ఆర్టీసీ బస్టాండ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి…చిన్నారిని ఎత్తుకుని

  • చిన్న పిల్లల తల్లులకు ఫీడింగ్‌ ‌గదిని ఏర్పాటు చేయండి
  • సిద్ధిపేట ఆర్టీసీ బస్టాండ్‌ను తనిఖీ చేసిన మంత్రి హరీష్‌రావు
  • ఆటోనగర్‌ ఆధునీకరణకు అప్పటికప్పుడు రూ.20కోట్లు మంజూరు
  • గోరింటాకు సంబురాల్లో పాల్గొన్న మంత్రి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 6 : సిద్ధిపేట శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఇటీవల కొత్తగా నిర్మించిన సిద్ధిపేట పాత బస్టాండ్‌ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండు ఆవరణలో ప్రయాణీకులకు అందే సౌకర్యాలు, ముఖ్యంగా కూర్చునేందుకు కుర్చీలు, తాగునీరు తదితర వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులతో పాటు ఆర్టీసికి చెందిన డ్రైవర్‌, ‌కండక్టర్‌ను కూడా పలకరించారు. వసతుల గురించి ఆరా తీశారు. చిన్నపిల్లల తల్లులకు ఫీడింగ్‌ ‌రూమ్‌ ‌గదిని ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికార యంత్రాంగానికి ఆదేశించారు. బస్సుల రాకపోకలు, అన్నీ గ్రామాలకు బస్సులు వెళ్లేలా విద్యార్థుల సౌలభ్యం కోసం అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ అధికార యంత్రాంగానికి సూచించారు.

బస్టాండు ఆవరణ ప్రాంతాన్ని కలియతిరిగి క్షుణ్ణంగా మంత్రి పరిశీలించారు. బస్టాండ్‌ ఆకస్మిక తనిఖీలో ఓ చిన్నారిని ఎత్తుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. బస్టాండ్‌ ఆకస్మిక తనిఖీలో భాగంగా బస్టాండ్‌లో ఓ చిన్నారిని ఎత్తుకుని నిలుచుని ఉన్న తల్లి దగ్గరికి వెళ్లి చిన్నారిని మంత్రి హరీష్‌రావు తన చేతుల్లోకి తీసుకుని ఎత్తుకున్నారు. మంత్రి హరీష్‌రావు తన బిడ్డను ఎత్తుకోవడంతో ఆ తల్లి సంతోషానికి, ఆనందానికి అవధుల్లేవు. అయితే, మంత్రి హోదాలో ఉన్న హరీష్‌రావు చిన్నారిని ఎత్తుకోవడంతో  అక్కడ ఉన్నవారందరూ మంత్రి హరీష్‌రావు సింప్లిసిటీకి నిదర్శనమని మాట్లాడుకోవడం వినిపించింది.   మంత్రి వెంట టిఆర్‌ఎస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నాయకులు పాల సాయిరాం, కొండం సంపత్‌రెడ్డి, జంగిటి కనకరాజు, ఎడ్ల అరవిందరెడ్డి, మంత్రి ఓఎస్‌డి బాల్‌రాజు తదితరులు ఉన్నారు. అనంతరం మంత్రి క్యాంపు కార్యాలయంలో టిఆర్‌ఎస్‌ ‌మహిళా ఆధ్వర్యంలో జరిగిన గోరింటాకు సంబురాల్లో మంత్రి హరీష్‌రావు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మంత్రి హరీష్‌రావు చేతికి టిఆర్‌ఎస్‌ ‌మహిళా నేతలు గోరింటాకు పెట్టారు.

అభివృద్ధి పేటలో ఆటోనగర్‌… ఆధునీకరణకు రూ.20 కోట్లు…. మందపల్లి వద్ద స్థల పరిశీలన చేసిన మంత్రి హరీష్‌రావు

అభివృద్ధి పేటగా పేరొందిన మందపల్లి ప్రగతి బాట పట్టిందని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు చెప్పారు. సిద్ధిపేట పట్టణ శివారు మందపల్లి శివారులో రానున్న ఆటోనగర్‌ ‌వాడ ప్రాంత స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఇండస్ట్రీయల్‌ ‌మేనేజర్‌ ‌శివప్రసాద్‌, ‌రాష్ట్ర నర్సింగ్‌ ‌కౌన్సిల్‌ ‌సభ్యుడు పాల సాయిరాం, టిఆర్‌ఎస్‌ ‌నాయకుడు లోక లక్ష్మీరాజంలతో కలిసి మ్యాపును పరిశీలించి నూతనంగా ఏర్పడనున్న ఆ ప్రాంత అభివృద్ధిపై ఆటోనగర్‌ ‌ప్రతినిధులు, ఇండస్ట్రీయల్‌ అధికారులతో చర్చించారు. ఈ మేరకు మౌలిక సదుపాయాల కల్పనకై ఆటోనగర్‌ ఆధునీకరణకు అక్కడికక్కడే రూ.20 కోట్లు నిధులు మంజూరు చేశారు. దీంతో పట్టణంలోని 300ఆటో, మెకానికల్‌ ‌కార్మికులకు లబ్ధి చేకూరనున్నదని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page