కాంగ్రెస్‌కు కష్టకాలం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి వరుసగా ఎదురు దెబ్బలను ఎదుర్కుంటున్న కాంగ్రెస్‌ ‌పార్టీ వొచ్చే ఎన్నికల నాటికైనా పుంజుకుంటుందని ఆశిస్తున్న తరుణంలోనే  మరిన్ని ఎదురు దెబ్బలు తాకుతున్నాయి. వొచ్చే ఎన్నికల్లో గోలకొండపైన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తామన్న ధీమాను ఆ పార్టీ గత కొంతకాలంగా వ్యక్తం చేస్తూ వొస్తుంది. దీంతో పూర్వపు స్థితికి కాకపోయినా కనీసంగానైనా బలపడుతుందన్న ఆశ పార్టీ వర్గాల్లో కనిపించింది. కాని, వారి ఆశలను తుంచివేసే పరిణామాలు పార్టీలో చోటుచేసుకుంటుండడంతో కార్యకర్తలు, నాయకులకు దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. గత రెండు ఎన్నికల నుండి వరుస ఓటములను చవిచూస్తున్నా నాయకుల్లో మాత్రం పెద్దగా మార్పు కనిపించడంలేదు. అదే అంతర్ఘత కలహాలతో నిత్యం ఎవరో ఒకరు స్వీయపార్టీని విమర్మించడమో, తమ అసంతృప్తిని మీడియా ముందు వెళ్ళగక్కడమో పరిపాటయిపోయింది. పార్టీని ఎంత బలోపేతం చేయాలని ప్రయత్నించినా ఈ పరిణామాలు పార్టీని  అప్రతిష్టపాలు చేస్తున్నాయి.

ఇప్పటికే పలువురు సీనియర్‌ ‌నాయకులు కాంగ్రెస్‌ను వీడి టిఆర్‌ఎస్‌, ‌బిజెపి పార్టీలో చేరిపోయారు. మరికొంత మంది అదేదారి పట్టేందుకు సిద్ధమవడం ఇప్పుడా పార్టీకి కష్టకాలంగా మారింది. రేవంత్‌రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక అయినప్పటి నుండి కాంగ్రెస్‌ ‌సీనియర్లంతా అసంతృప్తితో ఉన్న విషయం బహిరంగ రహస్యమే. ఈ విషయంలో వాదోపవాదాలు, అలకలు, కోపాలు, విమర్శలు అనేకం చోటుచేసుకున్నాయి. రేవంత్‌రెడ్డికి ఆ పదవిని కట్టబెట్టడాన్ని మొదటినుండి కోమటిరెడ్డి బ్రదర్స్ ‌తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. యువకులుగా ఉన్నప్పటి నుండి కాంగ్రెస్‌ ‌జండా మోస్తున్న తమను కాదని ఇతర పార్టీల నుండి వలస వొచ్చిన వారికి ఉన్నత పదవులను కట్టబెట్టడమేంటని వీరిద్దరూ అధిష్టానంతో దెబ్బలాటకు కూడా దిగారు. తామిద్దరిలో ఎవరికి ఆ పదవినిచ్చినా రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్‌ ‌పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని ఏకాభిప్రాయంగా వారు అనేకసార్లు బహిరంగంగానే ప్రకటించారు. అనుకోకుండా అన్నదమ్ముల్లో భేదాభిప్రాయాలు చోటుచేసుకున్నాయి.

ఇప్పుడు అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి(ఎంపి)ని స్టార్‌ ‌క్యాపెయినర్‌గా కాంగ్రెస్‌ ‌పార్టీ నియమించినప్పటి నుండి ఆయన కొంతకాలంగా స్వీయపార్టీపై చేస్తున్న విమర్శలను దాదాపుగా తగ్గించారు. అయితే అయన సోదరుడు మునుగోడు ఎంఎల్‌ఏ అయిన రాజగోపాల్‌రెడ్డి మాత్రం అలక వీడలేదు. కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా తన అసంతృప్తిని ఆయన వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. చివరకు రాష్ట్రంలో కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ పర్యటనలో కూడా ఆయన పాల్గొనకపోవడం ఆయన పార్టీని వీడుతారన్న ఊహాగానాలకు తావిచ్చింది. అయితే తనపై వొస్తున్న వార్తలను వెంకట్‌రెడ్డి ఒక పక్క ఖండిస్తూనే, ఆయన పార్టీ మార్పు చర్చలను రహస్యంగా కొనసాగిస్తూ వొచ్చారు.

