ఉమ్మడి ఆంధప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడినప్పుడు జరిగిన ఒడంబడిక ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్ళపాటు కొనసాగుతుంది. ఆ ఒప్పందం 2024 నాటికి ముగియనుండగా మరోసారి హైదరాబాద్ విషయంలో చర్చ పునారావృతం అవుతున్నది. పద్నాలుగేళ్ళ తెలంగాణ ఉద్యమకాలంలో ఈ విషయం రాజకీయ పార్టీలు, ఇతర ప్రజాసంఘాల మధ్య తీవ్రంగా నలిగిన విషయం తెలియంది కాదు. తెలంగాణ నుండి ఏపీ విడిపోతున్న క్రమంలో తమకు రాజధాని ఏర్పాటు చేసుకునేంత పెద్ద నగరం లేదని గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే అక్కడ రాజధాని నిర్మాణం జరిగే వరకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఇరు ప్రభుత్వాలు నిర్వహించు కోవచ్చని విభజన హామీల్లో పొందుపర్చారు. అందుకు పది ఏండ్ల సమయాన్ని కేటాయించడమైంది. 2014కు ఆ పది సంవత్సరాలు పూర్తి కావస్తుండగా ఇప్పుడు మరోసారి హైదరాబాద్ అంశాన్ని లేవనెత్తే ప్రయత్నాలు చేస్తున్నారు. విభజనలో భాగంగా హైదరాబాద్ నగరాన్ని కోల్పోతున్నామన్న సీమాంధ్రులు తమకు దక్కనిది ఎదుటివారికి కూడా దక్కనీయవద్దన్న లక్ష్యంగా హైదరాబాద్‌ను దేశానికి రెండవ రాజధాని చేయాలని, కాని పక్షంలో కేంద్ర పాలిత(యుటి) ప్రాంతంగా చేయాలని పట్టుపట్టారు. అందుకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 3లో చేసిన సూచనలను ముందుకు తీసుకువచ్చారు. ఉత్తర, దక్షిణాది ప్రాంతాల వారిలో మధ్య అసమానతలను తొలగించడంలో భాగంగానే ఆయన పై విధంగా సూచనలు చేసినట్లు నిపుణులు చెబుతున్నారు. అంతేగాక దేశ భద్రత దృష్ట్యా కూడా ఆయన పై సూచన చేసినట్లు చెబుతున్నారు. మన పక్కన శత్రుదేశాలైన పాకిస్తాన్, చైనా సరిహద్దులకు ప్రస్తుత దేశ రాజధాని దిల్లీ అతి సమీపంలో ఉన్నందున, రాజధానిపై దాడులు జరిగే క్రమంలో పాలనలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా దక్షిణాదిలో రెండవ రాజధానిని ఏర్పాటు చేసుకోవడం సముచితంగా ఉంటుందన్నది అందులో సూచించడమైంది.
అంతేగాక హైదరాబాద్ అన్ని విధాలుగా సురక్షిత ప్రాంతంగా గుర్తించబడింది. సముద్రమార్గంలో యుద్ధ నౌకలను తరలించే అవకాశం లేదు. దిల్లీతో పోలిస్తే కాలుష్యపరంగా, తుఫాను, భూకంపాలు లాంటి ప్రమాదాలుండవు. పైగా ఇప్పటికే ఇక్కడ రాష్ట్రపతి వేసవి విడిది కూడా ఉంది. అన్నిటికీ మించి ఇది మెట్రోపాలిటన్ సిటీ. తెలుగువారితో పాటు మరాఠా, కన్నడీగులు, బెంగాలి, తమిళ, యుపి, బీహార్, జార?ండ్, చత్తీస్‌గడ్ రాష్ట్రాలకు చెందిన, క్రైస్తవ, ముస్లిం, పార్శీ, జైన, సిక్కు మతస్తుల సంగమంగా విలసిల్లుతున్న ప్రాంతంగా హైదారాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. మరో ప్రధాన విషయమేమంటే దక్షిణాది ప్రాంతంవారికి దిల్లీ చాలా దూరం. పైగా అక్కడంతా హిందీ డామినేషన్. దక్షిణాది ప్రాంతాలవారికి అది కొరుకుడు పడదు. దిల్లీకి వెళ్ళి పనులు చేయించుకోవడం ఈ ప్రాంతాలవారికి ఇబ్బందికరం. అందుకు హైదరాబాద్ దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ అందుబాటులో ఉంటుందన్నది ఇందులోని ప్రధాన ఉద్దేశ్యం. దీన్ని విభజన ఇష్టంలేని ఏపీ నాయకులు తమకు అనుకూలంగా మార్చుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు. తెలంగాణ ప్రజలు దాన్ని బాగా వ్యతిరేకించడంతో గడచిన పదేళ్ళుగా హైదరాబాద్ విషయం మరెప్పుడూ ప్రస్తావనకు రాలేదు. విభజన ఒప్పందం ప్రకారం పదేళ్ళు దాటుతున్నా ఏపీ ప్రభుత్వం ఇంతవరకు రాజధాని నిర్మాణం చేసుకోలేదు. రాజధాని ఒకటా, మూడు రాజధానులా అన్న మీమాంసలోనే ఈ పదేళ్ళ కాలం గడిచిపోయింది. ఏపీలో రెండు ప్రభుత్వాలు మారినా ఇంకా ఏకాభిప్రాయం కుదరటంలేదు. ఇక్కడ ఒకవిషయం గ్రహించాల్సిందేమంటే రాజధాని ఏర్పడకున్నా ప్రభుత్వ కార్యక్రమాలన్ని ఏపీలోనే జరుగుతున్నాయి. విభజన జరిగిన కొద్దికాలానికే హైదరాబాద్‌తో సంబంధం లేకుండా ఏపీ ప్రభుత్వం తమ కార్యక్రమాలన్నిటినీ తమ స్వంత రాష్ట్రం నుండే నిర్వహించుకుంటున్నది.
