- 28న ఉదయం 11.55 కు మహాకుంభ సంప్రోక్షణ
- అనంతరం భక్తులకు దర్శనం
- ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా గుర్తింపు
- యాడా ప్రత్యేకాధికారి కిషన్ రావు వెల్లడి
- 28న సిఎం కెసిఆర్ పర్యటనకు ఏర్పాట్లపై అధికారులతో సిపి సమీక్ష
ప్రజాతంత్ర, యాదాద్రి, మార్చి 19 : యాదాద్రి విస్తరణ పనులు శరవేగంగా పూర్తి కావచ్చాయని యాడా ప్రత్యేకాధికారి కిషన్ రావు అన్నారు. ఆలస్యం అయినా పనులు పక్కాగా చేపట్టడం సంతృప్తిని ఇచ్చిందని అన్నారు. సిఎం కెసిఆర్ ఆలోచనలకు అనుగుణంగా నిర్మాణాలు పూర్తి చేసుకున్నామని అన్నారు. ఇక యాదాద్రి ప్రపంచంలోనే అద్భుత ఆలయంగా నిలిచిపోతుందని అన్నారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు నిర్మాణ పనులు పూర్తి కావడం ఆనందంగా ఉందని అన్నారు. మహాకుంభ సంప్రోక్షణతో ఇక ఆలయ వైభవం ప్రజలకు సాక్షాత్కారం కానుందని అన్నారు. యాదగిరిగుట్టను మరో తిరుమలగా మారుస్తానని చెప్పింది మొదలు ఇప్పటికే పలుమార్లు యాదాద్రిని సందర్శించిన సిఎం కెసిఆర్ ఆలయ అభివృద్ధికి పెద్దపీట వేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని దివ్యమనోహరంగా తీర్చిదిద్దాలన్న సీఎం కేసీఆర్ ఆకాంక్ష మేరకు నిధులు కేటాయించారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి చేయడం ఓ మహాయజ్ఞంగా భావిస్తున్నామని అన్నారు. దేశంలోనే అద్భుత ఆలయంగా తీర్చిదిద్దడానికి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులు ఈ ఏడాది పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
ఆలయ పునర్నిర్మాణ పనుల్లో ఏమాత్రం జాప్యం లేకుండా సమాంతరంగా చేపట్టాల్సిన పనులు పూర్తి చేస్తేనే ప్రధాన ఆలయం పనులతో పాటు కొండపై భక్తులకు కనీస సదుపాయాలు సమకూరుతాయని భావించి కార్య దీక్షతో ముందుకు సాగామని అన్నారు. ఇవి కాకుండా మిషన్ కాకతీయ ద్వారా యాదాద్రి చుట్టుపక్కల చెరువులను అభివృద్ధి చేశారు. మిషన్ భగీరథతో యాదాద్రికి మంచినీటి సౌకర్యం కల్పించే పనులు చేపట్టారు. గండిచెరువులో ఎప్పుడూ నీళ్లు ఉండేవిధంగా ఏర్పాటు చేశారు. గోదావరి నీటితో స్వామి పాదాలను కడిగేలా మల్లన్న సాగర్ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు బస్వాపూర్ చెరువును కూడా సిద్దం చేశారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం కోట్లాది మంది భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారని కిషన్ రావు ఈ సందర్భంగా అన్నారు. ఈ నెల 28న ఉదయం 11 గంటల 55 నిమిషాలకు మహకుంభ సంప్రోక్షణ జరుగుతుందని ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని తెలిపారు. మార్చి 21వ తేదీ నుంచి 7 రోజుల పాటు బాలాలయంలో పంచకుండాత్మక యాగం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
108 పారాయణ దారులు, ఆలయ అర్చక బృందంతో ఈ క్రతువు జరుగుతుందన్నారు. ఆలయ గోపురాల కలశాలన్నింటికీ సంప్రోక్షణ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు చెప్పారు. 21 నుంచి 28 వరకు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో బాలాలయంలో పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 28న సంప్రోక్షణ అనంతరం బాలాలయంలోని స్వామివారి ఉత్సవమూర్తులను శోభాయాత్రగా ప్రధానాలయంలోకి తరలిస్తామన్నారు. అన్ని పూజలు పూర్తయిన తర్వాత భక్తులకు దర్శనం కల్పిస్తారని తెలిపారు. ఈ ప్రాజెక్టులో సిఎం కెసిఆర్ తనను భాగస్వామిని చేయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఇది ఓరకంగా తన పూర్వజన్మ సుకృతమన్నారు.
28న సిఎం కెసిఆర్ పర్యటనకు ఏర్పాట్లపై అధికారులతో సిపి సమీక్ష
ఈ నెల 21 నుంచి 28 వరకు యాదాద్రి ఉద్ఘాటన మహోత్సవాలు జరగనున్న సందర్భంగా 28న జరిగే మహాకుంభ సంప్రోక్షణకు సీఎం కేసీఆర్ హాజరు కానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లకు సంబంధించి రాచకొండ సీపీ మహేష్ భగవత్ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ సీపీ సుధీర్ బాబు, ఈవో గీతారెడ్డి, డీసీపీ నారాయణ రెడ్డి, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ… యాదాద్రి ఉద్ఘాటనలో ఎలాంటి అవాంఛనీయం సంఘటనలు జరుగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.