గ్రామ సమైక్య సంఘాలకు కోటి ఆర్థిక సాయం

స్వయం సహాయక సంఘాల ద్వారా  కోటీశ్వరులను చేయాలన్నదే లక్ష్యం
సిఎం ఆదేశాల మేరకు సమర్థంగా కార్యాచరణ ప్రణాళిక అమలు
సీజనల్‌ వాధుల పట్ల అప్రమత్తం.. ధరణి దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
20 లోగా బదిలీల పక్రియను సమర్ధవంతంగా పూర్తికి కృషి
ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలకు 20 ఎకారాల భూ సేకరణ
వన మహోత్సవం సహా పలు అంశాలపై జిల్లా కలెక్టర్లతో సిఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 9 : రానున్న ఐదేళ్ళలో రాష్ట్రంలోని 25 వేల గ్రామ సమైక్య  సంఘాలకు కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయడం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులను చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రూపొందిం చిన కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. వనమహోత్సవం, మహిళాశక్తి, ప్రజాపాలన సహాయ కేంద్రాలు, అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు, వ్యవసాయ సంబంధిత అంశాలు, ధరణి, ఉద్యోగుల బదిలీలు, గృహనిర్మాణం తదితర అంశాలపై మంగళవారం జిల్లా కలెక్టర్లతో సిఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈసందర్భంగా సిఎస్‌ మాట్లాడుతూ..

.రాష్ట్రంలో ప్రస్తుత సీజన్‌లో  20.02 కోట్ల మొక్కలు నాటెందుకు లక్ష్యంగా నిర్ణయించామని, దీనిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే వరంగల్‌లో వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. రాష్ట్రంలో సరిపడ మొక్కలు అందుబాటులో ఉన్నాయని, ఇటీవలి కాలంలో విస్తారంగా వర్షాలు   కురుస్తున్నందున జిల్లాల వారీగా కేటాయించిన లక్ష్యాల మేరకు నాణ్యమైన మొక్కలను నాటేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సిఎస్‌ స్పష్టం చేశారు. నాటిన ప్రతీ మొక్క ను జియోటాగింగ్‌ చేయడంతో పాటు వాటి మనుగడకు చర్యలు చేపట్టాలని అన్నారు. గ్రామాల్లో 100 శాతం ఖాళీ స్థలాలు కవర్‌ అయ్యే విధంగా మొక్కలు నాటేందుకు జిల్లాలోని సీనియర్‌ అధికారులు దత్తత తీసుకోవాలని సూచించారు. ప్లాంటేషన్‌ సైట్లను జిల్లా అధికారులు, క్షేత్ర స్థాయి అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలన్నారు.

ఇక రాష్ట్రంలో రానున్న ఐదేళ్ళలో రాష్ట్రంలోని 25 వేల గ్రామ సమైఖ్య సంఘాలకు కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయడం ద్వారా రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళలను కోటీశ్వరులను చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. స్వయం సహాయక బృందాలలో ఇప్పటికీ చేరని మహిళలందందరినీ చేర్పించాలని, రానున్న ఐదేళ్ళలో స్వయం సహాయక మహిళలను కోటీశ్వరులు చేయాలన్న లక్ష్య సాధనకు త్వరలోనే ఒక విధాన నిర్ణయం పత్రాన్ని విడుదల చేయనున్నట్టు సిఎస్‌ తెలిపారు. మహిళా సంఘాల ద్వారా పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్‌ల తయారీ పనులను సకాలంలో పూర్తి చేసి ప్రశంసలు అందుకున్నారని అభినందించారు. రెండో సెట్‌ యూనిఫామ్‌ ల పనులను కూడా త్వరలోనే పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అన్ని జిల్లాల్లో ఇందిరా క్యాంటీన్‌ల ఏర్పాటును త్వరితగతిన ప్రారంభమయ్యేలా చొరవ చూపించాలి. ఇంకా అసంపూర్తిగా గా ఉన్న అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను రెండు వారాల్లో పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

