ఏది రైతు భరోసా  !!

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఆపద వొచ్చినప్పుడే సహాయచర్యలు గుర్తుకు వొస్తాయి. ప్రతీ సంవత్సరంలాగానే ఈ ఏడుకూడా గత నాలుగు రోజులుగా అకాల వార్షాలు సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. ఒక జిల్లా, ఒక ప్రాంతమనికాదు దాదాపు రాష్ట్రమంతా వడగండ్లు, పెనుగాలులతో అతలాకుతలం అయిపోయింది. మరో పదిహేను ఇరవై రోజుల్లో పంట చేతికి వొస్తుందనుకుంటున్న తరుణంలో  యావత్‌ ‌రాష్ట్ర రైతాంగాన్ని దు:ఖంలో ముంచేసింది. ఎటు చూసిన పంటపొలాలన్నీ నేలకొరికి ఆరుగాలపు కష్టాన్నిమాత్రమే మిగిల్చింది.. వేలాది ఎకరాల పంటలు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. ఈ యాసంగిలో దాదాపు డెబ్బై మూడు లక్షల ఎకరాల వరకు పంటల సాగు జరిగింది. అయితే గత నాలుగు రోజులుగా పడిన వడగండ్ల వాన, ఈదురు గాలుల కారణంగా  ప్రాథమిక అంచనాల ప్రకారం  దాదాపు అయిదు లక్షల ఎకరాలకు పైగానే నష్టం వాటిల్లినట్లు తెలుస్తున్నది. వేలాది రూపాయలను అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టినరైతాంగం గొల్లు మంటున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత అధ్వాన్నం. తెల్లవార్లు కనుపాపలా కాపాడుకున్న పంట ఇక చేతికి వొస్తుందనుకుంటున్న దశలో వడగండ్లు కడగండ్ల ప్రాయం చేశాయి. తాము చూస్తుండగానే  కొద్ది గంటల్లోనే సర్వ నాశనమైంది. నిన్నటి వరకు పచ్చగా కలకలలాడుతున్న పంటంతా నేలకొరిగి మట్టిలో కలిసి పోవడంతో   దిక్కుతోచని పరిస్థితి వారిది. ఒకటా రెండా దాదాపు అన్ని పంటల పరిస్థితి ఇదే. అత్యధికంగా వరి, మొక్కజొన్న, పత్తి ఇతర పంటలన్నీ నీటి పాలైనాయి. గత ఏడాది వీచిన పెనుగాలులకు కోత దశలోనే మామిడి కాయలు రాలిపోయి మామిడి రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. వేలాది ఎకరాల మామిడి తోటలకు నష్టంవాటిల్లింది. ఈ ప్రకృతి వైపరీత్యమన్నది దాదాపుగా ప్రతీ ఏటా జరుగుతున్నదే. అయినా వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఇంకా జనాభాలో ఎక్కువ శాతం మంది పంట భూములను నమ్ముకుని బతుకుతున్నారు. ఇలాంటి వైపరీత్యాలు జరిగినప్పుడు ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఆలస్యంగా సహాయ చర్యలు చేపట్టడంతో ప్రజలకు వ్యవసాయ వృత్తిమీదే నమ్మకంలేకుండా పోతున్నది. రైతులకు అండగా ఉంటామని ఎలుగెత్తి చాటే ప్రభుత్వాలు  సహాయ చర్యలను తూతూ మంత్రంగానే ముగిస్తున్నాయి. ఈ సంవత్సరంలో జరిగిన నష్టానికి మరో మూడు నాలుగు ఏండ్లవరకు వారికి అందని పరిస్థితి ఏర్పడింది. మన రాష్ట్రం విషయానికి వొస్తే  2021లో జరిగిన ప్రకృతి వైపరిత్యానికి సంబంధించిన పరిహారం ఇప్పటివరకు అందలేదని మరో పక్క బాధిత రైతులు గోడు వెళ్ళబోసుకుంటున్నారు. ఇలాంటి ఆపదల్లో ఆదుకునేందుకు దేశంలోనే అత్యుత్తమ పథకాన్ని ప్రవేశపెడతానన్న రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్ళుగా దాన్ని ఒక రూపానికి తీసుకురాలేదు సరికదా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్‌ ‌బీమా యోజన పథకానికి కూడా రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం దూరం చేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి రెండు పథకాలను అమలుచేశాయి. ఒకటి పంటల బీమా పథకం కాగా, మరోటి వాతావరణ ఆధారిత  పంటల బీమా పథకం. ఈ పథకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత ఇన్సూరెన్స్ ‌ప్రీమియం కడితే , రైతాంగం మరికొంత ప్రీమియం చెల్లించేవారు. అయితే  నిబంధనల పేర ఏదో ఒక అవరోధంతో రైతులకు సకాలంలో నష్టపరిహారం లభించడం సాధ్యపడకుండా పోయింది. దీంతో ఈ పథకాల్లో చేరే విషయంలో రైతులు పెద్దగా శ్రద్ధ  చూపించకపోవడం కూడా వారి కడగండ్లకు మరింత కారణంగా మారింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో అత్యుత్తమ బీమా పథకాన్ని ఏర్పాటు చేస్తామని తెలంగాణ సర్కార్‌ ‌కేంద్ర పథకమైన ఫసల్‌ ‌బీమా పథకానికి దూరంగా ఉంటూ వొస్తున్నది. కొత్త పథకానికి రూపకల్పన చేస్తామని 2020లో పేర్కొన్న బిఆర్ఎస్‌ ‌ప్రభుత్వం ఇంతవరకు దానికి రూపకల్పన చేయనేలేదు. పథక రచన జరుగకపోయినా ప్రకృతి విధ్వంసం జరిగే పరిస్థితైతే ఉండదు. ప్రతీ సంవత్సరం పంటలు కొతకు వొచ్చే దశలో వరుణుడి కనికరం లేకుండా పోతోంది. దానికి తగినట్లుగా విపరీతమైన ఈదురు గాలులతో కేవలం పంటలేకాదు.. గ్రామీణ ప్రాంతంలో గుడిసె వాసులకు నిలువనీడ లేకుండా చేస్తున్నాయి. పశువుల కొట్టాలపైన రేకులు ఎక్కడికో కొట్టుకు పోతున్నాయి. వందలాది పశువులు ప్రాణాలు కోల్పోతున్నాయి. విద్యుత్‌ ‌స్థంభాలు నేలకొరిగి రోజుల తరబడి విద్యుత్‌ ‌సరఫరా నిలిచిపోతున్నది. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం పంటలు దండగ కాదు పండుగ చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ, ఏటా సంభవిస్తున్న ఈ ప్రచండ ప్రకృతి వైపరీత్యం రైతు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పంతాలు వీడి తమను ఆదుకోవాలని రైతులు, రైతు నాయకులు  విజ్ఞప్తి చేస్తున్నారు.

——–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page