సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: కాంగ్రెస్, బీజేపీ రెండు ఒక్కటేనని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యనించారు.సదాశివపేటలో బుధవారం మనబిన్ ఫౌండేషన్ అధ్యక్షుడు ముఖీమ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి హరీశ్ రావు ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ మూడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్ గల్లంతు అయ్యిందని అన్నారు. బీజేపీకి పూర్తి స్థాయిలో ఆ పార్టీ నేతలు సహకరించారని తెలిపారు.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కి బీజేపీ పార్టీ మద్దతు ఇస్తోందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండు ఒక్కటేనని మంత్రి హరీష్ రావు అన్నారు. రాహుల్ గాంధీ, బీజేపీ ప్రభుత్వానికి బలంగా మారారన్నారు. తాజాగా రాజ్ గోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి చేరాలని తీసుకున్న నిర్ణయం బీజేపీ, కాంగ్రెస్ మధ్య వున్న రహస్య ఒప్పందాన్ని బట్టబయలు చేసిందన్నారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి రోజూ మాట్లాడుకుంటూ ఈ ఎన్నికల్లో పని చేస్తున్నారని విమర్శించారు.
సంగారెడ్డిలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని మంత్రి హరీశ్ రావు చెప్పారు. నియోజకవర్గంలో వున్న పేదలందరికీ ఇంటి స్థలాలు ఇస్తామన్నారు.‘‘బీజేపీ నాయకుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి పోతున్నారు. ఈ చర్యతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య వున్న రహస్యం బట్టబయలు అయింది. ఆ రెండు పార్టీలు ఒక్కటే. వాళ్ళ మధ్య అవగాహన ఉంది.మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ నుంచి రాజ్ గోపాల్ రెడ్డి పోటీ చేశారు. అప్పుడు కాంగ్రెస్ లో వున్న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి బీజేపీ కి ఓట్లు వేయాలని కోరారు. అయినా ఆయన మీద కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోలేదు. సీఎం కేసీఆర్ ని ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై కుట్రలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు భూపాల్ రెడ్డి, ఎర్రొల శ్రీనివాస్, రాజేందర్,కాసాల బుచ్చిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.