ఎన్‌కౌంటర్లు కావు, బూటకపు ఎదురు కాల్పులు, హత్యలు

“పౌరహక్కుల సంఘం తరఫున డాక్టర్‌ బాలగోపాల్‌ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఒక దరఖాస్తు తయారు చేశాడు. ఆ దరఖాస్తులో దాదాపు 250 మంది ఎన్‌కౌంటర్‌ హత్యల గురించి పూర్తి వివరాలు పొందుపరిచాడు. అవి ఎట్లా నిజమైన ఎదురు కాల్పులు కావో, కార్యకర్తలను, ప్రజలను పట్టుకుని కాల్చివేసి ఎన్‌కౌంటర్ల పేరు పెట్టడం జరిగిందో, కట్టు కథలు అల్లడం జరిగిందో ఆ దరఖాస్తులో వివరించాం.”

‘శిక్షార్హమైన హత్య’ అనే మాటకు ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ ఇచ్చిన నిర్వచనాన్ని ఉటంకించి ‘‘మధుసూదన్‌ రాజ్‌ యాదప్‌ శరీరం మీద తుపాకితో కాల్పులు జరిపిన పోలీసు అధికారులకు ఆ చర్య ద్వారా తాము ఆయన చావుకు కారణమవుతున్నారని తెలియదనడం కష్టం. వారు చేసిన పని సమర్థనీయమవునా కాదా, ఒక నేరం నిర్వచనానికి సరిపోయే ఆ చర్య క్షమార్హమవునా కాదా పరిశీలించవలసిన విషయాలే. కాని వారు చేసిన వాదన నిజానిజాలను చట్టాన్ని అనుసరించి పరీక్షించినప్పుడు, నేరం చేయబడిందనే విషయం గాని, మధుసూదన్‌ రాజ్‌ యాదప్‌ మీద కాల్పులు జరిపారంటున్న వారి మీద శిక్షార్హమైన హత్యానేరం నమోదు చేయలేదనే విషయంగాని విస్మరించడం సరైనదీ కాదు, న్యాయమైనదీ కాదు. మా ముందుకు వచ్చిన ఈ విషయం గురించి మేం తీవ్రంగా ఆలోచించాం. మధుసూదన్‌ రాజ్‌ యాదప్‌ తమ మీద కాల్పులు జరిపాడని, అందువల్ల తమకేమీ గాయాలు కాలేదని, తాము అతనిపై కాల్పులు జరిపామని, ఫలితంగా అతను మరణించాడని పోలీసు అధికారులు స్వయంగా చేసిన ప్రకటన మీద ఆధారపడి ఒక కేసు నమోదు చేసుకోవలసిందని, తగిన అధికారుల చేత చట్ట ప్రకారంగా విచారణ జరపవలసిందని, అందుకు తగిన కారణాలున్నాయని మేం భావిస్తున్నాం’’ అని న్యాయమూర్తులు రాశారు. ఈ చట్ట పరమైన పరిభాషను మామూలు మాటల్లో చెప్పాలంటే అది నిజంగా ఎదురు కాల్పుల ఘటనే, ఎన్‌కౌంటర్‌ అయినా, ఒక మనిషి ప్రాణాన్ని మరో మనిషి తీయడం జరిగింది. గనుక అది హత్య కేసుగా నమోదు కావాల్సిందే. ప్రాణం తీసిన వ్యక్తి విచారణ క్రమంలో తాను ఏ పరిస్థితుల్లో, ఆత్మరక్షణ కోసం, ఆ పని చేయవలసి వచ్చిందో వివరించుకోవచ్చు.

ఈ తీర్పు చాల కీలకమైన తీర్పు. జస్టిస్‌ భార్గవా కమిషన్‌ తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత ఈ తీర్పు వచ్చిందని గుర్తించాలి. సరిగ్గా జస్టిస్‌ భార్గవ ముందర నేను ఏమి వాదించానో ఇప్పుడు రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం అదే మాట చెప్పింది. ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా అవి ఎన్‌కౌంటర్లు కావు, బూటకపు ఎదురు కాల్పులు, హత్యలు అనే నేను, నాబోటి వాళ్ళం చెపుతూ వస్తున్నాం. ఇప్పుడు హైకోర్టు ధర్మాసనం కూడ అవి హత్యలు అని, వాటిని హత్యానేరాలుగా నమోదు చేసి విచారించాలని చెప్పింది. వెంగళరావు పాలనా కాలంలో ఆయనను మేం నరహంతకుడు అని పిలిచాం. ఈ రాష్ట్రంలో ఈ ఎన్‌కౌంటర్‌ హత్యల విధానానికి రూపశిల్పి ఆయన. లేదా ఎన్‌కౌంటర్‌ హత్యల విధానాన్ని ప్రోత్సహించి, పాలనా విధానంగా మార్చిన వాడు ఆయన. లేదా ఈ ఎన్‌కౌంటర్‌ హత్యల విధానాన్ని ఎం.వి. నారాయణరావు రచిస్తే వెంగళరావు ప్రోత్సహించాడు. అంటే హై కోర్టు ధర్మాసనం తీర్పు ఈ క్రూర హంతక విధానానికి వ్యతిరేకంగా నేను చేసిన వ్యక్తిగత పోరాట సాఫల్యం అనిపించింది. అది నా వ్యక్తిగత పోరాటం కావచ్చు. లేదా రాష్ట్రంలో అద్భుతంగా పురోగమించిన పౌరహక్కుల ఉద్యపూనికి నాయకత్వం వహించిన వ్యక్తిగా చేసిన పోరాటం కావచ్చు.

