ఎక్కడ అన్యాయమున్నా
అక్కడ ప్రత్యక్షమై
వెరవక ఎదురొడ్డి నిలిచిన వాడా
అన్నార్తుల ఆకలిని
ఉన్నోళ్ళ దోపిడీని నిలదీసిన
తిరుగు యోధుడా !
అన్నపు రాశులన్నీ ఒక ప్రక్క
అన్నార్తులంతా మరో ప్రక్క అంటూ
అస్తవ్యస్త వ్యవస్థ నగ్నత్వాన్ని
ప్రజల గొంతుకకు ప్రతిరూపమై
సిసలైన ప్రజాకవిగా
అలతి మాటలతో అనల్ప
భావాలను పలికించి
తెలుగు గుండెల్లో గుడిగా
నిలిచిన కలం సైనికుడా !
నిజాం నిర్బంధాన్ని నిరంకుషాన్ని
రజాకార్ల రాక్షస అకృత్యాలను
ఎదురొడ్డి పీడితుల పక్షాన
విముక్తి బావుటాఎగరేసినవాడా!
వలస పాలకుల అక్రమాలకు చలించి
ముక్కోటి తెలంగాణా గుండె చప్పుడై
యాస భాష సంస్కృతి రక్షణ కోరి
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సారథిగా
పోరాట శంఖాన్ని పూరించిన వాడా !
ప్రాంతం వాడే దోపిడీ చేస్తే
ప్రాణంతోనే పాతరేయాలి
అనగలిగిన తెగువ నీకే సాధ్యం
ఉద్యమాలకు ఊతం చిరునామా
కష్టం కనిపిస్తే కన్నీటి సంద్రమయ్యే
పసి పాప మనసున్న భీష్ముడు
మన భోళా శంకరుడు కాళన్న !
మనిషిని మరోమనిషి హింసిస్తే
కాళరుద్రుడుగా మారి మూడోనేత్రాన్ని
తెరిచి అగ్ని వర్షం కురిపిస్తాడు
ఎక్కడో పుట్టినా పోరుగడ్డ
ఓరుగల్లు మట్టిలో మనీషిగా వెలిగి
జనం బాధలే తన బాధలుగా
అణగారిన బడుగుల గుండెచప్పుళ్ళనే
‘తన గొడవ‘ గా నినదించిన
అలుపెరగని కలం వీరుడా !
మనిషి తనాన్ని ప్రేమించి
జన జీవనదిగా నిర్మలంగా
ప్రవహించే అనితర సాధ్యుడా !
నీవన్నట్టు…..
పుట్టుక నీది కానీ బ్రతుకును
ప్రజలకంకితం చేసిన మహాత్మా
నీకివే వినమ్ర ప్రణామాలు !
– డా. కె. దివాకరా చారి
9391018972