కిషన్‌రెడ్డికి మరోసారి టెస్ట్ ‌మ్యాచ్‌

తెలంగాణ భారతీయ జనతాపార్టీలో మార్పులపై గత కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చలకు ఎట్టకేలకు తెరపడింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుతోపాటు మరికొందరు సీనియర్‌ ‌నేతలకు పార్టీ పదవులనిచ్చి కొద్ది కాలంగా పార్టీలో జరుగుతున్న అంతర్ఘత విభేదాలకు ఫుల్‌ ‌స్టాప్‌ ‌పెట్టగలిగామని కేంద్ర నాయకత్వం భావిస్తోంది. కాని, జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే మరికొందరు నేతల్లో ఇంకా అసంతృప్తితోనే ఉన్నట్లు కనిపిస్తున్నది. కొత్తగా అధ్యక్ష బాధ్యతలను చేపట్టబోతున్న కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి వీరందరినీ ఏవిధంగా అనునయిస్తారన్నది వేచిచూడాలి.

అధ్యక్షుడిగా ఇంకా బాధ్యతలు చేపట్టకముందే రాష్ట్రంలో ప్రధాని పర్యటన ఖరారయింది. దీన్ని విజయవంతం చేయాల్సిన బృహత్తర బాధ్యత ఇప్పుడు ఆయన భుజస్కందాలపై పడింది. నిన్నటివరకు బిజెపి కార్యకర్తల్లో ఉత్సాహం నింపి ఉర్రూత లూగించిన బండి సంజయ్‌ని అధ్యక్షస్థానం నుండి తప్పించడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనైనాడు. అధ్యక్షుడి మార్పు చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే ఆయనను కేంద్ర నాయకత్వం దిల్లీకి పిలవడంతోనే తాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తిరిగి వొస్తానోలేదో అన్న బాధను బండి వ్యక్తంచేశాడు. అనుకున్నట్లుగానే ఆయన స్థానంలో కిషన్‌రెడ్డికి అధిష్టానం బాధ్యతలను అప్పగించింది.

ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్‌ ‌సభ ఏర్పాట్లు అప్పటికే బండి సంజయ్‌ ‌పర్యవేక్షణలో కొనసాగుతుండగా, ఇప్పుడు కిషన్‌రెడ్డి ఆ బాధ్యతలను చూడాల్సి వొచ్చింది. కిషన్‌రెడ్డిని అధ్యక్షుడిగా ప్రకటించేప్పటికి ఇంకా ఆయన దిల్లీలోనే ఉన్నారు. ప్రధాని రావడానికి మధ్యలో కేవలం నాలుగు రోజుల సమయమే ఉండడంతో ఆయన ప్రధాని వొచ్చి వెళ్ళే వరకు వరంగల్‌లోనే మకాం వేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతవరకు బాగానే ఉన్న, పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలందరినీ ఆయన ఈ సందర్భంగా ఒకే వేదికపైకి తీసుకురాగలడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈటల రాజేందర్‌కు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ‌గా మరో కొత్త పదవినిచ్చారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఆఖరి ముఖ్యమంత్రిగా కొనసాగిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ నుండి బిజెపి పార్టీలోకి మారడంద్వారా ఒక సంచలనానికి కారకుడైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఏ పదవి ఇవ్వలేదు. దాంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నాడు. తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వడంలేదంటూ ఆయన కొద్ది కాలంగా అలిగిన విషయం తెలిసిందే.

అంతటితో ఆగకుండా ఆయన పార్టీ మారుతాడన్న వదంతులు బాగానే వ్యాపించాయి. దానికి తగినట్లుగా ఇటీవల కాంగ్రెస్‌ ‌తీర్థం పుచ్చుకున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయనతో రహస్య భేటీ నిర్వహించినట్లు కూడా ప్రచారం జరుగుతున్నది. దీన్నిబట్టి ఆయన తిరిగి కాంగ్రెస్‌ ‌గూటికే వెళ్ళే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతున్నది. అదేవిధంగా ఎమ్మేల్యే రఘునందన్‌రావు కూడా తన అసంతృప్తిని వ్యక్తంచేసినట్లు వార్తలు వొచ్చాయి .అయితే ఆయన దాన్ని ఖండిస్తున్నప్పటికీ పార్టీపై ఆయన మాటల ప్రభావం ఉండకపోదు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న తనకు కూడా పార్టీ సరైన గుర్తింపు ఇవ్వడంలేదని సీనియర్‌ ‌నాయకురాలు విజయశాంతి కూడా అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వొస్తున్నాయి. ఇలా మరి కొందరు నాయకులు ఆ పార్టీలో ఇముడలేక పోతున్నట్లు అడపాతడపా వార్తలు వొస్తూనే ఉన్నాయి.

వీరందరినీ సమన్వయపర్చి సభను దిగ్విజయం చేయాల్సిన బాధ్యత ఇప్పుడు కిషన్‌రెడ్డిపై ఉంది. అయితే కిషన్‌రెడ్డికి ఈ బాధ్యతేమీ కొత్తదేమీ కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్ళు ఆయన పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిన వ్యక్తి. అంతేకాదు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా ఆయన రెండేళ్ళపాటు పార్టీ అధ్యక్షుడిగా సేవలందించిన వ్యక్తి. కిషన్‌రెడ్డి బిజెపి ఆవిర్భావంనుండి ఆ పార్టీలో కొనసాగుతున్నాడు. 1977లో జనతాపార్టీ యువజన విభాగం నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన 1980లో భాజపా ఆవిర్భావం నుండి సభ్యుడు. అప్పటినుండి యువజన మోర్చ, బిజేవైఎం లాంటి అనుబంధ సంస్థలు మొదలు పార్టీలో అనేక పదవులను అలంకరించిన వ్యక్తి. 2010లోనే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడిగా మొదటిసారి ఎంపికైనారు. శాసనసభ్యుడిగా, ఎంపిగా, ప్రస్తుతం కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా కొనసాగుతున్న కిషన్‌రెడ్డి ఈ క్లిష్ట సమయంలో పార్టీని చక్కదిద్దుతాడని బిజెపి కేంద్ర నాయకత్వం భావించినట్లుంది.

కర్ణాటక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బిజెపి పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు రానున్నందున కార్యకర్తల్లో చోటు చేసుకున్న నిర్వేదాన్ని తొలగించేందుకు కొన్ని మార్పులు, చేర్పులు అనివార్యంగా పార్టీ భావించింది. ముఖ్యంగా కర్ణాటక ఓటమిపై బేరీజు వేసుకున్న పార్టీ, తెలంగాణలో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా జాగ్రత్తలు తీసుకునే పనిలో పడింది. ఈ నెల 8న వరంగల్‌ ‌జిల్లాలో ప్రధాని పర్యటన గత కొద్దికాలంగా పార్టీలో నెలకొన్న స్థబ్ధతను తొలగించి, కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపేదిగా ఉండాలని పార్టీ భావిస్తోంది. ప్రధాని పర్యటనతోనే ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని కూడా ఆ పార్టీ భావిస్తోంది. మోదీ పర్యటన అనంతరం రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నూతన ప్రణాళికతో రాష్ట్రంపైన ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించేందుకు పార్టీ సిద్దమవుతోంది. దాదాపు అయిదు దశాబ్దాల రాజకీయ అనుభవమున్న కిషన్‌రెడ్డికి ఎంతో కీలక సమయంలో అధ్యక్షపదవిని పార్టీ అప్పగించింది. రానున్న ఎన్నికల్లో ఆయన పార్టీని ఏ గట్టుకు చేరుస్తాడో వేచి చూడాల్సిందే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page