రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య మరియు కుటుంబసంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు
ఆయిల్ ఫామ్ తోపాటు అంతర పంటల ద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. శుక్రవారం గజ్వేల్ మండలం సిరిగిరిపల్లి గ్రామ సమీపంలో 10 ఎకరాల భూమిలో ఆయిల్ ఫామ్ తోటలో అంతర్ పంటగా అరటి పంటను పండిస్తున్న రైతు లక్ష్మణ్ తోటను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్, ప్రజా ప్రతినిధులు మరియు ఉద్యానవనశాఖ అధికారులతో కలిసి మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు పరిశీలించారు. ఆయిల్ ఫామ్ తోటలో అంతరపంటగా అరటి పంటను సాగు చేస్తున్న తీరును పరిశీలించి ఆయిల్ ఫామ్ తోటను ఎప్పుడు వేసింది, వాటిని ఆరోగ్యంగా పెంచుటకు చేస్తున్న సాగు పద్ధతి, అంతరపంటగా అరటి పంటను సాగు చేస్తున్న తీరు, అంతరపంటతో అదనంగా పొందే ఆదాయం గురించి రైతు లక్ష్మన్ ను అడిగి తెలుసుకొన్నారు. రైతులకు అధిక ఆదాయాన్ని అందించే ఆయిల్ఫామ్ తోటను సాగు చేస్తూ దానిలో అంతర పంటగా అరటి పంటను సాగు చేస్తు ఆదర్శంగా నిలుస్తున్న రైతు లక్ష్మణ్ దంపతులను అభినందిస్తూ వారిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ ఆయిల్ఫామ్ సాగు రైతులకు అత్యంత లాభందాయకమని అన్నారు. ఆయిల్ ఫామ్ సాగు చేస్తే మూడు లేదా నాలుగు సంవత్సరాల తర్వాత ఆదాయం వస్తదని చాలామంది అపోహ పడుతుంటారు కానీ ఆయిల్ఫామ్ తోటలలో తోట పెట్టిన మొదటి సంవత్సరం నుండే అంతర పంటలను పండించడం ద్వారా అధికంగా లాభం పొందవచ్చని లక్ష్మణ్ లాంటి రైతులు రుజువు చేస్తున్నారు.
జిల్లాలో ఇప్పటికే 10,000 ఎకరాలలో ఆయిల్ ఫామ్ పంటల సాగు జరుగుతుందని అన్నారు. ఈ సంవత్సరం మరో 10000 ఎకరాలలో ఆయిల్ ఫామ్ పంటలను పండించేందుకు అధికారులను ఆదేశించడం జరిగిందని, ఆయిల్ ఫామ్ మొక్కలు, డ్రిప్పు మరియు ఎరువులను ఫ్రీగా అందించడం జరుగుతుందన్నారు. అలాగే పంట వేసిన దగ్గర నుండి ప్రతిక్షణం ఉద్యానవన మరియు వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో మొక్క ఆరోగ్యాంగా ఎదిగేందుకు అవసరమైన సూచనలు సలహాలు అందిస్తూనే ఉంటారు. ఆయిల్ ఫామ్ పంట ఎదిగిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతం వస్తున్నట్టుగానే ప్రతి నెల ఆయిల్ ఫామ్ గెలలను తెంపడం ద్వారా రైతులకు ఆదాయం వస్తుంది. ఇప్పటివరకు కూరగాయల తోటలు, పండ్ల తోటలలో మాత్రమే కోతులు పడి ఆయా పంటలను నష్టపరిచేవి కానీ ఈమధ్య నంగునూరు మండలంలోని దర్గపల్లిలో వరి నారును కూడా పీకేస్తూ నష్టపరుస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆయిల్ ఫామ్ తోట్లకు కోతులు, పందులతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. పండిన పంటను మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మన జిల్లాలోనే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేస్తున్నాము.
పండించిన పంటను ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ వారే కొంటారు. పంట పొలాలనుండి ఫ్యాక్టరీ వరకు ఆయిల్ ఫామ్ పంటను రవాణా చేయడానికి అయ్యే రవాణా ఖర్చును ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ వారే భరిస్తారు. నంగునూరు మండలం నర్మెట్టాలో ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ద్వారా 300 కోట్ల రూపాయలతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి టెండరింగ్ పూర్తయింది. ఒక సంవత్సరంలోగా ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయి ఆయిల్ ఫామ్ సీడ్స్ క్రషింగ్ కూడా ప్రారంభమవుతుందని అన్నారు. ఈ సంవత్సరం జిల్లాలో మరో 10 వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు లక్ష్యం పెట్టుకున్నందున ప్రజా ప్రతినిధులు వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులు జిల్లాలోని రైతులతో లక్ష్మణ్ ఆయిల్ ఫామ్ తోటలో ఎక్స్ ప్లోజర్ విజిట్ నిర్వహించి ఆయిల్ ఫామ్ తోటల సాగువలన కలిగే లాభాల గురించి రైతులకు వివరించి 5 ఎకరాలకు పై భూమిని కలిగి ఉండి ఇప్పటికీ ఆయిల్ ఫామ్ పంటలను సాగు చేయని రైతులతో ఆయిల్ ఫామ్ సాగు చేయించాలని జిల్లా కలెక్టర్ ను మరియు వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు.