కుటుంబ పాలన, అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా బిజెపి
పోరాటం
•రాహుల్ ఓ రాజకీయ అజ్ఞాని.. తెలంగాణ పోరాటం, ప్రజల
ఆకాంక్షలపై అవగాహన లేదు
•అమ్ముడు పోయే పార్టీ కాంగ్రెస్.. కొనే పార్టీ బీఆర్‌ఎస్
•కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి
హైదరాబాద్,ప్రజాతంత్ర, అక్టోబర్ 27: సకలజనులు పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ నేడు అవినీతిపరులు, మాఫియా చేతిలో బంధీ అయిందని.. కేసీఆర్ కుటుంబ, అవినీతి, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు స్పందిస్తున్నారని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యేకె.ఎస్.రత్నం, అతడి అనుచరులు, ప్రస్తుత మాజీ సర్పంచ్, ఎంపీటీసీ, సుమారు 60 మంది ప్రజాప్రతినిధులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి నేతృత్వంలో.. బీజేపీ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమక్షంలో బీజీపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి వారందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే రత్నం తెలంగాణ లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దళిత నాయకులు. భారతీయ పార్టీలో చేరిన చేవెళ్ల, నవాబుపేట, మొయినాబాద్, షాబాద్, శంకర్ పల్లి మండలాల నుంచి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ సభ్యులు, రైతు నాయకులు, దళిత సామాజిక వర్గానికి చెందిన యువకులకు పార్టీ తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను అన్నారు. ఎన్నో పోరాటాలు, ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. 1200 మంది బిడ్డలు ఆత్మబలిదానం చేసుకున్నారు. ఏ అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్లినా బీఆర్‌ఎస్ పై వ్యతిరేకత నెలకొంది. కొన్ని ప్రచార సాధనాలు కావాలని బిజెపిపై వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుంది. కుటుంబ పాలన, అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా బిజెపి పోరాటం చేస్తుంది. బీఆర్‌ఎస్, బిజెపి ఒకటేనంటూ రాహుల్ గాంధీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాహుల్ గాంధీకి రాజకీయాలపై, తెలంగాణ పోరాటం, ప్రజల ఆకాంక్షలపై ఎటువంటి అవగాహన లేదు. తెలంగాణ పోరాట చరిత్ర గురించి ఏమాత్రం తెలియని రాహుల్ ఓ రాజకీయ అజ్ఞాని అన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ఆధారంగా బీజేపీ కి వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇస్తున్నాడు. బీఆర్‌ఎస్ కు కాంగ్రెస్ బి-టీమ్. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో పుట్టి, కాంగ్రెస్ లో పనిచేస్తున్నప్పుడు రాహుల్ గాంధీకి తెలియదు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసింది కేసీఆర్. గతంలో అనేక ఎన్నికల్లో కలిసి పోటీ చేసి, పొత్తులు పెట్టుకున్నవి కాంగ్రెస్, బీఆర్‌ఎస్. గతంలో రిమోట్ కంట్రోల్ గవర్నెన్స్ నడిపించిన ఘనత రాహుల్ ది. అమ్ముడు పోయే పార్టీ కాంగ్రెస్.. కొనే పార్టీ బీఆర్‌ఎస్. 2018లో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ కు అమ్ముడుపోయారు. రాహుల్ గాంధీ..! మీ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ కు అమ్ముడుపోయి మంత్రులుగా కొనసాగిస్తున్న దరిద్రపు పార్టీ మీది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు ఏ-టీమ్ ఎంఐఎం పార్టీ. ఆ పార్టీలను దారుస్సలాం నుంచి అసదుద్దీన్ ఓవైసీ కంట్రోల్ చేస్తున్నడు. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి తెలంగాణ నుంచి ప్రచారం చేసింది ఎవరో మీకు తెలియదా..? మజ్లిస్ పార్టీతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నది బీఆర్‌ఎస్ పార్టీ. మా కంఠంలో ప్రాణమున్నంత వరకు బిజెపి మజ్లిస్ పార్టీతో కలవదు. దేశం కోసం పనిచేసే పార్టీ బిజెపి. మాకు అధికారం శాశ్వతం కాదు.. సిద్ధాంతాలు ముఖ్యం. బిజెపి ప్రజల టీమ్ తప్ప… ఏ పార్టీకి టీమ్ కాదు. పచ్చి అవకాశవాదులు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు. ఢిల్లీలో కాంగ్రెస్ గెలిస్తే ఆ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తామని కేటీఆర్ బాహాటంగా ప్రకటించిండు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని పార్టీలు. రూ. 1.20 లక్షల కోట్లతో తెలంగాణలో జాతీయ రహదారులను నిర్మించింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. కరోనా ఆపత్కాలంలో రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్ అందించింది మోదీ ప్రభుత్వం. నరేంద్ర మోదీ పేరు చెబితేనే, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలంటేనే శత్రు దేశాలు ఉచ్చ పోసుకుంటాయి.
