గుత్తాధిపత్యం బలోపేతం లక్ష్యంగానే బడ్జెట్‌

6 గురు వ్యక్తుల నియంత్రణలో ‘కమలం’ చక్రవ్యూహం
నాడు పద్యవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా..నేడు కమలం చక్రవ్యూహంలో భారత్‌ విలవిల
కులగణన చేపట్టి దాన్ని విచ్ఛిన్నం చేస్తాం
కేంద్ర బడ్జెట్‌పై రాహుల్‌ గాంధీ మండిపాటు

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూలై 29 : బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యువత, రైతులు, మహిళలు, చిన్న వ్యాపారుల చుట్టూ చక్రవ్యూహాన్ని ఏర్పాటు చేస్తుందని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. బడ్జెట్‌పై చర్చలో భాగంగా సోమవారం ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ లోక్‌ సభలో మాట్లాడుతూ…‘కమలం’ (బిజెపి ఎన్నికల గుర్తు) ఏర్పాటులో ఆరుగురు వ్యక్తులు…నరేంద్ర మోదీ, అమిత్‌ షా, మోహన్‌ భగవత్‌, అజిత్‌ దోవల్‌, ముఖేష్‌ అంబానీ మరియు గౌతమ్‌ అదానీ ఉన్నారన్నారు. వేల సంవత్సరాల క్రితం కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడిని ఆరుగురు వ్యక్తులు ‘చక్రవ్యూహం’లో బంధించి చంపారని, అయితే తాను కొంత పరిశోధన చేయగా ‘చక్రవ్యూహాన్ని’ ‘పద్మవుయ్‌’ అని కూడా అంటారని తెలిసిందని, పద్మవ్యూహం అంటే కమలం ఏర్పడటమేనని, అదే కమలం గుర్తును ప్రధాని మోదీ తన ఛాతీపై ధరిస్తారని రాహుల్‌ అన్నారు.

ఆనాడు ఏవ విధంగానైతే అభిమన్యుని విషయంలో 6 గురు వ్యక్తులు కలిసి చక్రవ్యూహం పన్నారో నేడు 21వ శతాబ్దంలో చవ్య్రూహం రూపంలో కమలం పార్టీ దేశంలో అధికారంలో ఉందని, ఇప్పుడు ఆ పార్టీ 6గురు వ్యక్తులు నరేంద్ర మోదీ, అమిత్‌ షా, మోహన్‌ భగవత్‌, అజిత్‌ దోవల్‌, ముఖేష్‌ అంబానీ మరియు గౌతమ్‌ అదానీ నియంత్రణలో ఉందని, దాంతో దేశంలో యువత, రైతులు, మహిళలు, చిన్న, మధ్యతరహా వ్యాపారాలు వారి చక్రహ్యూహంలో చిక్కుకుని విలవిలలాడుతున్నారని రాహుల్‌ వ్యాఖానించారు. ఈ వ్యాఖ్యలపై అధికార పక్ష సభ్యులు అభ్యంతరం చెప్పగా స్పీకర్‌ ఓం బిర్లా వాస్తవాలు మాట్లాడాలని రాహుల్‌కు సూచించారు. దానిపై రాహుల్‌ మాట్లాడుతూ..అభ్యంతరం ఉంటే తాను అజిత్‌ దోవల్‌, అదానీ, అంబానీల పేర్లను వొదిలేసి కేవలం మిగితా 3 పేర్లను తీసుకుంటానని అన్నారు. ఇక బడ్జెట్‌పై రాహుల్‌ మాట్లాడుతూ..గుత్తాధిపత్య చట్రాన్ని బలోపేతం చేయడమే బడ్జెట్‌ యొక్క ఏకైక లక్ష్యంగా ఉందని అన్నారు. ఈ బడ్జెట్‌ యొక్క ఏకైక లక్ష్యం వారి గుత్తాధిపత్య ఫ్రేమ్‌వర్క్‌ను బలోపేతం చేయడమేనని అన్నారు. దేశంలో వ్యాపార, రాజకీయ గుత్తాధిపత్యం ప్రజాస్వామ్య నిర్మాణాన్ని, రాజ్యాన్ని, రాజ్యాంగ సంస్థలను నాశనం చేస్తుందని అన్నారు. వారి ఫ్రేమ్‌వర్క్‌ను బలోపేతం చేయడమే ఉద్దేశ్యంగా రాజకీయ గుత్తాధిపత్యంతో అమలు చేసిన డీమోనిటైజేషన్‌, జీఎస్టీ, పన్ను తీవ్రవాదంతో దేశ యువతకు ఉపాధి కల్పించే చిన్న, మధ్య తరహా వ్యాపారాలపై దాడి చేసి, వాటిని విచ్ఛిన్నం చేశారని రాహుల్‌ మండిపడ్డారు. కమలం చక్రవ్యూహంతో దేశంలో భయానక వాతావరణం నెలకొందని, దేశంలో భయం వ్యాపిస్తున్నదని, బిజెపి ఎంపిలతో సహా, విద్యార్థులు, కార్మికులు, ప్రతి ఒక్కరు వారి చక్రవ్యూంలో చిక్కుకుంటున్నారని రాహుల్‌ అన్నారు. అగ్నివీర్‌లను కేంద్రం మోసం చేస్తుందని, వారి పెన్షన్‌ కోసం బడ్జెట్‌ ఒక్క రూపాయి కూడా కేటాయించ లేదని రాహుల్‌ విమర్శించారు. పంటలకు కనీస మద్దతు ధర కోసం రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు వారికి ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ లభింలేదన్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం నిర్మించిన చక్రవ్యూహాన్ని తాము గులగణన చేపట్టి దాన్ని విచ్ఛిన్నం చేస్తామని ఉద్ఘాటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page