దానికి తగినట్లుగా ఆయన తానున్న కాంగ్రెస్‌ ‌పార్టీపైనే విమర్శలు చేస్తూ రావడంతో కాంగ్రెస్‌ ‌వర్గా)కు పెద్ద షాక్‌ ఇచ్చింది. వాస్తవంగా ఒరిజినల్‌ ‌కాంగ్రెస్‌ అన్నది లేదని, పార్టీలోని సీనియర్‌ ‌నాయకులకు ప్రాధాన్యత లేకుండా పోయిందని, ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న తమ లాంటి వారిని రాజకీయంగా దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని, అందుకు పార్టీ మార్పు చారిత్రక అవసరమంటూ ఆయన వివిధ వేదికలపై నుండి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర శాఖకు మింగుడు పడకుండా పోయింది. ఆయనను అదుపు చేయాలని రాష్ట్ర నాయకత్వం అధిష్ఠానానికి చేసిన విజ్ఞప్తి మేరకు  రంగంలోకి దిగిన కేంద్ర నాయకత్వం చేసిన ప్రయత్నాలకు ఫలితం లేకుండా పోయింది. సిఎల్‌పి నేత బట్టి విక్రమార్క, పార్టీ వ్యూహకర్త సునీల్‌ ‌కనుగోలు లాంటి వారనేకులు ఆయన్ను పార్టీ వీడే నిర్ణయాన్ని మార్చుకోవాలని అనేక విధాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

ఆయన సోదరుడికి ఇచ్చినట్లుగా పార్టీ పరంగా ఏదో ఒక పదవిని కూడా ఇచ్చి ఆయన్ను సంతృప్తి పర్చాలని ప్రయత్నించారు. అయినా వారి ప్రయత్నాలన్నిటిని వమ్ముచేస్తూ ఆయన తాజాగా బిజెపి సీనియర్‌ ‌నాయకుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశం కావడంతో ఇక ఆయన ఎట్టి పరిస్థితిలోనైనా పార్టీని మారుతాడన్నది రూఢి అయింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌, ‌వివేక్‌ ‌లాంటి వారందరిని కలిసి చర్చించడం ఆయన బిజెపిలో చేరుతాడన్న విషయాన్ని మరింత రూఢి చేసింది. రాజగోపాల్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నట్లు చెబుతున్నా, కార్యకర్తల్లో వ్యతిరేకత రాకుండా ముందు జాగ్రత్త పడుతున్నట్లు స్పష్టమవుతున్నది. కాగా ఆయన ఈ నెల 30వ తేదీలోగా కాషాయ కండువ కప్పుకుంటాడని తెలుస్తున్నది.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన తన శాసనసభ్యత్వానికి రాజీనామా ప్రకటించవచ్చని వినికిడి.  దీంతో మునుగోడుకు ఉప ఎన్నికల అనివార్యం అవుతుంది. ఈ ఎన్నికను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బిజెపి చాలా ముందునుండే స్కెచ్‌ ‌వేసి, ఇప్పుడు అమలు చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నియోజకవర్గంలో రాజగోపాల్‌రెడ్డి కి ప్రత్యామ్నాయ నాయకుడెవరూ కాంగ్రెస్‌లో ఎదగలేదు. ఇక్కడ రేపు జరిగే ఉప ఎన్నికను దుబ్బాక, హుజురాబాద్‌ ఉప ఎన్నికల మాదిరిగానే గెలుచుకుంటామన్న ధీమా బిజెపి వర్గాల్లో ఉంది. ఇది రాబోయే శాసనసభ ఎన్నికల ముందు మరో విజయంగా తమకు సంక్రమిస్తుందన్నది బిజెపి భావిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page