కంటివెలుగులో కోటి పరీక్షలు

50 రోజుల్లో కోటిమందికి వెలుగు
మంత్రి హరీష్‌ ‌రావు వెల్లడి
లీక్‌ల దొంగలను జైల్లో వేసినాంక సజావుగా పది పరీక్షలు : బిఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్‌ ‌రావు

సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6 : ‌రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం కోటి పరీక్షలు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది జనవరి 18న ప్రారంభమైన రెండో విడత కంటి వెలుగు పథకం ద్వారా కేవలం 50 రోజుల్లోనే కోటి పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం సదాశివపేటలోని కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించిన మంత్రి హరీష్‌ ‌రావు బెలూన్లను గాల్లోకి ఎగురవేశారు. కేక్‌ ‌కట్‌ ‌చేసి అక్కడి సిబ్బందికి అభినందనలు తెలిపారు. అనంతరం మంత్రి హరీష్‌ ‌రావు మాట్లాడుతూ..కోటి కంటి పరీక్షలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ రోజు చాలా గొప్ప రోజు అని.. కంటి వెలుగు ద్వారా 29 లక్షల మందికి కళ్లజోళ్లు ఉచితంగా అందజేశామని తెలిపారు. ప్రజల ఇబ్బందులను గమనించి, కంటి బాధల నుంచి విముక్తి కల్పించేందుకు సీఎం కేసీఆర్‌ ‌కంటి వెలుగు పథకం తీసుకొచ్చారని మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు. ఈ తరహా కార్యక్రమంలో ప్రపంచంలో ఎక్కడా లేదని ఆయన స్పష్టం చేశారు. ఊరూవాడకు డాక్టర్లు, యంత్రాలను పంపించి నిరుపేదలకు కంటి వెలుగులు ప్రసాదించారని చెప్పారు. ఈ పథకాన్ని ప్రతిపక్షాలు సైతం మెచ్చుకున్నాయని అన్నారు. ఇతర రాష్ట్రాల సీఎంలు అరవింద్‌ ‌కేజీవ్రాల్‌, ‌మాన్‌సింగ్‌ ‌కూడా మెచ్చుకున్నారని గుర్తు చేశారు. 50 రోజుల్లోనే కోటి కంటి పరీక్షలు పూర్తి చేశారని అన్నారు.

1500 మంది కంటి వెలుగు టీమ్స్ ‌కష్టపడి పని చేశారని అన్నారు. 53 లక్షల మంది మహిళలు, 47 లక్షల మంది పురుషులకు కంటి వెలుగు పరీక్షలు నిర్వహించామని తెలిపారు. 7 వేల గ్రామ పంచాయతీల్లో కంటి వెలుగు పరీక్షలు చేశామన్నారు. 55 శాతం గ్రామాల్లో కంటి పరీక్షలు పూర్తి చేసినట్లు చెప్పారు. దగ్గర చూపుతో ఇబ్బంది పడుతున్న 16.50 లక్షల మందికి, దూరపు చూపు సమస్యతో బాధపడుతున్న 12.50 లక్షల మందికి కంటి అద్దాలు అందజేశామని మంత్రి హరీష్‌ ‌రావు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాలో 84 శాతం కాన్పులు ప్రభుత్వ హాస్పిటళ్లలోనే అవుతున్నాయని ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు. వైద్య రంగంలో రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధించిందని మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు. తెలంగాణలో వైద్యరంగం మెరుగ్గా ఉందని నీతి ఆయోగ్‌ ‌చెప్పిందని మంత్రి హరీష్‌ ‌రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పల్లె దవాఖానాలు, మున్సిపాలిటీల్లో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే గర్భిణులకు న్యూట్రీషన్‌ ‌కిట్లు అందించబోతున్నామని తెలిపారు. టీ డయాగ్నోస్టిక్‌ ‌సెంటర్స్ ‌ద్వారా 57 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా అందజేస్తున్నామని అన్నారు. రాష్ట్రానికి ఒక్క ఎయిమ్స్ ‌కేటాయించి కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని..అదే తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాదిలోనే కొత్తగా 9 మెడికల్‌ ‌కాలేజీలు ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు.

లీక్‌ల దొంగలను జైల్లో సజావుగా పది పరీక్షలు : బిఆర్‌ఎస్‌ ఆత్మయ సమ్మేళనంలో మంత్రి హరీష్‌ ‌రావు
దొంగల్ని అరెస్టు చేసి జైల్లో వేసిన తర్వాత ఇవాళ ఏ లీక్‌ ‌లేదు.. పది పరీక్షలు సాఫీగా సాగుతున్నాయని మంత్రి హరీష్‌ ‌రావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా ధన్‌సరి విల్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ‌పార్టీఆత్మీయ సమ్మేళనంలో హరీష్‌ ‌రావు పాల్గొని ప్రసంగించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు స్థాపించి పిల్లలకు మంచి చదువు చెప్పిస్తున్న ప్రభుత్వం కేసీఆర్‌ ‌ప్రభుత్వం అని హరీష్‌ ‌రావు స్పష్టం చేశారు. చదువులేమో మనం చెప్పిస్తుంటే.. బీజేపీ నేతలేమో పేపర్లు లీక్‌ ‌చేస్తున్నారు. మొన్న, నిన్న పేపర్లు లీక్‌ ‌చేశారు. ఇవాళ దొంగల్ని అరెస్టు చేసి జైల్లో వేసిన తర్వాత ఇవాళ ఏ లీక్‌ ‌లేదు. పది పరీక్షలు సాఫీగా సాగుతున్నాయి. ఎవరైతే పేపర్‌ ‌లీక్‌ ‌చేశారో వారిని పోలీసులు దొరికించుకుని జైల్లో వేశారు అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు బీజేపీ నేతలు ఎన్నో కుట్రలు చేశారని హరీష్‌ ‌రావు గుర్తు చేశారు. హిందూ-ముస్లిం గొడవలు పెట్టాలని చూశారు. అది సాధ్యం కాలేదు. తెలంగాణ గవర్నమెంట్‌ను పడగొట్టాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలను కొనేందుకు యత్నించారు. ఆ దొంగలు దొరికారు. అది కూడా ఫెయిలైంది. అక్కడ కూడా ఫెయిల్‌ అయ్యామని చెప్పి మనకు పైసలు రాకుండా చేస్తున్నారు. బోర్లకాడ వి•టర్లు పెట్టలేదని చెప్పి రూ. 30 వేల కోట్లు దిల్లీలో ఆపారు. నాణ్యమైన కరెంట్‌ ‌కోసం నెలకు రూ. 2 వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం.

సీఎం కేసీఆర్‌ ‌రైతులకు పైసా ఖర్చు లేకుండా కరెంట్‌ ఇస్తున్నారు అని హరీష్‌ ‌రావు తెలిపారు. కాంగ్రెస్‌ ‌నేతలు వొస్తే మళ్లీ కాలిపోయే మోటార్లు,పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు వొస్తాయని హరీష్‌ ‌రావు పేర్కొన్నారు. రైతుబంధు, కల్యాణలక్ష్మి ఆగిపోతాయి. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మన లాంటి పథకాలను అమలు చేయడం లేదు. రేవంత్‌ ‌రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. అయితే కూలగొడుతా.. లేదంటే కాలబెడుతా అని అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. వారి మాటలకు జనాలు గందరగోళం కావొద్దు. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. సంక్షేమ ప్రభుత్వాన్ని ఆదరించాలి అని హరీష్‌ ‌రావు విజ్ఞప్తి చేశారు. ఇలా అందరూ తెలంగాణ ప్రభుత్వాన్ని బీజేపీ బద్నాం చేయాలని చూస్తుందని మంత్రి అన్నారు. కేసీఆర్‌ ‌బలమైన పునాదులు వేస్తే.. బీజేపీ వాళ్లు సమాధులు తవ్వమంటారని విమర్శించారు. మసీదుల గురించి మాట్లాడుతారు హిందువుల గురించి మాట్లాడుతారని అన్నారు. ఇవాళ హనుమాన్‌ ‌జయంతి అని.. అందరూ బాగుండాలని అందరూ దేవుణ్ణి మొక్కుతారు కానీ బీజేపీ వాళ్ళవి కపట మొక్కులు, ఆపద మొక్కులని విమర్శించారు. కాలవెట్టేవాడు, కూలగొట్టేవాడు కావాలా? అభివృద్ధి పనులు  చేసే వాడు కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ఎన్నికల మేనిఫేస్టోలో చెప్పనివి కూడా ఎన్నో అమలు చేశామని హరీష్‌ ‌రావు అన్నారు.  కేసీఆర్‌ ‌ప్రతి గుండెలో, ప్రతి ఇంట్లో ఉన్నాడని చెప్పారు హరీష్‌ ‌రావు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page