తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం పలు దశలుగా సుదీర్ఘకాలంగా వివిధ రూపాల్లో నడిచిన పోరాట ఫలితం అనేది చారిత్రక సత్యం. ఏక వాక్యంలో చెప్పాలంటే 60 సంవత్సరాలుగా సాగిన ప్రజా పోరాటాల అంతిమ విజయమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. ఉప్పెనలా ఎగిసిపడిన అనేక పోరాటాలు, అనేక ఆటుపోట్లు, వాదప్రతివాదనలు, చర్చోప చర్చలు, సమాలోచనలు, రాజకీయ ఒప్పందాలు, అవకాశవాద ఉల్లంఘనలు, రాజకీయ పార్టీల స్థాపన, పార్టీల విలీనం, ఇలా అనేక సంఘటనలను, అనేక మోసాలను, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చవిచూసింది. ఆ అలుపెరగని పోరాటాల ద్వారా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఏం సాధించినరని అనేక పురిటి నొప్పులను అనుభవించి.. వేలాది బిడ్డలను కోల్పోయిన తెలంగాణ త్యాగాల తోవ ప్రశ్నిస్తుంది.ఈ సందర్భంగా ఎనిమిదేళ్ల తెలంగాణను అవలోకనం చేసుకోవలసిన అవసరం ఉన్నది.
త్యాగాల తో రూపుదాల్చిన తెలంగాణ
ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు అనేవి రాజకీయ వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.ప్రజల ఆశలు,ప్రజల ఆకాంక్షలను వారి డిమాండ్లను, ప్రతిబింబించే విధంగా రాజకీయ ప్రక్రియ ఉండాలని ప్రజాస్వామిక ఆకాంక్ష. కానీ అందుకు భిన్నంగా దశాబ్దాలుగా ప్రాంతీయ ఆధిపత్యం, వనరుల దోపిడీ, ఆత్మగౌరవం, సాంస్కృతిక వివక్షత, కొల్లగొట్టిన లక్షలాది ఉద్యోగాలు,భూముల పరాయీకరణ, నదీజలాలను చెరపట్టడం, ఈ ప్రాంతపు విద్యావ్యవస్థను కుప్ప కూల్చడం మొత్తంగా సీమాంధ్ర పాలకులు తెలంగాణ అస్తిత్వాన్ని ధ్వంసం చేయడంతో వీటన్నింటికీ పరిష్కార మార్గంగా తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి.. తెలంగాణ ప్రజల సామూహిక ఆకాంక్షలు వ్యక్తం చేసుకోవడానికి.. అసాధారణమైన త్యాగం, రక్తం, కన్నీళ్లను బలి పెట్టాల్సి వచ్చింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో లో పాట ముక్కలయింది, పాట పై తూటా పేలింది, నూనూగు మీసాల త్యాగాలు సైతం తెలంగాణ సమాజాన్ని ఎంతో చైతన్యవంతం చేశాయి.ఈ త్యాగాలు చెప్పిన తెలంగాణ పఠం ఎలా ఉండాలో.. దానికి ఎలా ప్రాణం పోయా లో భువనగిరి,వరంగల్, సూర్యాపేట డిక్లరేషన్లు ఇంకా కళ్లముందే కనబడుతున్నాయి. ఈ అసాధారణమైన త్యాగాలతో దేశంలోనే అతి భయంకరమైన ఆధిపత్య శక్తులకు ఎదురొడ్డి తెలంగాణను జూన్ 2న సాధించుకున్నది. జూన్ 2 అనేది ఒకటో తేదీ మాత్రమే కాదు దశాబ్దాల ఉద్యమ ఆకాంక్షల ప్రతిబింబం.
ఎనిమిదేండ్ల తెలంగాణకు ఏమి ఒరిగింది..?
తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పట్ల బలమైన ఉద్యమాన్ని నిర్మించడానికి ఈ రాష్ట్ర సాధన ఉద్యమంలో అనేక రాజకీయ పార్టీలు క్రియాశీలంగా పాల్గొన్నాయి. వివిధ రాజకీయ పార్టీలకు వివిధ రకాల సిద్ధాంత భావజాలాలు ఉన్నప్పటికీ ఒకే వేదికపై నుంచి పని చేయవలసిన అవసరాన్ని తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చింది. ఇన్ని పార్టీలు అన్ని ప్రజా సంఘాలు పోరాడినప్పటికీ దశాబ్దాల తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చ గలిగే అవకాశం 2014 లో తెలంగాణ రాష్ట్ర సమితికి ఒక చారిత్రక అవకాశం ఇచ్చారు.2018 లోను కూడా ఇచ్చారు.తె.రా.స ఈ అవకాశాన్ని అనతికాలంలోనే దుర్వినియోగ పరచడం లో ప్రపంచం లో ఎక్కడా కూడా ఇంత త్వరగా జరగలేదు.
అదే సీమాంధ్ర నమునా…
స్వీయ పాలన అవకాశాన్ని చేపట్టిన తెరాస ప్రభుత్వం తెలంగాణ కు వనరులు, అవకాశాలు, ఆదాయ మార్గాలు, సౌకర్యాలు, ఎక్కడ లేనంతగా ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగం చేయాల్సింది పోయి పూర్తిగా దుర్వినియోగం చేసింది అనడంలో తెలంగాణ ప్రజలకు ఎలాంటి సందేహం లేదు. ఉపాధి అవకాశాలకు అవకాశం ఇవ్వని రీతిలో పెట్టుబడుల విధానాన్ని తీసుకొచ్చి ఎంతో మంది నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణం ఐయింది.సీమాంధ్ర పాలనలోని కార్పొరేట్ శక్తులకు ఇచ్చిన ప్రాధాన్యత కంటే రెట్టింపుగా తెలంగాణ ప్రభుత్వం వనరులను తమ కార్పొరేట్ అననూయులకు అప్పజెప్పింది..అది.. హైదరాబాద్ చుట్టూ ఉన్న విలువైన భూములను ఆరుకు మూరుకు అప్పనంగా అప్పజెప్పింది. ప్రపంచ పెట్టుబడుల పేరుమీద తెలంగాణ భవిష్యత్తు తరాలకు అందాల్సిన భూములను అమ్మి వేసింది. ఒక్క ఎత్తిపోతల ప్రాజెక్టును కట్టి (తెలంగాణ రాష్ట్రం లోని ప్రాజెక్టులన్ని పక్కకుబెట్టి) తెలంగాణ సంపాదనంతా ఆ ప్రాజెక్టు పేరుతో నే ఖజానాను ఖాళీ చేసింది. తెలంగాణ ఆర్థిక పునర్నిర్మాణంలో తెలంగాణ ప్రజలకు కనీస భాగస్వామ్యం దక్కకపోగా ఇక్కడ ఆర్థిక అవకాశాలను, సంపదనంతా మెఘా, మైహోమ్,ఎటిరో మొదలగు దోపిడీ శక్తుల పాలు చేసింది. ప్రజలు చెమట చుక్కలు చిందించి సంపాదించిగా వచ్చిన ఆదాయాన్ని పన్నుల రూపంలో వసూలు చేసి ఏలాంటి పద్దతులు ప్రణాళికలు లేకుండానే తన ఇష్టారీతిగా ఖర్చు చేస్తూ ఈనగాసి నక్కల పాలు చేసినట్లుగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేసినరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆనాడు కూడా సీమాంధ్ర పాలకులు తెలంగాణ ఆర్థిక వనరులను తెలంగాణ ప్రజలకు దక్కనియ్యలేదు.. అదే విధమైన నమూనాను కొనసాగిస్తూన్నారు. ఆనాడు సమైక్య పాలకులు తెలంగాణ ప్రాంత వనరులను వారి ప్రాంతానికి ఉపయోగించుకుంటే.. నేడు తెలంగాణ ఆర్థిక వనరులను తెలంగాణ ప్రజలకు దక్కకుండా తెలంగాణ పాలకులు కాంట్రాక్టర్లను అడ్డం పెట్టుకొని తమ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. త్యాగధనుల కోరుకున్న తెలంగాణ అభివృద్ధి జరగకపోగా లక్షల కోట్ల అప్పులపాలై మూలుగుతున్నది.
