- దుబ్బాక, హుజూరాబాద్‌లో ఇలాగే జరిగింది
- ఇప్పుడు సమస్యలు పట్టించుకుంటామంటే బిజెపిని నమ్మాలా?
- టిఆర్ఎస్, బిజెపిలపై మండిపడ్డ రేవంత్
నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 29 : రాష్ట్రంలో ఉప ఎన్నికలు వొచ్చినప్పుడల్లా టీఆర్ఎస్, బీజేపీ వివాదాస్పద అంశాలను లేవనెత్తుతూ లబ్ది పొందుతున్నాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రెండు పార్టీలు కూడా వ్యూహాత్మకంగా ఇలాంటి అంశాలను తెరపైకి తీసుకొస్తున్నాయని మండిపడ్డారు. గతంలో దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా కూడా ఇలానే రెండు పార్టీలు వ్యవహరించాయని ఆరోపించారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బంధువుల ఇంట్లో పోలీసులతో దాడులు చేయించి..ఆయనకు సానుభూతి కలిగేలా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేసిందన్నారు. కేసీఆర్‌ను ఓడించాలనే ఉద్దేశంతో చాలామంది వోటర్లు రఘునందన్ రావుకు వోట్లు వేసి ఆయన్ను గెలిపించారని చెప్పారు.
రఘునందన్ రావుతో పాటు ఆయన బంధువులపై పెట్టిన కేసులు దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత ఏమయ్యాయని ప్రశ్నించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఈటల రాజేందర్‌పై కేసులు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చేసిందని చెప్పారు. ఆ సమయంలో కేవలం పోటీలో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉన్నట్లుగా రెండు పార్టీలు చిత్రీకరించాయని, పోటీలో అసలు కాంగ్రెస్ పార్టీ లేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్దిపొందాయని ఆరోపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ముందు ఈటల రాజేందర్‌పై పెట్టిన కేసులు ఎక్కడకు పోయాయని ప్రశ్నించారు.
ఈ క్రమంలో మునుగోడులో కూడా ఇలాంటి డ్రామాలు నడుస్తున్నాయని అన్నారు. టిఆర్ఎస్, బిజెపిలను ఓడిస్తేనే ప్రజలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని రేవంత్ అన్నారు. ఆ రెండు పార్టీలతో ఒరిగిందేవి• లేదని తేలిపోయిందన్నారు.
ఇప్పుడు సమస్యలు పట్టించుకుంటామంటే బిజెపిని నమ్మాలా?
మునుగోడు సమస్యలు ఎన్నడూ బిజెపి పట్టించుకోలేదని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పుడు పట్టించుకుని పనిచేస్తామని అంటే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతితో కలసి ఆయన ప్రచారం నిర్వహించారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డికున్న మంచిపేరు ఇప్పుడు కాంగ్రెస్‌ను గెలిపిస్తుందన్నారు. టిఆర్ఎస్, బిజెపిలు ఎనని కుట్రలు చేసినా కాంగ్రెస్ గెలుపును ఆపలేరని అన్నారు. అలాగే కాంగ్రెస్‌ను తక్కువ చేయాలని బిజెపి, టిఆర్ఎస్లు కుట్ర చేస్తున్నారని మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా రేవంత్ మాట్లాడారు. మునుగోడు సమస్యలపై కొట్లాడకుండా రాజగోపాల్ రెడ్డి వి• వోట్లను అమ్ముకున్నాడని దుయ్యబట్టారు.
మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని దిల్లీ పెద్దల దగ్గర తాకట్టు పెట్టారని, అమ్ముడు పోయిన రాజగోపాల్ మళ్లీ కొట్లాడుతానంటే ప్రజలు నమ్మరన్నారు. మునుగోడు సమస్యలపై అసెంబ్లీలో కొట్లాడే తెగువ మన ఆడబిడ్డ పాల్వాయి స్రవంతికే ఉందన్నారు. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి సవాల్‌ను విసిరితే రాజగోపాల్ రెడ్డి పారిపోయాడని, తడిగుడ్డతో గొంతు కోసే బిజెపి, తడిబట్టల ప్రమాణాలను జనం నమ్మరని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారి ఆడబిడ్డకు అవకాశం ఇవ్వాలని మునుగోడు ప్రజలను కోరారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పరిధిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు.