పదేళ్లు దాటితే తప్పదన్న అధికారులు
న్యూ దిల్లీ, అక్టోబర్ 12 : ఆధార్ కార్డు తీసుకుని పదేండ్లయిందా..అయితే వెంటనే అప్డేట్ చేసుకోండి. ఆధార్ పొంది పదేండ్లు నిండినవారు గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలను మళ్లీ సమర్పించాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ సూచించింది. గత పదేండ్లలో ఆధార్‌ను ఒక్కసారి కూడా అప్డేట్ చేయనివారు ఈ పని చేయాలని కోరింది. అయితే ఐడెంటిటీ, రెసిడెన్స్ ప్రూఫ్ డాక్యుమెంట్లను సమర్పించడం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.
ఈ పక్రియను మై ఆధార్ పోర్టల్‌తోపాటు దగ్గర్లోని ఆధార్ సెంటర్లలో నిర్దేశిత రుసుము చెల్లించి చేసుకోవచ్చని తెలిపింది. దేశంలోని పౌరులందరికీ విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డులను జారీ చేస్తున్నది. వీటికి ఐరిస్, వేలిముద్రలు, ఫొటోలను ప్రామాణికంగా తీసుకుంటున్నది. ఇలా కేటాయించిన ఆధార్ నంబర్‌ను ప్రభుత్వ పథకాల లబ్దిదారుల ఎంపిక సహా ఇతర అవసరాలకు ప్రభుత్వం ఉపయోగిస్తున్నది.