‘‘కాశ్మీరీ లోయలో ఉద్యోగాలు పొందిన మైనారిటీ హిందువులు, సిక్కుల ప్రాణాలకు హాని పొంచి ఉందని, ఏ క్షణంలోనైనా ఏ వైపు నుంచైనా ఉగ్రవాదులు దాడి చేయవచ్చనే భయంతో అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఉద్యోగాలు చేయవలసి వస్తున్నది. గత మూడు మాసాలుగా మైనారిటీ హిందువులు వరుసగా హత్య చేయబడడంతో తమను సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేయాలని ప్రభుత్వానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి.’’
ఇటీవల పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేస్తూ ఆగష్టు 2019 నుంచి నేటి వరకు 118 మంది అమాయక మైనారిటీ హిందూ పౌరులు, అందులో 21 మంది కాశ్మీరీ పండితులు, సిక్కులు, ఇతర హిందూ పౌరులు ఉగ్రవాదుల చేతుల్లో హత్య చేయబడ్డారని తెలుపడం మనకు విధితమే. కాశ్మీర్లో నివసిస్తున్న మైనారిటీ హిందువులకు భద్రత కరువైందని, వారు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని భయం భయంతో బతుకుతున్నారని అక్కడి నెలకొన్న భయానక వాతావరణం వివరిస్తున్నది. మార్చి 2021 ప్రభుత్వ వివరాల ప్రకారం 520 మంది కాశ్మీరీ పౌరులు తిరిగి తమ కాశ్మీరీ లోయ ప్రాంతాల్లో ఉద్యోగం చేయడానికి వచ్చారని, కనీసం మరో 2000 మంది తమ పూర్వ ప్రాంతాలకు చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపింది. ఆర్టికిల్ 370 రద్దు, జె అండ్ కె పునర్వ్యవస్థీకరణ అనంతరం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక పునరావాస పథకం ప్రకారం కాశ్మీరీ పండితులు, సిక్కులు, మైనారిటీ హిందువులకు ఉద్యోగాలు కల్పించి కాశ్మీర్ లోయలో బదిలీకి ఆస్కారంలేని పోస్టింగ్స్ ఇవ్వడంతో పాటు 7.5 లక్షల ఆర్థిక సహాయం, తాత్కాలిక గృహ వసతులు కల్పించడానికి వెసులుబాటు కల్పించారు.
కాశ్మీరీ లోయలో ఉద్యోగాలు పొందిన మైనారిటీ హిందువులు, సిక్కుల ప్రాణాలకు హాని పొంచి ఉందని, ఏ క్షణంలోనైనా ఏ వైపు నుంచైనా ఉగ్రవాదులు దాడి చేయవచ్చనే భయంతో అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఉద్యోగాలు చేయవలసి వస్తున్నది. గత మూడు మాసాలుగా మైనారిటీ హిందువులు వరుసగా హత్య చేయబడడంతో తమను సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేయాలని ప్రభుత్వానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల బుద్గామ్ తహసిల్‌లో పని చేస్తున్న క్లర్క్ రాహుల్ భట్, రాజస్థానీ హిందూ బ్యాంకు ఉద్యోగి, బీహారీ ఇటుక బట్టీల్లో పని చేస్తున్న కార్మికుడు, ఒక సిక్ స్కూల్ ప్రిన్సిపల్, ఒక దళిత స్కూల్ టీచర్ లాంటి పలువురు మైనారిటీ హిందువులు ఉగ్రవాదుల చేతుల్లో హత్య కాబడ్డారు. హిందు దంపతులు రాజ్‌కుమార్, రజనీ బాలలు కాశ్మీరీ లోయలో అభద్ర వాతావరణంలో ఉద్యోగాలు చేస్తూ సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేయాల్సిందిగా అభ్యర్తించారు. ఉద్యోగ బదిలీ పొందిన రజనీ బాల్‌ను చివరి రోజున ఉగ్రవాదులు హత్య చేయడం జరిగింది. భార్య హత్య అనంతరం భర్త రాజ్‌కుమార్‌ను ప్రభుత్వం విధిలేనా పరిస్థితిలో సురక్షిత ప్రాంతానికి బదిలీ చేసింది.
కాశ్మీరీ లోయలో పని చేస్తున్న 5,000లకు పైగా మైనారిటీ హిందువులు తమకు భద్రత కావాలని, ఏ క్షణం ఏ వైపు నుంచి మరణం వస్తుందో తెలియని దుస్థితిలో విధులు నిర్వహిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేయడం బాధగా ఉన్నది. నేడు లోయలో పని చేస్తున్న మైనారిటీ హిందువులు జీవనానికి, జీవనభృతికి మధ్య కొట్టుమిట్టాడుతున్నారని అర్థం అవుతున్నది. ప్రభుత్వ పునరావాస పథకం ద్వారా హిందువులకు లోయలో ‘బదిలీకి వీలుకాని ఉద్యోగ పోస్టింగులు’ ఇవ్వడం ద్వారా వారిని కాశ్మీర్‌లోకి పునరాగమన ప్రక్రియలను చేపట్టారు. తమ ప్రాణాలతో పాటు తమ బతుకులతో ప్రభుత్వం ఆటలు ఆడుకుంటోందని, తమ ప్రాణానికి సంపూర్ణ భద్రత ఇవ్వడానికి ప్రభుత్వం పూర్తి హామీ ఇవ్వాలని కోరడం సముచితంగా ఉంది. 1990ల్లో తమ కుటుంబాలను లోయలో కోల్పోయామనే వాస్తవాన్ని ఇటీవల విడుదలైన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా కళ్ల ముందు ఉంచిందని, నేడు మళ్లీ అదే దుస్థితిలో ఉద్యోగ ఉపాధులు చేస్తున్నామని, మైనారిటీ హిందువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత 32 ఏండ్లుగా కాశ్మీరీ పండితులు, సిక్కులు తీవ్రమైన హింసలు, ఊచకోతలకు లోనవుతూ లోయను వదిలి ప్రాణాలు కాపాడుకున్నారనే వాస్తవాన్ని పండితులు గుర్తు చేస్తున్నారు. కాశ్మీరీ హిందూ ఉద్యోగులను బదిలీ చేస్తే ఉగ్రవాదులకు భయపడి చేస్తూన్నారనే వాదనలు వినిపిస్తాయని ప్రభుత్వం భావిస్తున్నది. నేడు లోయలోని మైనారిటీ హిందువులు, సిక్కులు భద్రత కావాలని చేస్తున్న శాంతియుత ఉద్యమాలను ప్రభుత్వం సునిశితంగా పరిశీలించాల్సిందే. ప్రాణాలను గాల్లో దీపాలుగా చేసుకొని అనుక్షణం భయం గుప్పిట్లో విధులు నిర్వహించలేమని, పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకు తమను సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేయమనడం అర్థవంతంగా ఉంది. హింసాత్మక వాతావరణంలో ప్రశాంతంగా పని చేయడం వీలుకానపుడు వారి ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. హత్యానంతరం ప్రభుత్వాలు ప్రకటించే పరిహారాలు పోయిన ప్రాణాలను తీసుకురాలేవని, కాశ్మీరీ మైనారిటీ హిందువులు, సిక్కు కుటుంబాలకు రక్షణ గొడుగు పట్టాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని సామాన్యులు ఆశిస్తున్నారు. లోయలోంచి ఉగ్రవాదుల్ని తరిమి, శాంతియుత వాతావరణాన్ని సత్వరమే నెలకొల్పే కఠిన చర్యలకు ప్రభుత్వాలు పూనుకోవాలి. మైనారిటీ హిందు బంధువుల మదిలో శాంతి స్థాపన చేయాలి.
డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
కరీంనగర్ – 994970003