ఆమో అతనో ఎవరో
ఎనలేని మార్పు కోరుతున్నారు
అది ఇక ముందులా ఉండొద్దు
కొన్ని టైప్స్ లోనో పోలికల్లోనో పొసగొద్దు
ఒక నయా అనుభూతినివ్వాలె
చూడంగానో వినంగానో
అరె ఇది మాకు తట్టలేదే
అన్న ప్రశ్న లోలోపలికెళ్ళాలె నేరుగా
ఇదో ఆర్కిటైప్ అసలే అవ్వొద్దు
దీనిలా కొన్ని కాపీలూ మోడల్స్ రానూవొద్దు
ఎన్నాళ్ళుండాలో అలా అవన్నీ పట్టవు వాళ్ళకు
ఒక కొత్తది అందించాలె అంతె
దాని ఆబ్జెక్ట్, మోటివ్ ఆ తర్వాత వెంటాడాలె
వాళ్ళో నదిలోకి దూకారు ఇదే వెతుకుతూ
కొన్ని సంవత్సరాల పరిధిలో
ఏ కాలాంతరాల్లో తప్పిపోయిన
వీళ్ళ చిత్రాలు మాత్రం అంటించబడ్డాయి
భూమధ్యరేఖ వద్ద!
వీళ్ళు కన్న కలేమో ఎన్ని డిగ్రీలు చేస్తో
సూర్యుడి గమనంలో…
కలుస్తూ మెదుల్తూ ఇంకా వేచి చూస్తుంది
ఆలోచనల అల్లికలు అదృశ్యరూపంలో
విశ్వం ఉపచేతనలో అచేతనగా తడుతూ
తెలియనితనంలోకి నెడుతూ
ప్రశ్నార్థక చిహ్నాల్లా నడిపిస్తూ
కనిపించే పదార్థం ఊ(ర)టనిచ్చే బావిలా మెరుస్తూ
ఒక దీర్ఘ కవితై పాదాల మధ్య నీడై
తలకింద దిండై నిద్దట్లో ఎరుకై
ఎరుకలో మెలుకువై కలతై విపరీతమై
మనిషిని మనుగడకు ఆవల సరిహద్దుల్లో
అనంత శిఖరాగ్రిలోకి ఉసిగొల్పుతూ
వాస్తవ లోకంలో గట్టి రియాల్టీ షాక్ ఇస్తూ
ఒక ఉన్మాద తత్వాన్ని రాజీ ధోరణికి ఈడ్చుకొచ్చి
పనిచేయిస్తుంది సంతులనపరిచి చక్కగా…
అప్పుడు నిజంగానే ఆవిష్కరించబడుతుంది కొత్తగా!!
– రఘు వగ్గు, 9603245215