అధికార యావ తప్ప సంక్షేమం ఏదీ
తిరుమలలో అన్యమత ప్రచారంపై ఆగ్రహం
డియా సమావేశంలో సోము వీర్రాజు
తిరుపతి,సెప్టెంబర్7: రాష్ట్రంలో పాలన గాడితప్పిందని, జగన్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. దారుణంగా పాలన నడుస్తోందని అన్నారు. ప్రజల సమస్యలపై శ్రద్ద లేకుండా పోయిందన్నారు. బుధవారం తిరుపతిలో డియాతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అన్నదాతల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, రైతన్నల ఆత్మహత్యలకు పురిగొల్పుతోందని ఆరోపించారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అధికారయావ తప్ప మరో ధ్యాస లేదన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. అధికారులు కూడా ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించడం దారుణమన్నారు.
అధికారులంతా.. వాలంటీర్లులా వ్యవహరిస్తున్నారని, జగన్ ప్రభుత్వం స్టిక్కర్ ప్రభుత్వమని అన్నారు. కేంద్ర నిధులతోనే ఏపీ ప్రభుత్వం కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని.. ఇసుక, లిక్కర్, భూ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, రహదార్లు దెబ్బతిన్నా… వేయలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న జగన్ సర్కార్ తీరును ఎండగట్టేందుకు బీజేపీ సమాయత్తమయ్యిందని స్పష్టం చేశారు. ఇప్పటికే యాబై సభలను నిర్వహించామని, మరిన్ని సమావేశాలను నిర్వహించి.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఇదిలావుంటే సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవిత్రమైన తిరుమలలో కొందరు మంత్రులు అన్యమత ప్రార్ధనలు చేస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామిని సోము వీర్రాజు దర్శించుకున్నారు. అనంతరం డియాతో మాట్లాడిన సోము వీర్రాజు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల వెంకటేశ్వరస్వామి సన్నిధిలో కొందరు మంత్రులు అన్యమత ప్రార్ధనలు చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలంటూ సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో రియల్ టైమ్ అభివృద్ధి జరగాలని తాను వెంకటేశ్వరస్వామిని కోరుకున్నట్లు చెప్పారు. అతి పెద్ద తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్.. అభివృద్దికి అనువైన రాష్ట్రమంటూ సోము తెలిపారు. అయితే ఏపీ రాష్ట్రం సరైన దిశలో నడవాల్సిన అవసరం ఉందంటూ అభిప్రాయపడ్డారు.