కాంగ్రెస్ ప్రభుత్వంలో దిల్ సుఖ్ నగర్, లుంబినీ పార్కులో బాంబు పేలుళ్లు…. అనేక చోట్ల అరెస్టులు జరిగాయి. ఉగ్రదాడులు మితిమీరిపోయాయి. కూకటివేళ్లతో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను అణచివేసిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిది. మజ్లిస్ పార్టీని పెంచి పోషించి, వాళ్ల మోచేతి నీళ్లు తాగింది కాంగ్రెస్ పార్టీ అని కిషన్ రెడ్డి విమర్శించారు. మజ్లిస్ పార్టీకి కాంగ్రెస్ నాయకులు వంగివంగి సలాం చేసేటోళ్లు. నాడు మజ్లిస్ దయాదాక్ష్యిణ్యాలు ఉంటేనే కాంగ్రెస్ మంత్రులు ఓల్డ్ సిటీలో తిరిగేవాళ్లు. బీఆర్‌ఎస్ పాలనలో ఆ పార్టీ నాయకులు ఎంఐఎం నాయకులకు కారుదిగి మరీ రోడ్డుమీద పడుకుని సలాం కొడుతున్నరు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు పోటీపడుతూ సూట్ కేసులతో దారుస్సలాంకి పరుగెడుతున్నరు. ఓట్లు వేయించమని ప్రసన్నం చేసుకుంటున్నరు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు హిందువులు, ప్రజల ఓట్లు అవసరం లేదు. ఆ పార్టీ నాయకులకు ప్రజలను ఓట్లు అడిగే అర్హత లేదు. 1969 లో తెలంగాణ ఉద్యమంలో 369 విద్యార్థులను తుపాకులతో కాల్చి చంపించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మలిదశ ఉద్యమంలోనూ 1200 మంది బిడ్డలను బలగొని, కుటుంబాలను ఆగం చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలించాయి. కాంగ్రెస్ దోపిడీ, అవినీతి, హత్యలు, కుటుంబ పాలన చూశాం. కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమకారుల ఆకాంక్షలను కాలరాసి, వచ్చిన తెలంగాణను అప్పులపాలు చేసిండు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. బీసీలకు బీసీ బంధు ఇవ్వలే.. దళితబంధు అరకొర ఇచ్చి చేతులు దులుపుకున్నరు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చింది లేదు. గత పదేండ్లుగా టీచర్ల రిక్రూట్ మెంట్ జరపలేదు. ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను.
బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నీతివంతమైన పాలన అందిస్తుంది. ప్రగతి భవన్.. కేసీఆర్ కుటుంబానికి ప్రగతి చేసే భవన్.. కాని ప్రజలకు ప్రగతి చేకూర్చేది కాదు. బీజేపీ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ పేరును తెలంగాణ ప్రజా ప్రగతి భవన్ గా మారుస్తాం. విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తాం. రైతులకు అన్ని రకాల పంటలకు బీమా పథకం అందిస్తాం. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. బీజేపీ ప్రభుత్వంలో అన్ని రకాల పేదలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తాం. భారతీయ జనతా పార్టీ చెప్పిన మాట నెరవేర్చి చూపెడుతుంది. కర్ణాటకలో రైతుల పంటలకు కనీసం 5 గంటల కరెంట్ కూడా ఇవ్వలేకపోతోంది కాంగ్రెస్ పార్టీ. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మహిళలు, విద్యార్థులకు అనేక రకాల హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక నిండా మోసం చేసింది. రక్తపు బొట్టు చిందకుడా అయోధ్యలో రామమందిరం నిర్మిస్తోంది నరేంద్ర మోదీ ప్రభుత్వం. గత 75 ఏండ్లుగా నెలకొన్న అనేక సమస్యలకు పరిష్కారం చూపింది. అన్ని రాజకీయ పార్టీల మెడలు వంచి చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే చట్టం తీసుకొచ్చాం. 75 ఏండ్ల తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవాలు అధికారికంగా నిర్వహించిన పార్టీ బిజెపి. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లి, తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం. ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా, నీతివంతమైన పాలన అందిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు.