- యాదాద్రి తదితర ఆలయాలకు పోటెత్తిన భక్తులు
- తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళసై
హైదరాబాద్,జనవరి1 : నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, భద్రకాళి టెంపుల్, బాసరతోపాటు హైదరాబాద్‌లోని బిర్లా టెంపుల్, చిలుకూరు బాలాజీ ఆలయం, దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయం సహా పలు క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీంతో స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. ప్రత్యేక దర్శనానికి 2 గంటలు పడుతున్నది. ఇక వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. సోమవారం అందునా కొత్త ఏడాది తొలిరోజు కావడంతోపాటు మేడారం జాతరకు ముందుగా రాజన్నను దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తున్నారు.
దీంతో గర్భగుడిలో ఆర్జిత సేవలను అధికారులు రద్దుచేశారు. గుండంలో స్నానాలు ఆచరించిన భక్తులు.. స్వామివారికి కోడె మొక్కులను చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక వరంగల్‌లోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో భక్తుల కోలాహలం నెలకొన్నది. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు చేసారు.కొత్త ఏడాది సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు కలియుగదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, జమ్మూకశ్మీర్ లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు సోమవారం ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ప్రముఖులకు తితిదే అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు కల్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మరోవైపు నూతన సంవత్సరం నాడు తిరుమలకు భక్తులు పోటెత్తారు. వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. దీంతో తిరుమల మాడవీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వెంకటేశ్వర నామస్మరణతో మార్మోగుతున్నాయి.