కేసీఆర్‌ ‌దళిత సామాజిక వర్గాన్ని అవహేళన చేశారు

దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మోసం చేశారు
-బీసీని ముఖ్యమంత్రి చేయాలని బీజేపీ నిర్ణయించడం చారిత్రాత్మక నిర్ణయం
-తెలంగాణలో సకలజనుల పాలనను అందిస్తాం..:కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ ‌రెడ్డి
– పలువురు బీజేపీలో చేరిక  

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: ‌స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఒక జాతీయ పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేయాలని నిర్ణయించడం చారిత్రాత్మక, సామాజిక విప్లవంతో కూడిన నిర్ణయమని  కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ ‌రెడ్డి అన్నారు. ఆదివారం  భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో   కిషన్‌ ‌రెడ్డి  నేతృత్వంలో.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌ ‌రెడ్డి  సమక్షంలో నిర్మల్‌ ‌మాజీ ఎమ్మెల్యే నల్లెల ఇంద్రకరణ్‌ ‌రెడ్డి  వారితో పాటు..  నలుగురు మాజీ ఎంపీపీ, మాజీ సర్పంచ్‌ ‌లు..   ఎంపీటీసీ లు..  వివిధ సంఘాల నాయకులు వ్యాపారావేత్తలతో పాటు,  మంథని నియోజకవర్గ నాయకులు చల్ల నారాయణ రెడ్డి, వారి అనుచరులు, ప్రజాప్రతినిధులు  భారతీయ జనతా పార్టీలో చేరారు.  పార్టీలో చేరిన నాయకులు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు పార్టీ కండువా కప్పి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు కిషన్‌ ‌రెడ్డి ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ .. ఉమ్మడి కరీంనగర్‌ , ఉమ్మడి ఆదిలాబాద్‌ ‌జిల్లా నుంచి భారతీయ జనతా పార్టీలో చేరిన నాయకులందరికీ స్వాగతం పలుకుతున్నాను. మరో రెండు మూడు రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నవంబరు 3 వ తేదీ నుంచి భారతీయ జనతా పార్టీ విస్తృత స్థాయి ప్రచారాన్ని ప్రారంభిస్తుంది. బిజెపి జాతీయ అధ్యక్షులు, కేంద్ర మంత్రులు, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. అనేక సంవత్సరాలుగా బీసీలకు సామాజిక న్యాయం జరగాలని అనేక పోరాటాలు జరిగాయి. కాని, ఆయా ప్రభుత్వాలు మోసం చేశాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి సారిగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మొట్టమొదటగా బీసీని ప్రధానమంత్రిగా చేసింది.

ప్రధాని మోదీ  ప్రపంచం అబ్బురపడేలా నీతివంతమైన, సమర్థవంతమైన పాలన అందిస్తున్నారు. తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి చేయాలని నిర్ణయించడంపై మారుమూల గ్రామాల నుంచి బీసీ సామాజిక వర్గం ప్రజలు, సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే అనేక బీసీ సంఘాలు బిజెపికి మద్దతు తెలుపుతూ తీర్మానం చేశాయి. బీసీని ముఖ్యమంత్రిని చేసుకుంటామని ముందుకొస్తున్నారు. బీసీ కమిషన్‌ ‌కు చట్టబద్ధత కల్పించిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిదే. కేసీఆర్‌.. ‌దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మోసం చేసి దళిత సామాజిక వర్గాన్ని అవహేళన చేశారని ఆయన విమర్శించారు.  మాట ఇస్తే నెరవేర్చే పార్టీ.. హామీ ఇస్తే అమలు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. అన్ని బీసీ కుల సంఘాలు బీజేపీకి మద్దతు తెలుపుతున్నాయి. బీసీ నేతను ముఖ్యమంత్రిని చేసుకోవటానికి బాధ్యత తీసుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ ‌తొలి కేబినెట్‌ ‌లో ఒక్క మహిళా మంత్రికి స్థానం కల్పించలేదు. ఎస్సీ సబ్‌ ‌ప్లాన్‌ ‌ను కనుమరుగు చేసింది. మత రిజర్వేషన్ల పేరుతో బీసీలకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర కాంగ్రెస్‌ ‌ది. పదేండ్లుగా ముస్లింలను బీసీ జాబితాలో చేర్చి బీసీలకు అన్యాయం చేసిన చరిత్ర కాంగ్రెస్‌-‌బీఆర్‌ఎస్‌ ‌ది.

