కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపుతా

  • ప్రభుత్వం రాగానే సీఎం ప్రత్యేక సమావేశం
  • పారిశుధ్య, కాంట్రాక్ట్‌ కార్మికులతో భేటీలో కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ
  • వారితో ముఖా ముఖీ… కలివిడిగా తిరుగుతూ.. సమస్యలను శ్రద్ధతో వింటూ..ఆత్మీయ పలకరింపు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 28: పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. కాంగ్రెస్‌ గెలవగానే.. కార్మికులతో సీఎం సమావేశం అవుతా రన్నారు. వారి సమస్యలపై చిత్తవుద్దితో పరిష్కరిస్తామని హావిూ ఇచ్చారు. రాహుల్‌ ప్రచారానికి చివరి రోజైన మంగళవారం డెలివరీ బాయ్స్‌, ఆటో డ్రైవర్లు, జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, గిగ్‌ వర్కర్లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు మాట్లాడుతూ.. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టు ఉద్యోగులను అధికారులు వేధిస్తున్నారని సిబ్బంది ఆరోపించారు. తమకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తామని ఇవ్వలేదన్నారు. కాంట్రాక్టర్లు 11 గంటలు పనిచ ేయిస్తున్నారని కార్మికులు తెలిపారు. సదుపాయాలు అడిగితే ఉద్యోగం మానేయమంటున్నారని ఆవేదన చెందారు. డెలివరీ బాయ్స్‌, క్యాబ్‌, ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ..పోలీసులు చలాన్లతో వేధిస్తున్నారన్నారు. తరచూ ప్రమాదాల బారినపడుతున్నామని డెలివరీ బాయ్స్‌ సైతం తమ బాధను రాహుల్‌కు చెప్పారు.

సంపాదించినదంతా డీజీల్‌, పెట్రోల్‌కే సరిపోతుందని ఆటోడ్రైవర్లు అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సదుపాయాలు కల్పించాలని డెలివరీ బాయ్స్‌ విజ్ఞప్తి చేశారు. తమకు ప్రమాద బీమా కల్పించాలని డెలివరీ బాయ్స్‌ రాహుల్‌ గాంధీని కోరారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతానని రాహుల్‌ గాంధీ వారికి హావిూ ఇచ్చారు. ఖైరతాబాద్‌లో కాంట్రాక్ట్‌ కార్మికులతో రాహుల్‌ గాంధీ మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. డ్రైవర్స్‌, డెలివరీ బాయ్స్‌, శానిటరీ వర్కర్లు, హెల్త్‌ వర్కర్లతో కాంగ్రెస్‌ అగ్రనేత ముఖాముఖి నిర్వహించారు. డెలివరీ బాయ్స్‌ తమ కష్టాలు మొరపెట్టుకున్నారు. రోజుకు ఎంత డబ్బు వొస్తుందని రాహుల్‌ ఆరా తీశారు. తమకు టూ వీలర్స్‌ ఇప్పించాలని, పెట్రోల్‌ రేట్‌ తగ్గించాలని డెలివరీ బాయ్స్‌ కోరారు.

అటు సానిటరీ వర్కర్లు, హెల్త్‌ వర్కర్లు కూడా తమ సమస్యలను రాహుల్‌ ముందు ఏకరువు పెట్టారు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎంత కష్టపడినా గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గంటల కొద్దీ పని చేసినా తగినంత వేతనం రావడం లేదని సానిటరీ వర్కర్లు చెప్పుకొచ్చారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నా పర్మినెంట్‌ చేయలేదని తెలిపారు. తమపై దయచూపి పర్మినెంట్‌ చేయాలని రాహుల్‌కు సానిటరీ వర్కర్లు వినతి చేశారు. తెలంగాణ సర్కార్‌ ఇచ్చిన హావిూలు నెరవేర్చలేదని కాంట్రాక్ట్‌ వర్కర్లు వాపోయారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వొచ్చాక తమ సమస్యలు తీర్చాలని రాహుల్‌ గాంధీని కోరారు. గత పదేళ్లుగా తమ సమస్యలు తీరడం లేదని క్యాబ్‌ డ్రైవర్లు తెలిపారు. సంక్షేమ ఫలాలు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే అందుతున్నాయని అన్నారు. సంపాదించింది అంతా పెట్రోల్‌, డీజిల్‌కే పోతుందని..చలానాలతో ట్రాఫిక్‌ పోలీసులు వేధిస్తున్నారని ఆటో డ్రైవర్లు వాపోయారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చాక అందరి సమస్యలపై సీఎంతో మాట్లాడుతానని..అన్నింటినీ పరిష్కరిస్తామని కాంట్రాక్ట్‌ కార్మికులకు రాహుల్‌ గాంధీ హావిూ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page