తమ కూతురు డాక్టర్ కావాలన్న ఆశలు అడియాసలు
అత్యాచారం, హత్య గావింపబడ్డ డాక్టర్ తల్లిదండ్రుల ఆవేదన
కోల్‌కతా,ఆగస్ట్21: కోల్‌కతాకు చెందిన వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనతో యావత్ దేశం మరోసారి ఉలిక్కిపడింది. అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చంపినట్లు వెలుగులోకి వస్తుండటం ప్రతి ఒక్కర్నీ కలచివేస్తోంది. ఈ క్రమంలో బాధితురాలి తల్లిదండ్రుల వేదన కన్నీటిని తెప్పిస్తోంది. ఓ వార్తాసంస్థతో బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. తమది నిరుపేద కుటుంబమని, అయినప్పటికీ డాక్టర్ అయ్యేందుకు తమ కూతురు ఎంతో శ్రమించిందన్నారు. చదువే లోకంగా బతికిందని.. కానీ, చివరకు ఒక్క రాత్రిలోనే కలలన్నీ చెదిరిపోయాయని వాపోవడం హృదయాలను కదిలిస్తోంది.డాక్టర్ అయ్యేందుకు ఆమె ఎంతో కష్టపడింది. చదువే లోకంగా బతికింది.
చివరకు ఆమె అనుకున్నది సాధించడంతో ఎంతో సంతోషించాం. వైద్యవృత్తితో ఎంతోమందికి సహాయం చేయవచ్చని తమతో చెప్పింది. కానీ, ఇప్పుడేం జరిగిందో చూడండి. కలలన్నీ ఒక్క రాత్రిలోనే చెదిరిపోయాయి. విధుల నిర్వహణ కోసం ఆమెను పంపిస్తే.. ఆస్పత్రి మాత్రం తమకు విగతజీవిగా అప్పగించింది. మా పని ముగిసిపోయింది. మా అమ్మాయి ఇక తిరిగి రాదు. ఆమె స్వరాన్ని, చిరునవ్వునూ నేనెప్పటికీ వినలేను. మేం ఇప్పుడు చేయగలిగేది ఆమెకు న్యాయం జరిగేలా చూడటమే అని ఓ అంతర్జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైద్య విద్యార్థిని తండ్రి వాపోయారు.
మరోవైపు హత్యాచార ఘటనలో నిందితుడైన సంజయ్ రాయ్ వ్యక్తిగత జీవితంలోనూ క్రూరంగా ప్రవర్తించేవాడని తెలుస్తోంది. అతడికి, భార్యకు మధ్య సత్సంబంధాలు లేవని వెల్లడైంది. గర్భందాల్చిన తన కూతురిపై కొంత కాలం క్రితం అతడు చేయి చేసుకున్నాడని, దాంతో ఆమెకు గర్భస్రావమైనట్లు సంజయ్ రాయ్ అత్త వెల్లడించారు. సంజయ్ మంచివాడు కాదని, అతణ్ని ఉరితీసినా ఫర్వాలేదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.