కాని, ఇప్పుడు మరోసారి హైదరాబాద్‌ను దేశానికి రెండవ రాజధానిగా చేయాలన్న మాటలు వినవస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ మనుమడు, మాజీ ఎంపి ప్రకాశ్ అంబేద్కర్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌ను రెండవ రాజధానిగా చేయడం సముచితమన్నారు. అప్పుడే దేశం సురక్షితంగా ఉంటుందన్న నమ్మం కలుగుతుందన్నారు. అయితే ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుకూల నిర్ణయం అవసరమన్న విషయాన్ని సాక్షత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో చెప్పారు. ఇదిలా ఉంటే హనుమకొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఒక సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొన్న టైమ్స్ ఆఫ్ ఇండియా పూర్వ ఎడిటర్ కిమ్ సుక్ నాగ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పాలనా వ్యవస్థ దక్షిణాది ప్రాంతాలవారికి కూడా అందుబాటులో ఉండాలని, అందుకు హైదరాబాదే తగిన నగరంగా ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్యమం జరిగిన పద్నాలుగేళ్ళ కాలంలో ఈ విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఉద్యమకారుడు, తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ కూడా అ సమావేశంలో ఉండటం గమనార్హం. గతంలో ఆయన హైదరాబాద్‌ను రెండవ రాజధానిగా చేయడానికిగాని, యుటి చేయడానికిగాని ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోమని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు.
అయితే ఇక్కడ సుప్రీమ్ కోర్టు బెంచ్‌ని ఏర్పాటు చేసే విషయంలో, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు మాత్రం తాము స్వాగతిస్తామని చెప్పారు. కాగా సీమాంధ్ర నాయకులు కొందరు ఇందుకు అనుకూలంకాగా, మరి కొందరు వ్యతిరేకిస్తున్నవారూ లేకపోలేదు. ఇది పాలనా పరంగా కష్టసాధ్యమన్నది వారి అభిప్రాయం. సంబందిత శాఖల మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు రెండు రాజధానుల మధ్య తిరగడమన్నది చాలా కష్టం. అధికారులు అందుబాటులో లేకుండా ప్రభుత్వ కార్యకలాపాలు ఎలా సాగుతాయన్నది వారి ప్రశ్న. దీనిపై బిజెపీ కేంద్ర నాయకత్వం అలాంటిదేమీ తమ ఆలోచనలో లేదని చెబుతున్నా, బిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రభుత్వంపైన కోపంగా ఉన్న స్థానిక నాయకులు మాత్రం అందుకు అనుకూలమన్న భావనను కలిగిస్తున్నారు. ఇంకా ఎన్నికలకు సంవత్సరం కాలం ఉందన్నప్పటి నుండే ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ డిమాండ్ చేసిన వీరికి హైదరాబాద్ కేంద్రం ఆధీనంలో ఉండాలన్న అభిప్రాయముంది. రానున్న ఎన్నికల్లో ఎలాగూ తమ పార్టీనే అధికారంలోకి వొస్తుందన్న ధీమాతో ఉన్న బిజెపి రాష్ట్ర నాయత్వం ఇప్పుడా డిమాండ్‌పైన పెద్దగా పట్టుదలను చూపించడం లేదు. ఇదిలా ఉంటే జాతీయ పార్టీగా మారిన నాటి ఉద్యమపార్టీ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.