దీనికి సమాంతరంగా మేం మరొక కార్యక్రమం తీసుకున్నాం. పౌరహక్కుల సంఘం తరఫున డాక్టర్‌ బాలగోపాల్‌ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఒక దరఖాస్తు తయారు చేశాడు. ఆ దరఖాస్తులో దాదాపు 250 మంది ఎన్‌కౌంటర్‌ హత్యల గురించి పూర్తి వివరాలు పొందుపరిచాడు. అవి ఎట్లా నిజమైన ఎదురు కాల్పులు కావో, కార్యకర్తలను, ప్రజలను పట్టుకుని కాల్చివేసి ఎన్‌కౌంటర్ల పేరు పెట్టడం జరిగిందో, కట్టు కథలు అల్లడం జరిగిందో ఆ దరఖాస్తులో వివరించాం. అప్పుడు జాతీయ మానవహక్కుల కమిషన్‌కు జస్టిస్‌ రంగనాథ మిశ్రా చైర్మన్‌గా ఉన్నారు. ఆయన గురించి ఎన్ని అభిప్రాయాలు వదంతులు అయినా ఉండవచ్చుగాని, ఆయన తర్వాత ఆ పదవిని అధిరోహించిన వారందరికన్న ఆయన చాలా మేలు. ఆయనకు ఒక స్థిరమైన వైఖరి తీసుకునే ధైర్యం ఉండేది. ఆయనకు ఈ పిటీషన్‌ సమర్పించి, రాష్ట్రంలో పర్యటించి ఈ విషయాల నిజానిజాలు పరిశీలించమని విజ్ఞప్తి చేశాం. ఆయన ఒప్పుకున్నాడు. నేను ఈ క్రమంలో ఆయనను ఎన్నోసార్లు కలుసుకున్నాను.

పైన చెప్పిన రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం తీర్పు 1995లో అయితే, ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్‌ విచారణ 1996లో జరిగింది. జస్టిస్‌ రంగనాథ మిశ్రా విచారణ కోసం రాష్ట్రానికి వచ్చి ఐదారు చోట్ల సమావేశాలు ఏర్పాటు చేశాడు. స్వయంగా ఆయన ముందరే పోలీసులు వరంగల్‌లోను, అనంతపురం లోను బాలగోపాల్‌ను కొట్టడానికి ప్రయత్నించారు. ఇక నల్లగొండలో విచారణ జరగ వలసి ఉండింది. అప్పుడు నేను హాజరవుతానని నేనన్నాను. జస్టిస్‌ రంగనాథ మిశ్రాకు ఫోన్‌ చేసి చెప్పాను. ‘ఆంధ్ర ప్రదేశ్‌ పోలీసులు ఎటువంటి వాళ్ళో మీకు చూపెట్టదలచు కున్నాను. నల్లగొండలో నేను హాజరయి మీకు చూపెడతాను’ అని చెప్పాను.నేను నల్లగొండ వెళ్ళాను. నన్ను కూడ జస్టిస్‌ మిశ్రా తోపాటు వేదిక మీద కూచోమన్నారు. పోలీసులు ఒక రౌడీ గుంపును తీసుకొచ్చారు. ఆ గుంపు నినాదాలు, కేకలు, అరుపులు మొదలు పెట్టింది. ఆ గొడవను ఆపడానికి, నేను లేచి ఆ అరుస్తున్న గుంపు దగ్గరికి వెళ్ళాను. నేను వేదిక మీంచి కిందిగి దిగి ఆ గుంపువైపు నడవడం మొదలు పెట్టగానే మఫ్టీలో ఉన్న స్పెషల్‌ బ్రాంచి పోలీసులు నా చుట్టూ కమ్ముకుని నన్ను కొట్టడం, అటూ ఇటూ తోయడం మొదలుపెట్టారు. అప్పుడక్కడ గోపీనాధ రెడ్డి ఎస్పీగా ఉన్నాడనుకుంటాను. నా మీద అట్లా దౌర్జన్యం జరుగుతుంటే చూస్తూ నిలబడ్డాడు. కాసేపటి తర్వాత అడ్డుకోవడానికి ప్రయత్నించినట్టు నటిస్తూ నా కారు దగ్గరికి తీసుకుపోయాడు.

నాతోపాటు నల్లగొండకు వసంత కూడా వచ్చింది. ఈ జరుగుతున్న గొడవను వసంత జస్టిస్‌ మిశ్రా దృష్టికి తీసుకువచ్చింది. అప్పటికి ఆయన ఈ గొడవ జరుగుతున్న వైపు చూడడం లేదు. అప్పుడు జస్టిస్‌ రంగనాథ మిశ్రా ఇటువైపు చూశాడు. ఆయనకు చాల కోపం వచ్చింది. భోజనం మిగిలిన కార్యక్రమాలు అన్నీ రద్దు చేశాడు. పోలీసులను పిలిచి వాళ్ళమీద విరుచుకుపడి ఏం జరిగిందని అడిగాడు. సరే, పోలీసులు ఏవో కట్టుకథలు చెప్పారు. ఈ వ్యవహారమంతా అయిపోయాక, రంగనాథ మిశ్రా హైదరాబాదు వచ్చి దిల్‌ కుషా గెస్ట్‌ హౌజ్‌లో ఎన్‌కౌంటర్ల మీద విచారణ ప్రారంభించాడు.
-కె.జి. కన్నబిరాన్‌
ఆత్మకథాత్మక సామాజిక చిత్రం
అక్షరీకరణ :ఎన్ .వేణుగోపాల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page