- నాడు కరెంటు బిల్లులు, రైతు రుణాలు కట్టొద్దన్నారు
- నేడు అడిగితే తిడుతున్నారు
- మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్
సిద్దిపేట, ప్రజాతంత్ర, జనవరి 27 : కాంగ్రెస్ హామీలు మాటల్లోనే కాని చేతల్లో లేవని..సాధ్యం కానీ హామీలు, అర్భాట మాటలతో ప్రజలను మోసం చేసిన తీరును, ఎన్నికల్లో మాటలు..ఇప్పుడు తిట్లు అంటూ వారి మాటలను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వీడియొ క్లిప్పింగ్‌లలో చూపించారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికలప్పుడు అబద్దాలు చెప్పారు ..ఇపుడు పాలనలో సీఎం, మంత్రులుగా ఉండి అసహనంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వాళ్ళు హామీలకు చెప్పిన గడువు తేదిలను మనం గుర్తు చేస్తుంటే నోరు పెద్దది చేస్తూ ప్రజలను బెదిరించేలా మాట్లాడుతున్నారని, ఏరు దాటాక తెప్ప తగిలేసినట్టుగా.. ఎన్నికల సమయంలో ఓడ మల్లప్ప, గెలిచిన తర్వాత బోడ మల్లప్ప అన్నట్టుగా కాంగ్రెస్ నేతల తీరు ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
ఆరు గ్యారంటీల్లో ఉన్న 13 హామీలతో సహా కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చిందన్నారు. ఎన్నికలపుడు రేవంత్ రెడ్డి రైతు బంధు స్థానంలో రైతు భరోసా పథకం తెస్తామని ఎకరాకు 15 వేల రూపాయలు ఇస్తామని, కౌలు రైతులకు కూడా 15 వేలు ఇస్తామనీ, భూమిలేని కూలీలకు కూడా సాయం చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా వారు ఎన్నికలప్పుడు చేసిన వాఖ్యలను వీడియో క్లిప్పింగ్‌ల ద్వారా చూపించారు. రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టు అంటూ..ముఖ్యమంత్రి, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్న మాటలు వీడియో ద్వారా చూపించారు. హామీల అమలు గురించి అడిగితే మంత్రులకు కోపం ఎలా తన్నుకు వొస్తుందో ఓ సారి కొమటి రెడ్డి వీడియోను చూడండంటూ చూపించారు. రైతుబంధు పడలేదు అన్న వారిని చెప్పుతో కొట్టాలట..డిసెంబర్ తొమ్మిదిన రైతు భరోసా వేస్తానని చెప్పి రైతు బంధు ఇప్పటికీ పూర్తి చేయలేదు అదేమని అడిగితే దబాయిస్తున్నారు. చెప్పులతో కొట్టించుకోవడానికేనా మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది అంటూ మండినడ్డారు. కాంగ్రెస్ ఇస్తున్న ఏడో గ్యారంటీ చెప్పులతో కొట్టించుకోవడమా అంటూ వారు అన్న మాటలు వీడియో ద్వారా చూపించారు. మాఫి అయిన రుణాల స్థానంలో కొత్తవి తెచ్చుకుంటే 2 లక్షల వరకు మాఫీ చేస్తామని రేవంత్ చెప్పారన్నారు.
నిరుద్యోగ భృతిపై యూత్ డిక్లరేషన్‌లో స్పష్టంగా నాలుగు వేల రూపాయలు చొప్పున ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అసెంబ్లీలో ఆ విషయం తాను అడిగితే..డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసలు అలాంటీ హామీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని దబాయించారన్నారు. ఆసరా పెన్షన్లను నెలకు 4 వేలలకు పెంచుతామని, డిసెంబర్ నుంచే అమలు చేస్తామని ఎన్నికల బహిరంగ సభలో రేవంత్ అన్నారని, 200 యూనిట్ల దాకా కరెంటు వాడితే బిల్లులు కట్టొద్దని జనవరి నుంచే ఇది అమల్లోకి వొస్తుందని రేవంత్ అన్నారని, రేవంత్ జనవరి నుంచి కరెంటు బిల్లులు కట్టొద్దంటే కోమటి రెడ్డి వెంకట రెడ్డి నవంబర్ నుంచే కట్టొద్దని ప్రజలకు పిలుపునిచ్చారని, సోనియానే మీ బిల్లులు కడుతుంది అన్నట్టుగా మాట్లాడారని, మరి జనవరి కూడా అయిపోయింది కదా…బిల్లులు సోనియాకు పంపుదామా..రేవంత్ కు పంపుదామా..కోమటిరెడ్డికి పంపుదామా అని ప్రశ్నిస్తూ, వారి మాటల వీడియో క్లిప్పింగ్‌లు చూపించి గ్రామాల్లో చర్చ చేయాలని, వొచ్చే ఎంపీ ఎన్నికల్లో నిలదీయాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.