మోడీ చీకటి మిత్రుడు కెసిఆర్
ఎందుకు కెసిఆర్ అవినీతిని ప్రశ్నించలేదు
పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 4 : తెలంగాణ మిత్రులారా తన చీకటి మిత్రుడు కెసిఆర్ పేరు కూడా ప్రస్తావించకుండా, తాను చేసిన ప్రసంగంలో ఎక్కడా కెసిఆర్ కుటుంబ పాలన, కెసిఆర్ కుటుంబ అవినీతి ఊసెత్తకుండా మోడీ మిత్ర ధర్మం పాటించారని బీజేపీ, టీఆర్‌ఎస్ భాయ్ భాయ్ అంటూ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. మోడీ, కెసిఆర్ పేరును ప్రస్తావించక పోవటం వ్యూహాత్మకం అని పలువురు భావిస్తుంటే, రేవంత్ రెడ్డి కెసిఆర్‌ను, మోడీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. మోడీగారి మిత్ర ధర్మం చూశారుగా అంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేసిన శ్రీకాంతాచారి, జయశంకర్‌లను ప్రస్తావించకుండా మోడీ ప్రసంగం సాగిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
కెసిఆర్ అవినీతిపై బీజేపీ నేతలు మూడు సంవత్సరాలుగా మాటలు చెబుతున్నారని, మరి మోడీ ప్రసంగంలో ఎందుకు కెసిఆర్ అవినీతిని ప్రశ్నించలేదని రేవంత్ రెడ్డి నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై మాట్లాడిన నేతలు చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రశ్నాస్త్రాలు సంధించారు. తెలంగాణ ఏర్పాటుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మోడీ, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పకుండా ఏ విధంగా ప్రసంగిస్తారని రేవంత్ రెడ్డి నిలదీశారు. తెలంగాణ గడ్డపై ఉండి విభజనను ఆనాడు అమిత్ షా తప్పుబట్టారు అని మండిపడ్డ రేవంత్ రెడ్డి ప్రజలకు మోడీ, అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణా రాష్ట్ర అభివృద్ధికి మోడీ, కేసీఆర్ ఇప్పటి వరకు ఏం చేశారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. ఇక ఇదే సమయంలో తెలంగాణా కాంగ్రెస్ కూడా మోడీ సభను టార్గెట్ చేసి ట్వీట్ చేసింది. చదువు రాని వాడిని ప్రధాన మంత్రిని చేస్తే.. గిట్లనే ఉంటది అంటూ ఆసక్తికర పోస్ట్ చేసిన తెలంగాణ కాంగ్రెస్ మోడీ ముందు స్క్రీన్ లేనిదే ఒక్క ముక్క అయిన మాట్లాడతావా అసలు అంటూ ఎద్దేవా చేసింది. నీ కన్న నాల్గో తరగతి పిల్లోడు బెటర్ రా అయ్యా అంటూ ప్రధాని మోడీపై సెటైర్లు వేసింది.