ఎస్సీ వర్గీకరణ తీర్పును స్వాగతిస్తున్నాం

ఉద్యోగ నియామకాల్లోనూ వర్గీకరణ అమలు
అవసరమయితే ఆర్డినెన్స్‌ తీసుకొస్తాం
అసెంబ్లీలో సిఎం రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 1 : ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీమ్‌ కోర్టు తీర్పును సిఎం రేవంత్‌ రెడ్డి స్వాగతించారు. మాదిగ, మాదిగ ఉపకులాల యువకులు 27 ఏళ్లుగా పోరాటం చేశారని రేవంత్‌రెడ్డి అన్నారు. వర్గీకరణపై సుప్రీమ్‌ కోర్టు తీర్పు నేపథ్యంలో శాసనసభలో సీఎం కీలక ప్రకటన చేశారు. ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ వర్గీకరణను అమలు చేసేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. అవసరమైతే ఆర్డినెన్స్‌ తీసుకుని వొస్తామని అన్నారు. వర్గీకరణ కోసం గతంలో ఇదే శాసనసభలో వాయిదా తీర్మానం ఇచ్చామని, అప్పుడు తనతో పాటు సంపత్‌కుమార్‌ను సభ నుంచి బహిష్కరించారని సిఎం రేవంత్‌ గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఏబీసీడీ వర్గీకరణ అంశంపై ప్రధాని వద్దకు అఖిల పక్షాన్ని తీసుకెళ్తామని చెప్పిందని, అలా తీసుకెళ్లకుండా మాదిగ సోదరులను మోసం చేశారన్నారు.

డిసెంబర్‌ 3, 2023న ప్రజాప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచన మేరకు మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో శాసనసభ్యులు, అడ్వొకేట్‌ జనరల్‌ను దిల్లీకి పంపించామని, న్యాయ కోవిదులతో చర్చించి వర్గీకరణపై సుప్రీమ్‌ కోర్టులో బలమైన వాదనను కాంగ్రెస్‌ ప్రభుత్వం వినిపించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో సుప్రీమ్‌ కోర్టు మాదిగ, మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పు ఇచ్చిందని, సుప్రీమ్‌ కోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

దేశంలోనే అందరికంటే ముందు భాగాన నిలబడి ఏబీసీడీ వర్గీకరణ చేసే బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని ప్రకటించారు. ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ వర్గీకరణను అమలు చేస్తామని, దీనికి అవసరమైతే ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేస్తామని, మాదిగ, మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నానని సీఎం కోరారు. సుప్రీమ్‌ కోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page