సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12: గృహలక్ష్మికి దరఖాస్తు చేసుకుంటే ఉన్న గూడు కూడా పోతుందని కాంగ్రెస్ పార్టీ సిద్ధిపేట పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన సిద్దిపేటలో మాట్లాడుతూ.. ఇల్లు లేని వారికి గృహలక్ష్మి పథకం అందజేస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్తుందని అంతేతప్ప దాంట్లో ఏమీ లేదని అన్నారు. గృహలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకుంటే 3 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం అవుతుందా? అని ప్రశ్నించారు. ఇల్లు పీకి పందిరి వేసిన చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఇచ్చే 3 లక్షల రూపాయలు కూడా ఒకేసారి ఇవ్వడం లేదని దశలవారీగా ఇస్తూ ప్రజలను నానా ఇబ్బందులు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉందని అన్నారు. కేవలం ఎన్నికల స్టంట్ కోసమే గృహలక్ష్మి పథకానికి సీఎం కేసీఆర్ తెర లేపారని అన్నారు. గృహలక్ష్మికి ఇచ్చే నిధులు పెంచాలని 3 లక్షల నుంచి ఆరు లక్షలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గృహలక్ష్మికి తోనైనా తమ ఇల్లు వస్తుందని ఆశపడే ప్రజలకు ఇబ్బందులు పడడం ఖాయమన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రభుత్వమే ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మాణానికి ఆరు లక్షలు అందించేందుకు కృషి చేస్తుందన్నారు. అంతేగాక ఎన్నో మంచి పథకాలకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి గ్యదరి మధు, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గ్యాసౌద్దిన్, ఎన్ ఎస్ యు ఐ వర్కింగ్ ప్రెసిడెంట్ రశాద్, పట్టణ మైనార్టీ అధ్యక్షులు సలీం, నవాజ్ తదితరులు పాల్గొన్నారు.