వేలాదిగా తరలి వొచ్చిన ప్రజలు..గంగ ఒడికి చేరిన మహాలక్ష్మీ గణపతి
ప్రఖ్యాత ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఉత్సాహంగా సాగింది. తొమ్మిది రోజులు ఘనంగా పూజలు అందుకున్న పంచముఖ మహాలక్ష్మి గణపతి గంగమ్మ ఒడికి చేరడానికి తరలివెళ్లాడు. దీనికి ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శోభాయాత్ర ఏర్పాట్లను మంత్రులు, ఉత్సవసమితి నేతలు పర్యవేక్షించారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని, తీగగల కృష్ణారెడ్డి తదితరులు చార్మినార్ వద్ద స్వాగతం పలికారు. ఇదిలావుంటే 67 సంవత్సరాల ఉత్సవ కమిటీ చరిత్రలో తొలిసారి 50 అడుగులు మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన విషయం తెలిసిందే. మహాగణపతిని తరలించడానికి 70 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో 26 టైర్ల టస్కర్ వాహనాన్ని ఏర్పాటు చేశారు. 70 టన్నుల బరువుతో త్రిశక్తి మహాగాయత్రి, షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి సమేతంగా కొలువుదీరిన ఖైరతాబాద్ పంచముఖ మహాగణతి సెన్సెషన్ థియేటర్, ఐఐఎంసీ కళాశాల చౌరస్తా, టెలిఫోన్ భవన్, పాత సచివాలయం గేటు, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ చౌరస్తా, లుంబినీ పార్కు వి•దుగా ట్యాంక్‌బండ్‌పైకి చేరుకుంది. మొత్తం 2.5 కిలోవి•టర్ల పొడవు సాగనున్న శోభాయాత్ర ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబర్ 4 వద్ద ముగిసింది. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో గణపయ్య నిమజ్జనం పూర్తయింది. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా పనులు పూర్తికాకపోవడంతో ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర కాస్త ఆలస్యంగా మొదలైంది. వెల్డింగ్ పనులు పూర్తి అయిన వెంటనే శోభాయాత్రను నిర్వాహకులు ప్రారంభించారు. వేలాది మంది భక్తులతో ఖైరతాబాద్ గణెష్ శోభాయాత్ర కొనసాగింది.