సెప్టెంబర్ 21, అంతర్జాతీయ శాంతి దినోత్సవం
ప్రస్తుత ప్రపంచ ఆధిపత్య ధోరణి శాంతికి విఘాతం కలిగిస్తున్నది. ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న సామ్రాజ్యవాద అహంకార ధోరణి, యుద్ధోన్మాదానికి దారి తీస్తున్నది. ఉక్రెయిన్,రష్యాల మధ్య గత కొద్ది నెలలుగా కొనసాగుతున్న యుద్ధం ఈ కోవలోకే వస్తుంది. రాజ్య విస్తరణ కోసం జరిగే ఏ యుద్ధమైనా అంతిమంగా ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తుంది.ఇటీవలి కాలంలో వివిధ దేశాలు అణు యుద్ధాల పేరుతో ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తున్నాయి. అణు యుద్ధాల వలన జరగబోయే పరిణామాలు ఊహాతీతం. కేవలం ఆధిపత్యం కోసం ఇలాంటి హెచ్చరికలు చేయడం అత్యంత దారుణం. ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న అహంకార ధోరణి యుద్ధోన్మాదానికి దారి తీస్తున్నది. రాజ్య విస్తరణ కోసం, ఆధిపత్యం కోసం ప్రపంచంలో ఇప్పటికే ఎన్నో యుద్ధాలు జరిగాయి. రెండు ప్రపంచ మహా సంగ్రామాలు మారణహోమాన్ని రగిలించాయి. ప్రపంచం రెండుగా చీలిపోయింది. ఒక దేశాన్ని అంతం చేయాలని చూస్తే మరో దేశం ఆర్ధిక,ఆయుధ,అణు బలంతో ప్రపంచానికి సవాల్ విసురుతున్నది. పూర్వ కాలంలో రాచరిక వ్యవస్థ అమల్లో ఉండేది. రాజ్య విస్తరణ కోసం అనేక యుద్ధాలు చేసారు.ఖడ్గాలు,బాణాలతో మొదలైన యుద్దాలు తుఫాకులు,మరఫిరంగుల వరకు ఎదిగి, చివరకు అణు బాంబుల వరకు వెళ్ళాయి. యుద్ధాల వలన ఎవరూ బాగు పడింది లేదు.
గెలిచినా ఓడినా అందరూ బాధితులే.యుద్ధ విజేతలుగా విర్రవీగే దేశాలు కూడా సుదీర్ఘకాలం అనేక కష్టనష్టాలు ఎదుర్కోక తప్పదు. ఆయా దేశాల ప్రజలు కూడా యుద్ధాల వలన పలు కష్టాలు,ఆర్ధిక బాధలు అనుభవించిన నేపథ్యం అవగతం చేసుకోవాలి. ప్రజలు యుద్ధాలు కోరుకోవడం లేదు. పూర్వ కాలంలో వివిధ రాజ్యాధి నేతలు ప్రజలు హతులవడం ఇష్టం లేక ద్వంద్వ యుద్ధాలు చేసేవారు.తమ మధ్య పంతాలు ప్రజలకు హాని చేయకుండా వివిధ పందాల రూపంలో రాజ్యాలు కోల్పోయే వారు. కోడి పందాలతో,ఇతర క్రీడలతో రాజ్యాలను వదిలేసినవారున్నారు.జన నష్టం జరగకుండా,చుక్క రక్తం నేల చిందకుండా ఉండాలనే విచక్షణతో ఇలాంటి రక్తపాత రహిత యుద్ధాలు జరిగేవి. అయితే శతృత్వం పరిధులు దాటి పదునైన మాటలు తూటాలతో,రెచ్చగొట్టే చర్యలతో మహా యుద్ధాలు జరిగి అపార ప్రాణనష్టం జరిగిన విషయం చరిత్ర ను పరిశీలిస్తే అవగతమవుతుంది.