పెచ్చమీరుతున్న సామాజిక అంతరాలు
తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణ సమాజం లోని కుల మత తత్వాలను పెకిలించింది. ఈ దేశానికి ఒక ఆదర్శవంతమైన సామాజిక వ్యవస్థను ప్రగతిశీల మార్పు దిశగా ఆచరించి తెలంగాణ కే గాక దేశానికి భవిష్యత్తు పత్రాన్ని చూపించింది. కానీ సమైక్యాంధ్ర పాలనలో కుల మత రక్కసిని పెంచి పోషించి సామాజిక అసంతృప్తులను సృష్టించి అసమానతలను బలోపేతం చేసింది.ఆ విధంగా కాకుండా తెలంగాణ ప్రభుత్వం సామాజిక అంతరాలను విధ్వంసం చేసి ఒక నమూనాగా ఆచరించాల్సిన స్వీయ ప్రభుత్వం ఈ ఏడేళ్ల కాలంలో ఆ బాధ్యతలు తీసుకొనకపోగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఎన్నడూ జరగనంత గా కుల హత్యలు చోటుచేసుకోవడం ఈ ప్రభుత్వ పాలనలో ఒక ప్రేరణ గా చెప్పవచ్చు. ఈ తరహా ప్యూడల్ లక్షణాలకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటంతో పాటు ఆ పరంపరలో నక్సల్బరి రాజకీయాల సృష్టించిన చైతన్యం, అస్తిత్వ ఉద్యమాలు చేసిన పోరాటాలు సామాజిక అంతరాల మీద ఎక్కుపెట్టి సామాజిక సామరస్యత కు అంకురార్పణ చేశాయి.
కానీ నేటి తెరాస పాలనలో గ్రామాలన్నీ గడి ల చుట్టూ తిరుగుతూ కుల అహంకారాన్ని పెంచి పోషిస్తున్నాయి. ఈ ప్రాంతంలో వెలిసిన ప్రగతిశీల భావజాలాలు సామాజిక సమానత్వానికి ప్రతీక అని తెలంగాణ ఉద్యమం మరింత చాటి చెప్పింది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఈ దిశగా పురోగమించవలిసిన దానికి ప్రేరణ గా ఉండాల్సిన ప్రభుత్వం తన అధికారాన్ని, ఆధిపత్యాన్ని, స్థిరపర్చుకోవడానికి మరింత బలంగా మత పునరుద్దరణ వాదాన్ని ముందుకు తెచ్చింది. ప్రజల పేదరికాన్ని నివారించడానికి ఉపయోగించాల్సిన సామాజిక వనరులను ..యజ్ఞాలు యాగాలు,దేవాలయాలు, వాస్తు పేరు మీద,విచ్చలవిడిగా ఖర్చు చేసి ఇంతటి అజ్ఞానపు వ్యవస్థను సృష్టించడమే గాక సమాజాన్ని కూడా ఆ వైపుగా ప్రయాణించడానికి కంకణం కట్టుకోవడం సామాజిక అంతరాలు పెంచి పోషించడంలో ప్రధానమైన భాగం అనడం లో ఎలాంటి సంకోచం లేదు.
పరిపక్వత లేని పాలనా రాజకీయ వ్యవస్థ
సీమాంధ్ర పాలనలోని రాజకీయాలు విలువలను, ప్రజాస్వామిక విశ్వాసాలను ధ్వంసం చేసి అమ్మడు కొనుడు అనే మార్కెటింగ్ రాజకీయ వ్యవస్థను సృష్టించడం వలనే.. తెలంగాణ తన విలువల రీత్యా ఆ రాజకీయాలలో భాగం పొందలేకపోయింది. తమదైన అస్తిత్వం, చైతన్యంతో కూడిన రాజకీయాలు కావాలని తెలంగాణ ఉద్యమం విశ్వసించింది. కానీ స్వరాష్ట్రంలో మరింత విచ్చలవిడిగా అదే సీమాంధ్ర రాజకీయ సంస్కృతే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఆచరించి అదే ప్రత్యామ్నాయమని అట్టడుగు స్థాయిలోకి సైతం చేరవేసింది. తెలంగాణ ఉద్యమకారులకు పాలనలో అవకాశం కల్పించకపోవడం మూలంగా విలువలతో కూడిన రాజకీయాలు.. పాలనా విధానాలు.. రూపుదిద్దుకునే క్రమంలో ఉద్యమ ఆకాంక్షలకు చోటు దక్కకుండా చూసేందుకు ఉద్దేశ్యపూర్వకంగా ఉద్యమకారులకు పాలనలో ఆ స్థానం దక్కలేదు. కానీ ఆ నాడు తెలంగాణ ఉద్యమకారులు వ్యతిరేకించిన, వెంటాడిన, ప్రతిఘటించిన వారే.. నేడు సీమాంధ్ర వలస వాద రాజకీయ నమూనాను యధాతధంగా పునప్రతిష్టుస్తున్నారు. వారు ఆనాడు కొనసాగించిన పాలనా విధానాలే నేడు యధాతధంగా కొనసాగిస్తున్నారు.