గత సంవత్సరం, ఈ నాటికి, 44 లక్షల ఎకరాల్లో నాట్లు పడగా ప్రస్తుత వానా కాలం సీజన్‌లో ఇప్పటికే 50 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారని అన్నారు. అన్ని మండలాల్లో సరిపడా యూరియా, ఇతర ఎరువులు అందుబాటులో ఉన్నాయని, వాటి పంపిణీని జిల్లా కలెక్టర్లు ప్రతీ రోజూ పర్యవేక్షించాలని సిఎస్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 9 ఉమ్మడి జిల్లాల్లో రైతు భరోసా సదస్సులను నిర్వహిస్తున్నామని, ఈ సదస్సులకు ఆయా జిల్లాలోని రైతులు, రైతు ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో అతిసార, డెంగ్యూ, మలేరియా, చికన్‌ గున్యా లాంటి వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు సురక్షిత మార్గాలపై ప్రజలను చైతన్య పర్చడంతోపాటు, ఫాగింగ్‌, యాంటీ లార్వా ఆపరేషన్‌, ఇంటింటి ఆరోగ్య సర్వే నిర్వహించాలని పేర్కొన్నారు. ఇప్పటికీ, ఈ వ్యాధుల ఆనవాలు కన్పించిన జిల్లాల్లో మరింత అప్రమత్తతో ఉండాలన్నారు. అన్ని జిల్లా కేంద్రాలలో 24 / 7 పనిచేసే హెల్ప్‌ లైన్లను ఏర్పాటు చేయడంతో పాటు రాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో భూ సంబంధిత వివాదాలకు సంబంధించి అందిన ధరణి ఫిర్యాదుల పరిష్కారానికి మరింత శ్రద్ధ చూపించాలని జిల్లా కలెక్టర్లను సిఎస్‌ శాంతి కుమారి ఆదేశించారు.

ఇప్పటికే, గత రెండున్నర యేళ్లుగా 57 వేల దరఖాస్తులకు పైగా జిల్లాల్లో పరిష్కారించారని, పెండిరగ్‌ లో ఉన్న దరఖాస్తులన్నింటినీ పరిష్కరించడానికి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు. ధరణి దరఖాస్తుల పరిష్కారంలో గణనీయమైన పురోగతి ఉందని ప్రశంసించారు. మిగిలినవి రాబోయే 10 రోజుల్లో పరిష్కరించాలన్నారు. ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా మరింత సమర్ధవంతమైన సేవలను ప్రజలకు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఉద్యోగుల బదిలీల పక్రియను ఈనెల 20వ తేదీ లోగా ఎట్టిపరిస్థితిలోనూ పూర్తి చేయాలని సిఎస్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇప్పటికే, శాఖల వారీగా ఖాలీల వివరాలను ప్రకటించడం జరిగిందని, సంబంధిత ఫారాలను పొందిన అనంతరం ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం బదిలీల పక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని తెలియచేసారు. రాష్ట్రంలో దాదాపు 49 ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినందున, ఒక్కో పాఠశాల ఏర్పాటుకు కనీసం 20 ఎకరాల ప్రభుత్వ భూమిని వెంటనే సేకరించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సమీక్షిస్తూ, కేంద్ర గ్రాంటును వెంటనే పొందేందుకు గాను ఇప్పటికే పూర్తయి, ఇళ్లను పొందిన లబ్ధిదారుల వివరాలను అప్లోడ్‌ చేయాలన్నారు. వీడియో కాన్షరెన్స్‌తో సిఎస్‌తో పాటు  రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి అహ్మద్‌ నదీమ్‌, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, పీసీసీఎఫ్‌ ఆర్‌.ఎం.డోబ్రియాల్‌, జీఏడీ కార్యదర్శి రఘునందన్‌ రావు, పంచాయత్‌ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి డిఎస్‌ లోకేష్‌ కుమార్‌, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌ చొంగ్తు, గృహనిర్మాణ శాఖ కార్యదర్శి బుద్ధ ప్రకాష్‌, సెర్ప్‌ సిఈఓ దివ్య, మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌ గౌతమ్‌, లా సెక్రటరీ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page