్ఎంసి మేయర్ ఎక్కడ ఉంది? బిఆర్ఎస్ ప్రభుత్వం ఎటు పోయిందని ప్రశ్నించారు. ఇప్పటివరకు కూడా ఎవరు స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, వారి పిల్లలకి అన్ని రకాలుగా ఆదుకునే విధంగా ముందుంటామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రవాణా రంగ కార్మికుల ఐక్య సమితి జేఏసీ కమిటీ సభ్యులు, అఖిల భారత అసంఘటిత కార్మికుల ఉద్యోగుల సంఘం కాంగ్రెస్ టాక్సీ సెక్టార్ ప్రెసిడెంట్ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.