ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : ఆర్ధిక శాఖ గుర్తించిన మరో 1,827 పోస్టులు కలిపి మొత్తంగా 7,031 వేల నర్సుల పోస్టులు వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం 5,204 నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిందని జేఏసీ పేర్కొంది. ఈ మేరకు మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ నేతలు గోవర్ధన్, నక్క సూర్య కుమార్, రామానుజమ్మ తదితరులు కలిసి మాట్లాడుతూ 1,827 పోస్టులకు రాష్ట్ర ఆర్ధిక శాఖ అనుమతి ఇచ్చిందని, అంతేగాక ఈ పోస్టులను కలపడం ద్వారా అభ్యర్థులు ప్రిపరేషన్ అయ్యే బాధ తప్పుతుందని, కాలం కలిసి వస్తుందని, అభ్యర్థులు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగే శ్రమ తప్పుతుందన్నారు. అలాగే అభ్యర్థులకు సర్వీస్ ను బట్టి వేయిటేజీ మార్కులు, అకాడమిక్ 10 మార్కులు కలపాలని కోరారు. కరోనా సమయంలో ప్రైవేటు దవాఖానల్లో పని చేసే నర్సులు కూడా ఎంతో సేవలు అందించారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీష్ రావు, మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకుని అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. లేకపోతే తమ ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జేఏసీ నేతలు, నర్సింగ్ అభ్యర్థులు జ్యోతి, కవిత, మంగ, ప్రశాంతి, ప్రసన్న, సోనా, సమత, వెంకటేష్, వినోద్, సంతోష్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.