టిఆర్‌ఎస్ ప్రజాదరణ కోల్పోయింది
త్వరలో బిజెపిలోకి భారీగా చేరికలు
బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్
డబ్బులిచ్చి నేతలను ఆహ్వానించే సంస్కృతి కాదన్న బండి
బండి సంజయ్‌తో కలసి తరుణ్‌చుగ్‌తో దాసోజు శ్రవణ్ భేటీ
న్యూ దిల్లీ, అగస్ట్ 6 : కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటుందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ఆరోపించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వోటు వేసేందుకు ఢిల్లీ వొచ్చిన బండి సంజయ్‌తో పలు అంశాలపై చర్చింనట్లు ఆయన చెప్పారు. బండి సంజయ్ నాయకత్వంలో ప్రజాసంగ్రామ యాత్ర మోటార్ సైకిల్ యాత్రలు దిగ్విజయంగా నడుస్తున్నాయని చుగ్ ప్రశంసించారు. ప్రజల ఆశలను టీఆర్‌ఎస్ సర్కారు వమ్ము చేసిందని, ఆ పార్టీకి త్వరలోనే జనం గుడ్ బై చెప్పనున్నారని చెప్పారు. కేసీఆర్ ఇంటలిజెన్స్ కూడా ఇదే మాట చెబుతుందని అన్నారు. ప్రస్తుతం చూస్తున్నది ట్రైలర్ మాత్రమేనని, త్వరలోనే బీజేపీలో భారీ సంఖ్యలో చేరికలు ఉంటాయని చుగ్ స్పష్టం చేశారు. చేరికల తేదీ త్వరలోనే ఖరారు చేస్తామని తరుణ్‌చుగ్ ప్రకటించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోతుందని అన్నారు. కాంగ్రెస్ కేసీఆర్‌కు బీటీమ్‌గా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన సీనియర్ నేత దాసోజు శ్రవణ్ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్‌తో భేటీ అయ్యారు. దిల్లీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి చుగ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన శ్రవణ్‌కు శాలువా కప్పి సత్కరించారు. శ్రవణ్‌తో భేటీ అనంతరం వి•డియాతో మాట్లాడిన చుగ్ బీజేపీ విద్యార్థి పరిషత్‌తో పనిచేసిన శ్రవణ్‌తో చాలాకాలం తర్వాత భేటీ కావడం సంతోషం కలిగించిందని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో బీజేపీలో మరిన్ని చేరికలుంటాయని తరుణ్‌చుగ్ తెలిపారు.
నేతలకు డబ్బులిచ్చి పార్టీలో చేర్చుకునే సంస్కృతి బీజేపీది కాదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన రాజ్ గోపాల్ రెడ్డి, శ్రవణ్‌లు ఎందుకు పార్టీ మారుతున్నారో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. గతంలో సోనియాను తిట్టిన వాళ్లు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులయ్యారని బండి విమర్శించారు. కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు మాట్లాడుతున్న భాష చూసి జనం అసహ్యించు కుంటున్నారని అన్నారు. శ్రవణ్ చేరిక ఎప్పుడన్నది ప్రకటిస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇదిలావుంటే ఈ నెల 21న తనతో పాటు చాలా మంది ఉద్యమ నేపథ్యం ఉన్న వారందరూ బీజేపీలో చేరుతారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు.