- కేసీఆర్‌ను ఓడగొట్టేవరకు నిద్రపోను
- నాకు..నా కుటుంబానికి ఏం జరిగినా కెసిఆర్‌దే బాధ్యత
- అసెంబ్లీ నుంచి బయటకు పంపి గొంతు నొక్కారు
- కాంగ్రెస్ కూడా నిలదీయలేని దుస్థితిలో ఉంది
- మీడియాతో బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14 : కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తేలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. గతంలో నయీం ముఠా బెదిరించినప్పుడే భయపడలేదని..ఇప్పుడు కేసీఆర్‌కు ఎలా భయపడతానని అన్నారు. తనకు తన కుటుంబసభ్యులకు ఏమైనా జరిగితే కేసీఆర్ దే బాధ్యత అని చెప్పారు. తప్పు చేసినవాళ్లు దొరలెక్క ఉంటున్నారని..ప్రజల కోసం పనిచేసేవాళ్లకు శిక్షలు వేస్తున్నారని ఆరోపించారు. శాసనసభలో బీజేపీ హక్కులను ప్రభుత్వం కాలరాసిందని ఈటల ఆరోపించారు. స్పీకర్‌ను మరమనిషి అన్నందుకు తనకు శిక్ష వేశారని..మరి కేసీఆర్ అన్న మాటలకు ఎన్ని శిక్షలు వేయాలని ప్రశ్నించారు. అసెంబ్లీలో తమ గొంతు నొక్కుతున్నారని.. ఒక సభ్యుడు ఉన్నా బీఏసీలో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చేవారని తెలిపారు. బీఏసీ అంశం గురించి రఘునందన్ రావు అడిగినా స్పీకర్ పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. కేసీఆర్‌ను ఓడగొట్టేవరకు నిద్రపోను అని వ్యాఖ్యానించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ…నాది కానీ, నా కుటుంబ సభ్యులది కానీ ఒక్క రక్తం బొట్టు కారినా..పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని అన్నారు. హుజూరాబాద్‌లో విచ్చలవిడిగా గన్ లైసెన్స్‌లు ఇచ్చారని ఆరోపించారు.
కేసీఆర్‌ను ఓడించేవరకు నిద్రపోనంటూ బీజేపీ ఎమ్మెల్యే శపథం చేశారు. అవసరాల కోసం కేసీఆర్‌తో ఎమ్మెల్యేలు ఉన్నారని.. కొన్ని రోజులు ఆగితే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి క్యూ కడతారంటూ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. తనను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయటం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టన్నారు. సంస్కారహీనుడు, అబద్ధాలకోరు, చండాలంగా మాట్లాడే వ్యక్తి కేసీఆర్ మాత్రమే అంటూ విరుచుకుపడ్డారు. షర్మిల భాషపై స్పీకర్‌కు ఫిర్యాదు చేయటం దిక్కుమాలిన చర్య అని అన్నారు. వ్యక్తికి కాదు..ప్రధాని కుర్చీకి గౌరవం ఇవ్వాలని భట్టిని ఉద్దేశించి అసెంబ్లీలో కేసీఆర్ అనలేదా? అని ప్రశ్నించారు. సభ్యల హక్కులను కాపాడాల్సిన స్పీకరే…తన హక్కులను కాలరాశారని మండిపడ్డారు. మళ్ళీ ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినా హజరై తీరుతానని స్పష్టం చేశారు.
సభ జరుగుతున్న తీరును కాంగ్రెస్ ప్రశ్నించకపోవటం సిగ్గుచేటన్నారు. బీఏసీ సమావేశానికి బీజేపీని ఎందుకు పిలవటం లేదని అడిగితే సమాధానం చెప్పటం లేదని తెలిపారు. రైతుల సమస్యలు ప్రతిపక్ష కాంగ్రెస్‌కు పట్టదా అంటూ నిలదీశారు. కేసీఆర్‌కు దమ్ముంటే ప్రజా తీర్పును కోరటానికి రావాలని సవాల్ విసిరారు. నమ్మిన సిద్దాంతం కోసం పని చేస్తున్నానని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగం లేకుండా సభ ఎప్పుడు జరగలేదని ఈటల అన్నారు. రుణమాపీ చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజాసమస్యలను అసెంబ్లీలో చర్చించలేదని మండిపడ్డారు. ప్రజలు హూజూరాబాద్‌లో కేసీఆర్‌ను తిరస్కరించి..సభలోకి తనను పంపారని చెప్పారు. అటువంటిది తనను సభ నుంచి వెళ్లగొట్టారని మండిపడ్డారు.