ఆడ బిడ్డలకు ఇంటి దగ్గరికే నీళ్లు …

  • ఇది కదా  అభివృద్ధి ..
  •  సంక్షేమమా … సంక్షోభమా…
  •  మోసపోతే గోసపడుతారు ..
  • మూడు సభల్లో కెసిఆర్‌..   పాలేరులో తుమ్మలపైన ఫైర్‌  
మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: ఒకనాడు గ్రామాల్లో మహిళలు మంచినీళ్ళకు మైళ్ళదూరం చెరువులదగ్గరకు వెళ్ళాల్సిన పరిస్థితి నుండి నీళ్ళే మహిళలదగ్గరకు తరలి వొస్తున్నాయి. ఆహోరాత్రులు కష్టపడి పథకాలను రూపొందించడం ద్వారానే ఇది సాధ్యమైంది.బిఆర్‌ఎస్‌ను కాదనుకుంటే ప్రజలు సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వొస్తుంది. ఎన్నికల వేళ బహురూప వేషగాళ్ళు వొస్తుంటారు. వారి మాటలు నమ్మితే మోసపోయేది ఆఖరికి  ప్రజలే.. పద్నాలుగేళ్ళు ఎంతో కష్టపడి, పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం.. సాధించుకున్న తెలంగాణను గడచిన దశాబ్ధకాలంగా బాగుచేసుకుంటున్నాం..మన రాష్ట్రం ఇప్పుడు మూడు కోట్ల టన్నుల ధాన్యం పండిస్తున్నది.. ఇదంతా ఎలా జరిగింది.. మనందరి సమిష్టి కృషి.. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు, సంక్షేమం వల్లకాదా అని బిఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ శుక్రవారం పాలేరు, మహబూబాబాద్‌, వర్ధన్నపేటలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో  ప్రశ్నించారు.ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు మాట్లాడుతూ.. … పదేళ్ళకింద తెలంగాణ పల్లెలు, పట్టణాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందుతున్నాయన్న విషయాన్ని ప్రతిఒక్కరూ ఆలోచించాలె.. ఉద్యమం చేస్తున్న రోజుల్లో ఏ ఊరికి వెళ్ళిన కరువు  తాండవిస్తూ కనిపించేది.. రైతులను ఆదుకునే వారే లేకుండే.. రాష్ట్రం ఏర్పడకముందు కాంగ్రెస్‌ పాలన ఎలా ఉందో తెలియందికాదు.. అయితే వలసలు లేకపోతే ఆత్మహత్యలతో గ్రామాలన్నీ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుండేవి. నేడు పల్లెలన్నీ పచ్చని పంట పొలాలతో ఆకుపచ్చని పర్యావరణంతో ఎంతో ఆనందంగా, ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి. అనేక చెక్‌ డ్యాంలు నిర్మించుకున్నాం..  ఎక్కడ చూసిన సమృద్ధిగా నీరు చేరుకుంది.. ఫలితంగా గతంలో ఏనాడు చూడని పంట దిగుబడులను చూస్తున్నాం. దేశంలో ఇంతవరకు పంజాబ్‌ గురించి చెప్పుకున్నాం.. ఇప్పుడు తెలంగాణ దేశంలో రెండ స్థానాన్ని ఆక్రమించుకుంది.
ఇక్కడ జరిగిన అభవృద్ధి గురించి ప్రముఖ వ్యవసాయ నిపుణుడు స్వామినాథన్‌ మెచ్చుకున్నారు.. యుఎన్‌ఎ భేష్‌ అని కితాబిచ్చింది..   ఒకనాడు రైతుకు వ్యవసాయ పెట్టుబడి కావాలన్నా, ఎరువులు, పురుగు మందులు కావాలంటే దొరకటం దుర్లభంగా ఉండేది. ఎరువులకోసం చెప్పులు లైన్‌లో పెట్టి పోలీస్‌ స్టేషన్లలో తీసుకోవాల్సిన పరిస్థితి. ఇవ్వాళ ప్రభుత్వమే ముందస్తు పెట్టుబడిని అందిస్తున్నది. గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రైతు బకాయిల వసూలుకు ఇంటి తలుపులు తీసుకు పోయేవారు. ఇప్పుడు ఆ పరిస్థితిలేదు.  పండిరచిన పంటను కళ్ళాల వద్దే కొనుగోలుచేసి, దలారుల  ప్రమేయం లేకుండా రైతు ఖాతాలో జమసేస్తున్నది. అంతకన్నా కావాల్సిందేముంది.  కాని, ఇవ్వాళ ఎన్నికలు వొస్తున్నాయని ఏవో మాయమాటలు చెప్పేందుకు పార్టీల నాయకులు వొస్తున్నారు. స్నేహితుడో, బంధువో ఎవరో చెప్పిన్రని వోటు  హక్కును దుర్వినియోగం చేసుకోవొద్దు. ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఆలోచించండి. వాస్తవంగా ప్రజలు న్యాయం చేస్తున్నది ఎవరన్న విషయంపైన చర్చించుకోవాలి. తప్పుడు వాగ్దానాలు చేసేవారికి వోటు వేయకండంటూ ఆయన మూడు సభల్లోనూ ప్రజలకు విజ్ఞప్తిచేశారు.