పరాకాష్ఠకు చేరిన నిర్బంధం
తెలంగాణ సమాజం యొక్క సహజ లక్షణం నిర్బంధాన్ని, పీడనాన్ని, ప్రతిఘటించే చరిత్ర వేయిల సంవత్సరాలుగా ఉంది.నిర్బంధం పై ఇక్కడ జరిగిన ప్రతిఘటనలు వ్యక్తిగతంగానూ, సామాజికంగానూ, ఎక్కడా జరగలేదు. సీమాంధ్ర పాలనలో వచ్చిన నిర్బంధాలను ఎదిరించడానికి అసంఖ్యాక త్యాగాలు చేయడానికి సైతం ఇక్కడి యువత వెనుకాడలేదు. అత్యంత బలమైన సీమాంధ్ర నిర్భంధ పాలనను కూడా తన ఆత్మ గౌరవం కోసం ముక్తకంఠంతో ఎదిరించి నిలువరించింది తెలంగాణ సమాజం. ఈ అవగాహనను కోల్పోయిన తెలంగాణ రాష్ట్ర పాలకులు తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి తమ పాలనకు అడ్డూ అదుపు లేకుండా కొనసాగించుకోవడానికి సీమాంధ్ర తరహాను మించిన పోలీసు వ్యవస్థను సృష్టించుకొని అసాధారణ స్థితిలో బలోపేతం చేసుకుంది. దీనిని విచ్చలవిడిగా ప్రజల మీదికి సి గొలుపుతుంది. తెలంగాణలోని ప్రతిపక్షాలపైన, ప్రజల గొంతుకగా ఉన్న పౌర సమాజంను, ప్రగతి శీల శక్తులను నిలువరించడానికి లాఠీ లను, సాంకేతికతను, తూటాలను,నిఘా విభాగాన్ని అడ్డం పెట్టుకొని ప్రజా ఉద్యమకారులను బలి తీసుకునే ప్రయత్నం చేస్తుంది. పాట మీద, మాట మీద, కళం మీద, మొత్తంగా అపక్రమ స్వేచ్ఛపై ఇనుప బూట్ల పాదాలను మోపుతుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ సమాజం సృష్టించుకున్న అరుదైన ప్రజా సంఘాలను ఒక్కొక్కటిగా టార్గెట్ చేసి నిర్మూలించ చూస్తుంది. ఇది మధ్యయుగపు పాలకుల నమూనా స్థితికి పరాకాష్ట.
పోరాటం మిగిలే ఉంది
ఉద్యమ ఆకాంక్షను సాధించుకోవడానికి,మన వనరులు మనం రక్షించుకోవడానికి,తెలంగాణ యువతరాన్ని కాపాడుకోవడానికి, రైతులు రైతాంగాన్ని కాపాడుకోవడానికి, అంతిమంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి రాష్ట్రంలోని పాలకుల మీద రాష్ట్ర వనరులను కొల్లగొడుతున్న వారిపైన పోరాటం చేయడానికి సంసిద్ధులు కావలసిన సమయం ఆసన్నమైంది. ప్రభుత్వాలపై నిరంతరం ఒత్తిడి పెంచడం ద్వారా నే ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చలేదని తేలిపోయింది. ఈ సందర్భంలో ఉద్యమ ఆకాంక్షలకు చోటు దక్కాలంటే నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాడాలి ..ఈ పోరాటం ఇప్పుడున్న పాలక స్వభావ లక్షణాలను మార్చి వేయడంతోపాటు తెలంగాణ భవిష్యత్తును ఆకాంక్షిస్తున్న ఆదర్శవంతమైన విలువలతో కూడిన రాజకీయాలు సృష్టించడం కూడా అందుకు కావలసిన రాజకీయ వనరులను సమీకరించు కోవడం కూడా ఉద్యమ ప్రాతిపదికన జరగాలనేది బలమైన ప్రజా ఆకాంక్ష.
– తెలంగాణ విద్యావంతుల వేదిక, రాష్ట్ర కమిటీ పక్షాన
పందుల సైదులు, 944166119