అణుబాంబును కనిపెట్టి, దాని విధ్వంస ఫలితాలను కళ్ళారా చూసిన ప్రముఖ అమెరికా శాస్త్రవేత్త ఓపెన్ హైమర్ అణుయుద్ధాలకు, అణ్వస్త్ర వ్యాప్తికి వ్యతిరేకంగా జీవితాంతం పోరాటం చేయడాన్ని ప్రపంచం గుర్తుంచుకోవాలి. దురదృష్టవశాత్తూ నేటి ప్రపంచంలో హిత వచనాలు వినే ఓపిక లేదు. విధ్వంసమే హీరోయిజంగా చెలామణీ కావడం విడ్డూరం.’’వినాశకాలే విపరీత బుద్ధిః’’ అంటే ఇదేనేమో.ప్రస్తుత ప్రపంచ పోకడలు అత్యంత ప్రమాదకరంగా తయారైనాయి. బలమైన దేశాలు బలహీన దేశాలను వివిధ మార్గాల్లో తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నాయి. ఆధిపత్య పోకడలకు లొంగిపోయిన దేశాలు పేరుకి స్వతంత్ర దేశాలుగా పిలవబడుతున్నప్పటికీ, అవి నిజానికి సామంత రాజ్యాల స్థాయికి దిగజారిపోయాయి. ప్రపంచ న్యూక్లియర్ క్లబ్ లో భారతదేశం 6 వ దేశంగా చేరింది.అణు పరీక్షల తర్వాత భారత దేశం ఎన్నో ఆంక్షలను భరించింది.
అగ్రరాజ్యాలకు ఒకనీతి, బలహీన దేశాలకు,అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒక నీతి అన్నట్టుగా ఐక్యరాజ్య సమితి పక్షపాత ధోరణి అవలంభించడం సబబు కాదు. అగ్రరాజ్యాలు అణు యుద్ధాలకు తెగించవచ్చు. యుద్ధోన్మాదంతో చెలరేగి పోవచ్చు,కాని పొరుగు దేశాలతో పెనుముప్పు పొంచి ఉన్న భారత్ వంటి దేశాలు అణు పాటవం కలిగి ఉండడం తప్పెలా అవుతుంది? పైగా భారత దేశం శాంతి కాముక దేశం అనే విషయం ప్రపంచమంతటికీ తెలుసు. తనంత తానుగా ముందుగా ఏ దేశం పైనా అణ్వస్త్రాలను ప్రయోగించబోనని స్వీయ నియంత్రణ విధించుకున్న భారత్ విశ్వసనీయతను శంకించడం తగదు. అగ్రరాజ్యాలు ప్రపంచాన్ని కాపాడలేవని, ఏరు దాటాక తెప్ప తగలేయడం వాటినైజమని వివిధ సంఘటనలు నిరూపించాయి. పెద్దన్న పాత్ర పోషించే అమెరికా ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో వెలగబెట్టిన నిర్వాకం అందరికీ తెలుసు.1945 లో హిరోషిమా,నాగసాకి లపై జరిగిన అణుదాడిలో సుమారు లక్షన్నర మంది మృత్యువాత పడ్డారు.ఒకసారి అణు దాడి జరిగాక దాని ప్రభావం సుదీర్ఘకాలం ఉంటుంది. ఇప్పటికీ ఈ నగరాల్లో అణుధార్మిక ప్రభావం కొనసాగుతున్నది.
అణు యుద్ధాలు ఎలాంటి విధ్యంసాన్ని సృష్టించగలవో గత సంఘటనలు నిరూపిస్తున్నా అగ్రరాజ్యాలు అణు యుద్ధ ప్రేలాపనలతో ప్రపంచాన్ని వణికించడం తగదు. ఇకనైనా అగ్రరాజ్యాలు తమ పెత్తందారీ విధానం మానుకోవాలి.శాంతియుత ప్రయోజనాలకోసమే అణు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలి. ప్రపంచ దేశాలు శాంతి,సహనంతో మెలగాలి. ప్రపంచ శాంతి కోసం ఐక్యరాజ్య సమితి ప్రతీ ఏటా సెప్టెంబర్ 21 వ తేదీని ‘‘అంతర్జాతీయ శాంతి దినోత్సవం’’ గా ప్రకటించింది. అయితే ఐక్యరాజ్య సమితి అగ్రరాజ్యాల పట్ల ఒక విధంగా, బలహీన దేశాల పట్ల, వర్ధమాన దేశాల పట్ల మరొక విధంగా ప్రవర్తించినంత కాలం ఆ సంస్థ పట్ల ఎవరికీ నమ్మకం కుదరదు. ఐ.రా.స తన ద్వంద్వ వైఖరిని విడనాడి ప్రపంచ శాంతి కోసం ఆచరణ సాధ్యమైన ప్రణాళికలు రూపొందించాలి.
సుంకవల్లి సత్తిరాజు,
సంగాయగూడె, ఏపీ
9704903463.