ధరణిని బంగాళఖాతంలో వేస్తే.. పైరవీకారుల చుట్టు తిరగాల్సిందే.. ఎంతో మేధోమధనం  చేసి ధరణిని రూపొందిస్తే కాంగ్రెస్‌, బిజెపి నాయకులు తాము అధికారంలోకి రాగానే బంగాళాఖాతంలో వేస్తామంటున్నారు. నిజంగా ధరణి కావాలా.. వొద్దా అంటూ మూడు సభల్లోనూ కెసిఆర్‌ ప్రజలకు ఇదే  ప్రశ్నవేశారు.
కావాలనుకున్నవారు చేతులెత్తాలని కోరడంతో సభికులంతా చేతులెత్తి కావాలని సమాధానం ఇచ్చారు. ధరణి వల్ల హక్కుదారు భూములను ఎవరు ఖబ్జా చేయలేరని, పట్టాదారు వేలిముద్రలేకుండా  ఆఖరుకు  రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా భూ బదలాయింపు చేయలేడన్న విషయాన్ని మరోసారి ఆయన ప్రజలకు వివరించారు. ఇప్పుడు రైతు బంధు పంపిణీకి అడ్డు పుల్ల వేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అని అడ్డుతగులుతున్నారు. కొనసాగింపులో ఉన్న పథకాలను  నిలువరించాల్సిన అవసరంలేదన్న కనీస జ్ఞానంకూడా వారికి లేదని ఆయన విపక్షాలపైన విరుచుకుపడ్డారు. వాటితోపాటు పెన్షన్లు, రేషన్‌బియ్యం అన్ని వొద్దంటారు. దీన్నిబట్టి ఈ పార్టీలు ప్రజా సంక్షేమాన్ని కోరేవికాదన్న విషయం అర్థమవుతుంది. కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలంటున్నాడు. మూడు గంటలు కావాలా 24 గంటల కావాలా అని ఆయన మరోసారి ప్రజలను చేతులెత్తి చెప్పాలనడంతో సభా ప్రాంగణంలోని వేలదిమంది చేతులుఎత్తి తమ సమ్మతిని తెలిపారు. అందుకే పొరపాటున ఇతర పార్టీలను గెలిపిస్తే ఈ సంక్షేమ పథకాలకు చెల్లుచీటి అవుతుందని, అందుకే ఆలోచించి వోటు   వేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పాలేరు సభలో తుమ్మలపైన ఫైర్‌…  
మంత్రి అజయ్‌ కుమార్‌తో ఓటమి చవిచూసిన తుమ్మల నాగేశ్వర్‌రావు ఇంట్లో ఉంటే సీనియర్‌ నాయకుడని ఆదరించి ఎంఎల్సీ పదవి, మంత్రి పదవి ఇస్తే ఆయన ఇవ్వాళ తనకు అన్యాయం చేసానంటున్నాడని తుమ్మలపైన ఘాటుగా విమర్శించాడు కెసిఆర్‌. ఆయనకు ఖమ్మం జిల్లాలో ఏకఛత్రాదిపత్యం ఇస్తే, ఒక్క ఎంఎల్‌ఏ స్థానాన్ని కూడా గెలిపించలేకపోయాడన్న  విషయాన్ని కెసిఆర్‌ గుర్తుచేశారు. అదే జిల్లాకు చెందిన మరికొందరు నాయకులను కూడా తీవ్రంగా విమర్శించారు. వీరు డబ్బుతో రాజకీయం చేద్దామను కుంటున్నారంటూనే వారు ఎవరైంది మీకు తెలుసని పేరు ఉచ్చరించకుండానే వారిపై విరుచుకు పడ్డారు.  ఈ బహురూప నాయకులు డబ్బుతో ఏమైన చేయగలమనుకుంటున్నారు. బిఆర్‌ఎస్‌ నేతలను అసెంబ్లీ గడప తొక్కనివ్వమంటున్నారు. పైసలతో పేదలను కొనాలనుకుంటున్నారు. కాని వారే వారి పేగులు తీస్తారని ఆవేశంగా ప్రసంగించారు. కాగా ఈ మూడు నియోజకవర్గాల్లో జరిగిన ఆభివృద్ధిని కూడా ఆయన వివరిస్తూ  మరింత అభివృద్ధి జరుగాలంటే తమ అభ్యర్ధులను అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page