మేడ్చల్, ప్రజాతంత్ర, నవంబర్ 22 : నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంతోపాటు పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల ప్రక్రియను పూర్తి పారదర్శకంగా చేపడుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ ఎన్నికల అధికారులకు తెలిపారు.
బుధవారం ఢిల్లీ నుండి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్, తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ గౌతమ్, జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడి, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, సమీకృత జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ, ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ, ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ, బ్యాలెట్ పత్రాల ముద్రణ, ఈవిఎం యంత్రాల కమిషనింగ్, ఇంటి నుంచి ఓటు సేకరణ, పోలింగ్ సిబ్బంది శిక్షణ, రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ఏర్పాటు, తదితర అంశాలపై సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ జిల్లా కలెక్టర్ లకు పలు సూచనలు చేశారు. జిల్లాలో శాసనసభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డుల పంపిణీ ప్రక్రియ వేగవంతం చేశామని, ఓటింగ్ వివరాలతో కూడిన స్లిప్పులను సైతం ఇప్పటికే జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో సగటున 80 శాతం పంపిణీ పూర్తి చేశామని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తెచ్చారు. అదేవిధంగా ఓటరు ఫోటో గుర్తింపు కార్డులు (ఎపిక్) లను పోస్టల్ శాఖ ద్వారా నేరుగా ఓటర్లకు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలింగ్ నిర్వహణ కోసం ఈవీఎం బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్, టెండర్ బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తయ్యిందని, కమిషనింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు వీలుగా ఈ.సీ.ఐ.ఎల్ ఇంజినీర్ల బృందాలు జిల్లాకు చేరుకున్నారని తెలిపారు. 80 ఏళ్ళు పైబడిన వృద్ధులు, 40 శాతానికి పైగా వైకల్యం కలిగిన దివ్యంగులు కలుపుకుని మొత్తం 1070 మంది ఓట్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు అర్హులుగా గుర్తించామని, వారి ఇళ్ల వద్దకే వెళ్లి వారి ఓటును స్వీకరించేందుకు వీలుగా ప్రత్యేక పోలింగ్ బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఈ బృందాలు ఓట్ ఫ్రమ్ హోమ్ ప్రక్రియ చేపట్టేలా ప్రణాళికలు రూపొందించామని, ఈ.సీ నిబంధనలకు అనుగుణంగా పూర్తి గోప్యత పాటిస్తూ ఓటు సేకరణ జరిపేలా గట్టి చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు ఇప్పటికే రెండు విడతలుగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి పోలింగ్ విధులపై పూర్తి అవగాహన కల్పించామన్నారు. శిక్షణ కేంద్రాల వద్దే ఫెసిలిటేషన్ సెంటర్ లను నెలకొల్పి పోలింగ్ విధుల్లో నియమించబడిన సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. పోలీసులు సహా ఇతర ఎన్నికల విధుల్లో నియమించబడిన సిబ్బంది కోసం రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించిన అంశాలను ఈ.సీ దృష్టికి తెచ్చేందుకు వీలుగా అందుబాటులోకి తెచ్చిన సీ.విజిల్ యాప్ గురించి విస్తృత ప్రచారం నిర్వహిస్తూ, ఆ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సిందిగా ప్రజలకు అవగాహన కల్పించామని అన్నారు. జిల్లా స్థాయిలోనూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఫిర్యాదులను పరిష్కరిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. సువిధ పోర్టల్ ద్వారా ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు తదితర వాటి కోసం వచ్చే దరఖాస్తులను వెంటనే పరిశీలిస్తూ గడువులోపు అనుమతులు జారీ చేస్తున్నామని అన్నారు. పోలింగ్ నిర్వహణ కోసం రిసీవింగ్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను నెలకొల్పి పక్కాగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎన్నికల నోడల్ అధికారులు, కృష్ణారెడ్డి, దేవసహాయం, విజయకుమారి, ఖాసీం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.