హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 09 : రాష్ట్రంలో కులగణన చేపట్టాలని ప్రజా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సామాజిక తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ సీఎం పదవితో పాటు కీలకమైన మంత్రి పదవులు అన్ని అగ్రవర్ణాలకు కేటాయించి బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. బీసీలకు నామమాత్రపు మంత్రి పదవులు అప్పగించి కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి మరోసారి బీసీలను మోసం చేశాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ ఉత్తదే అని మరోసారి నిరూపించుకుందని అన్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు అసెంబ్లీ స్థానాలను కేటాయింపుల్లో బీసీలకు ఇవ్వకుండా ద్రోహం చేసిందని అన్నారు. రాష్ట్రంలో సుమారు 60 శాతం ఉన్న బీసీలకు రెండు నామమాత్రపు మంత్రి పదవులు కట్టుబెట్టి చేతుల దులుపుకుందని విమర్శించారు. రాష్ట్రంలో కులగణనను, అలాగే గతంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వేను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలలోనే కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.