కాంగ్రెస్‌కు వోటేస్తే..పంటికి అంటకుండా మింగుతరు

మొసపోతే…గోస పడుతాం
ఆగమాగం కావొద్దు…అడ్డగోలుగా వోటేయొద్దు
రాహుల్‌కు ఎద్దు, యవుసం ఏది ఎరుకలే..
ప్రధాన మంత్రికి ప్రైవేటైజేషన్‌ ‌పిచ్చి..
తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌ ‌వన్‌
‌కళ్ళ ముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూసి కారు గుర్తుకు వోటేయండి
ధర్మపురి జన ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

ధర్మపురి(జగిత్యాల), ప్రజాతంత్ర, నవంబర్‌ 2 : ఆగమాగమై అడ్డగోలుగా వోటు వేయొద్దని, అలా చేస్తే కైలాసం ఆటలో పెద్ద పాము మింగినట్లే మన బతుకులు ఆగం అయిపోతాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో జరిగిన జన ఆశీర్వాద సభలో భాగంగా ఎన్నికల సమావేశంలో ముఖ్య మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌ ‌మాట్లాడుతూ…కాంగ్రెస్‌కు వోటేస్తే పంటికి అంటకుండా మింగుతారని, వారిని 11, 12 సార్లు గెలిపించినప్పుడు ఏమి అభివృద్ధి చేశారో గమనించాలని ప్రజలను కోరారు. గతంలో తెలంగాణ రాష్ట్రం చిమ్మ చీకట్లతో..సాగు, తాగునీరు లేక దుర్భర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకుని అభివృద్ధిలో అగ్ర పథంలో దూసుకుపోతున్నామని అన్నారు.

ప్రధానమంత్రి మోదీ రాష్ట్రం గుజరాత్‌లో కూడా లేనంతగా అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందని వివరించారు. రాబందులే తప్ప రైతుల బాధలు తెలియని కాంగ్రెస్‌ ‌పార్టీకి వోటు వేస్తే రాష్ట్రం తిరుగమనంలోకి వెళ్ళక తప్పదని కేసీఆర్‌ ‌హెచ్చరించారు. ఎద్దు, ఎవసం ఎరుకలేని కాంగ్రెస్‌ ‌నాయకుడు రాహుల్‌ ‌గాంధీ ధరణిని తీసివేస్తామని అంటున్నాడని..ఒకరొకరి జుట్టుకు ముడి వేసి కొట్లాటలు పుట్టించే ఆలోచనలు చేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్‌ ‌వల్లనే సకాలంలో రైతు బంధు ప్రతి రైతుకు అందుతున్న విషయాన్ని గమనించాలని కోరారు. రైతుల ఎవరైనా చనిపోయినా, పది రోజుల్లోనే రైతు బీమా అందజేయడం, రైతు విక్రయించిన దాన్యం డబ్బులు డైరెక్ట్‌గా వారి ఖాతాల్లోకి పడిపోవడం.. ధరణి పోర్టెన్‌ ‌వల్లనే ఠంచనుగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ధరణి పోర్టల్‌ ‌తీసివేస్తే ఒకరి భూమి ఇంకొకరు కాజేయడం, అధికారులు లంచాలకు మళ్ళీ అలవాటు పడడం లాంటి సంఘటనలు మళ్లీ నిత్య కృత్యమైపోతాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రజలకు వివరించారు. మళ్లీ అలాంటి పరిస్థితి రావాల్నా అంటూ ప్రశ్నించారు.

ధరణి వొచ్చాక రైతులకు అన్ని రకాలుగా ప్రయోజనాలు నేరుగా జరుగుతున్నాయని, ఎటువంటి దరఖాస్తు లేకుండానే.. దలారి లేకుండానే.. సంక్షేమ పథకాలు అందుతున్న విషయాన్ని గమనించాలని కోరారు. ప్రధానమంత్రి మోదీకి ప్రైవేటైజేషన్‌ ‌పిచ్చి పట్టుకుందని కేసీఆర్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని విమానాశ్రయాలు, ఓడరేవులు తదితర ప్రతిష్టాత్మక సంస్థలన్నింటిని ప్రైవేట్‌ ‌పరం చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ ‌మీటర్లకు మోటర్లు పెట్టాలని, లేనట్లయితే బడ్జెట్లో నిధులు కట్‌ ‌చేస్తామని నిక్కచ్చిగా చెప్పినా, తన తల తెగినా కూడా మీటర్లు పెట్టేది లేదని తెగేసి చెప్పానని అన్నారు. దీనివల్ల 25 వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంకు కేంద్ర ప్రభుత్వం అందించకుండా మొండిచేయి చూపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 ఏండ్ల తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్కటిగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలుపరచుకుంటా ముందుకు వెళ్తున్నామని.. గతంలో ఏ ప్రభుత్వమైనా చేసిందా అని ప్రజలను ప్రశ్నించారు.

తెలంగాణ వొచ్చిన తొలినాళ్లలో తలసరి ఆదాయంలో తెలంగాణ 15వ స్థానంలో ఉంటే.. నేడు 3 లక్షల 18 వేల తలసరి ఆదాయాన్ని నమోదు చేసి దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందని అన్నారు. తాగు, సాగునీరుతో పాటు నిరంతర విద్యుత్‌ ‌వినియోగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్‌ ‌వన్‌ ‌గా నిలిచిందని, ఇది తెలంగాణ రాష్ట్రానికి సగర్వమని ముఖ్యమంత్రి అన్నారు. ధర్మపురి పట్టణంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి 100 కోట్లు కేటాయించామని అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. మోసపోతే గోసపడుతామని కొప్పుల ఈశ్వర్‌ను ఈసారి 70 నుండి 80 వేల మెజార్టీతో గెలిపించాలని కోరారు. కొప్పుల ఈశ్వర్‌ ‌సౌమ్యుడు, మంచి మనిషిని అతనిని ప్రజలు ఆదరించి గెలిపించి అభివృద్ధికి ప్రజలు సహకరించి సహకరించాలని కోరారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్‌ఎస్‌ ‌ను గెలిపించే బాధ్యత ప్రజల పైననే ఉందని కేసీఆర్‌ ‌పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page