- అందని ద్రాక్షగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు
- ఏండ్ల తరబడి ఆశావహుల ఎదురుచూపులు
- నాయకుల చుట్టూ పలువురి ప్రదక్షిణలు
- డిమాండ్ బారెడు.. నిర్మాణాలు మూరెడు
మేడిపల్లి, ప్రజాతంత్ర, జూన్ 7 : సొంతిల్లు అంటే అదో కల..కొందరు జీవితాంతం దాని కోసం కలలుకంటూ కష్టపడుతుంటరు.. తమదని చెప్పుకునేందుకు ఓ గూడుండాలని తాపత్రయ పడుతుంటరు మరికొందరు.. అన్ని అర్హతలు ఉండి ఇల్లులేని నిరు పేదల సొంతింటి కలలను డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ ద్వారా సాకారం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే పీర్జాదిగూడ, బోడుప్పల్ జంట బల్దియాల్లో సొంతిళ్ళు లేని అర్హులైన పేద, సామాన్య కుటుంబాలు వేలాల్లో ఉండగా నిర్మాణాలు మాత్రం అరకొరగా అంటే ఒక్కో బల్దియా పరిధిలోని ఒక్కో ప్రాంతానికి సగటున కేవలం రెండంకెల సంఖ్య దాటకపోవడం గమనార్హం. స్వల్ప సంఖ్యలో జీ ప్లస్ వన్, టూ పద్దతిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల్ల నిర్మాణం జరిగి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ లబ్దిదారులకు కేటాయించకపోవడంతో పలువురు ఆశావహులు జాబితాలో తమ పేరుందో లేదోననే మీమాంసలో ఉన్నారు. డబుల్ బెడ్ రూమ్‌ల కోసం కలలు కంటున్న అనేక మంది అధికార పార్టీ నాయకులు, ఆఫీసుల చుట్టూ తిరుగుతూ తమ పేరు జాబితాలో చేర్చాలని ప్రాదేయపడుతున్న సంఘటనలు నిత్యం అగుపిస్తుంటాయి.
మేడిపల్లి మండల సరిధిలోని పీర్జాదిగూడ, బోడుప్పల్ జంట మున్సిపల్ కార్పొరేషన్లలోని పీర్జాదిగూడ, మేడిపల్లి, పర్వతాపూర్, బోడుప్పల్, చెంగిచర్లలలో భారీ సంఖ్యలో ధ్నరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం. ధరఖాస్తు చేసింది మొదలు పలువురు ఎప్పుడెప్పుడు ఇల్లు కేటాయిస్తారోనని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఏళ్ల క్రితమే పూర్తయిన డబుల్ డెడ్ రూమ్ ఇండ్లను కేటాయించక పోవడంతో చాలా మంది పేదలకు ఎదురు చూపులు తప్పడంలేదు. వీటిని నిర్మించి చాలా కాలం అవుతుండడంతో నిర్వహణ లేక వర్షాలకు గోడలు, స్లాబులు చెడిపోతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణం పూర్తయిన ఇళ్ళల్లో ఆకతాయిల చేతుల్లో కిటికీల అద్దాలు, మరి కొన్ని చోట్ల తలుపులు సైతం ధ్వంసమవుతున్నాయని పలువురు వాపోతున్నారు. ఇప్పుడు, అప్పుడు అంటూ ఊరిస్తూ వీటిని అటు తిరిగి ఇటు తిరిగి వొచ్చే అసెంబ్లి ఎన్నికల గడువు వరకు సాగదీస్తారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సొంతిళ్లంటూ లేకుండా ఇంకెన్నాళ్ళు కిరాయి ఇండ్లల్లో ఉండాలని, నెలనెలా వేలకు వేలు కిరాయిలు ఎట్లా కట్టాలని పలువురు పేదలు ప్రశ్నిస్తున్నారు.
వొచ్చిన అరకొర వేతనాల్లో అధిక భాగం ఇండ్ల కిరాయిలకే సరిపోతుందని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో ఇండ్లు పొందేందుకు అబ్దిదారుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. రాజధాని హైదరాబాద్ మహా నగరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాలు కావడం, విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండడంతో సమీపంలోని జిల్లాల నుంచి వలసలు పెరిగిపోతుండడంతో కూడా లబ్దిదారుల సంఖ్య రోజురోజుకు చాంతాడంత పెరిగిపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జంట కార్పొరేషన్లలో గత కొన్ని నెలల క్రితం పర్యటించిన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా లబ్దిదారుల అందజేస్తారని ప్రచారం జరిగింది కానీ పంపిణీ మాత్రం జరగక అందని ద్రాక్షగా ఊరిస్తున్నాయి. అయితే వేల సంఖ్యలో ఉన్న లబ్దిదారులను వడపోసి అర్హుల జాబితా తయారీ చేయడం అధికారులకు, నాయకులకు గగనతరమనే పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
గతంలో పలువురు లబ్దిదారులతో కూడిన జాబితా అంటూ వార్తలు వెలువడగానే పలువురి నుంచి వ్యతిరేకత వొచ్చిన సంఘటనలు ఉన్నాయి. వివిద పార్టీల నాయకులతో పాటు సొంత పార్టీ నాయకుల నుంచి సైతం జాబితాపై పర్వతాపూర్ ప్రాంతంలో అభ్యంతరాలు వ్యక్తమైన విషయం విధితమే. జంట బల్దియాల పరిధిలో సర్కార్ ఆయా ప్రాంతాల్లో మరిన్ని గృహాలు మంజూరీ చేసి యుద్ధ ప్రాతిపదికన నిర్మాణాలు పూర్తి చేసి అర్హులైన లబ్దిదారులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలనే డిమాండ్ నానాటికీ అధికమవుతుంది. ఇండ్లిచ్చి తమను ఆదుకోవాలని, ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికలంటూ ముహూర్తం చూడకుండా ఇండ్తు కేటాయించాలని పలువురు సర్కార్‌ను కోరుతున్నారు.