హైదరాబాద్‌ ‌నగరంలో 50 సీట్లు బీసీలకు రిజర్వేషన్‌ ‌చేస్తే.. అందులో 37 సీట్లను మజ్లిస్‌ ‌పార్టీ మతపరమైన రిజర్వేషన్ల పేరుతో ఎత్తుకుపోయింది. అనేక జిల్లాలో మతపరమైన రిజర్వేషన్ల పేరుతో బీసీలకు అన్యాయం చేస్తున్నవి. బిజెపి అధికారంలోకి రాగానే బీసీలకు అన్యాయం చేసే ముస్లిం రిజర్వేషన్లను మొదటి కేబినెట్‌ ‌లోనే రద్దు చేస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేసేలా రిజర్వేషన్లు కల్పిస్తాం. సామాజిక న్యాయానికి కట్టబడి ఉంది భారతీయ జనతా పార్టీనే. ప్రపంచం గర్వపడే శాస్త్రవేత్త, మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన అబ్ధుల్‌ ‌కలాంని రాష్ట్రపతిని చేసిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిది. దళిత సామాజిక వర్గానికి చెందిన రామ్‌ ‌నాథ్‌ ‌కోవిద్‌ ‌ని, గిరిజన బిడ్డ ద్రౌపది ముర్ముని రాష్ట్రపతిని చేసింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. మజ్లిస్‌ ‌ను అడ్డుపెట్టుకుని రాజకీయం చేసే పార్టీ కాంగ్రెస్‌. ‌బీఆర్‌ఎస్‌ ‌మంత్రులు ఓల్డ్ ‌సిటీలో అడుగుపెట్టాలంటే దారుస్సలాంలో అసదుద్దీన్‌ ‌పర్మిషన్‌ ‌తీసుకుంటున్నారు. మజ్లిస్‌ అనుమతి లేకుండా నాడు కాంగ్రెస్‌ ‌మంత్రులు, నేడు బీఆర్‌ఎస్‌ ‌మంత్రులు పాతబస్తీలో పర్యటించలేని పరిస్థితి.

మజ్లిస్‌ ‌పార్టీ కనుసైగల్లో కేసీఆర్‌ ‌కుటుంబం పనిచేస్తోంది. మజ్లిస్‌ ‌ప్రాబల్యమున్న ప్రాంతాల్లో కరెంటు బిల్లులు కట్టడం లేదు. పన్నులు కట్టడం లేదు. ప్రభుత్వ అధికారులు వెళ్తే వారిపై కత్తులతో రౌడీయిజం చేస్తున్నరు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ అధికారులపై దాడులు చేసిన వారిపై యూపీలో యోగీ ప్రభుత్వం తరహాలోనే బుల్డోజర్లతో అణచివేస్తాం. గ్రామ పంచాయతీ నుంచి మొదలు ముఖ్యమంత్రి కార్యాలయం వరకు అవినీతిని అంతం చేస్తాం. దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అవినీతి మరక లేకుండా సుపరిపాలన అందిస్తోంది. ధరణి నుంచి మొదలు ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టుల వరకు కాంగ్రెస్‌ ‌తరహాలోనే బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అవినీతికి పాల్పడుతూ ప్రజల రక్తాన్ని తాగుతున్నారు. సంపద దోచుకుంటున్నారు. నరేంద్ర మోదీ కుటుంబ పాలనపై, అవినీతిపై యుద్ధం ప్రకటించారు.

తెలంగాణలో అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా సకలజనుల పాలనను అందిస్తాం. ఫాంహౌస్‌ ‌లో పడుకునే ముఖ్యమంత్రి ఉండడు.. రోజుకు 16 గంటలు ప్రజల కోసం పనిచేసే ముఖ్యమంత్రిని ప్రజల ముందుంచుతాం. కర్ణాటకలో కాంగ్రెస్‌ ‌పార్టీ గ్యారెంటీల పేరుతో మభ్యపెట్టి ప్రజలను దగా చేసింది. ఆర్టికల్‌ 370 ‌రద్దు, ట్రిపుల్‌ ‌తలాక్‌ ‌నిషేధం సహా అయోధ్యలో భవ్యమైన రామమందిరం నిర్మాణం చేస్తోంది నరేంద్ర మోదీ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదేండ్లలో తెలంగాణ అభివృద్ధి కోసం రూ. 9 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది. జై తెలంగాణ ఉద్యమంలో 369 మంది విద్యార్థులను కాల్చి చంపించిన దుర్మార్గ పార్టీ కాంగ్రెస్‌. ‌బీఆర్‌ఎస్‌ ‌మోసాలు, దగా చేసే పార్టీ. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని కోరుతున్నా. కర్ణాటకలో వేలకోట్లు అక్రమంగా సంపాదించిన డబ్బును తెలంగాణకు తరలించి, ఆ డబ్బు ఎన్నికల్లో ఖర్చుచేసి అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్‌ ‌పార్టీని తరమికొడదామని కిషన్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page