- పార్టీల విధివిధానలపై ప్రజల్లోకి పోదాం
- 2014 కాంగ్రెస్ మ్యానిఫెస్టెలోనే రైతు బంధు…కేసీఆర్ కాపీ కొట్టారు
- రాజకీయంగా నష్టపోయినా తెలంగాణ ఇచ్చాం
- ఒక వ్యక్తి పాదాల కింద తెలంగాణ సమాజం నలిగిపోతుంది
- మేడిగడ్డ పిల్లర్లు కుంగాయని అధికారురులే ఒప్పుకున్నారు
- కెసిఆర్ వాదనల్లో లాజిక్ లేదు
- సంక్షేమాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ
- నేను కందిపప్పు…కేటీఆర్ గన్నేరు పప్పు
- మీట్ ది ప్రెస్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 03 : తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో చుక్క మందు, డబ్బు లేకుండా వెళదామని బీఆర్‌ఎస్ పార్టీతో సహా ఇతర పార్టీలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయా పార్టీల విధివిధానాలపై ఈ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళదామని అన్నారు. రైతులకు ఎకరానికి ఏటా 10 వేలు ఇస్తామని 2014లోనే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన దాన్నే కాపీ కొట్టి కేసీఆర్ రైతు బంధు పేరుతో ఇస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఓడిపోవడంతో ఆ విషయాన్ని చెప్పుకోలేక పోయామని, అధికారంలోకి వొస్తే అమలు చేసే ఉండేవారిమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన మీట్ ద ప్రెస్‌లో రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ సర్కార్ పాలనా వైఫల్యాలు, కాంగ్రెస్ అభివృద్ధి ప్రణాళికలు సహా వివిధ అంశాలపై సమగ్రంగా అభిప్రాయాలు పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రం మామూలుగా ఏర్పడలేదన్నారు. చరిత్ర గురించి మాట్లాడాలంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటామని..అలాగే తెలంగాణ గురించి మాట్లాడాలంటే జూన్ 2, 2014 ముందు, వెనుక అంటామని చెప్పుకొచ్చారు.
అసలు ఎందుకు తెలంగాణ ఉద్యమం వొచ్చిందని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాటం చేశామని..సీమాంధ్రుల చేతుల్లో తెలంగాణ ప్రాంతం నలిగిపోతుందని పోరాటం చేశామని తెలిపారు. రాష్ట్రం కోసం వందలాది మంది ప్రాణాలు బలితీసుకున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారని అన్నారు. తెలంగాణ కోసం అణుబాంబు లాంటి నిర్ణయం తీసుకున్నారన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకున్నది స్వేచ్ఛ..సామాజిక న్యాయం..సమాన అభివృద్ధి కోరుకున్నారని తెలిపారు. ఒక వ్యక్తి పాదాల కింద తెలంగాణ సమాజం నలిగిపోవడం సహించలేమన్నారు. మట్టికి పోయినా ఇంటి వాడు పోవాలని కేసీఆర్ చెప్తారన్నారు. ఆయన చెప్పిన నీళ్లు వొచ్చాయా..? పల్లెలకు నిధులు వొచ్చాయా..? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆంధ్రాలో పార్టీ సర్వం కోల్పోయినా న్యాయం, ధర్మం వైపు నిలబడాలని సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
లెక్కలు వేసుకుని, స్వార్ధం చూసుకుంటే వంద మంది కేసీఆర్ లు వొచ్చినా తెలంగాణ ఏర్పడేది కాదని, శ్రీకాంతాచారి లాంటి అమరుల త్యాగాలను గుర్తించి సోనియా తెలంగాణ ఇచ్చారన్నారు. దశాబ్దం గడిచినా నీళ్లు, నిధులు నియామకాలు సాధించుకున్నమా అన్నది ఒకసారి ఆలోచన చేయాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఎప్పుడూ మట్టికి పోయిన ఇంటోడు పోవాలనే మాట అంటాడని, ఆయన చెప్పినవి ఏవి వొచ్చాయని అన్నారు. రాచరిక పోకడలు కనిపించేలా సర్కార్ ముద్ర ఉందని, త్యాగాలు గుర్తిచేసేలా ఉండాలి కానీ అలా లేదని, ఉద్యమంలో టీజీ అని రాసుకుంటే కేసీఆర్ వొచ్చాక టీఆర్‌ఎస్ కనిపించేలా టీఎస్ రాసిండని, తెలంగాణ తల్లి కూడా భుజకీర్తులతో కనిపిస్తుందన్నారు. కేసీఆర్ వొచ్చాక రాష్ట్రంలో పాలన తీరు మారిందని..ప్రజా సంఘాలకు, అఖిల పక్ష నేతలకు ప్రాధాన్యత లేదని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అసెంబ్లీ హాల్‌లో కూడా ప్రతిపక్ష నేతల సీట్లు మార్చిన్రని, మీడియాపై ఆంక్షలు పెట్టారని, సచివాలయంలో కూడా ప్రవేశానికి నో ఎంట్రీ అంటున్నారని విమర్శించారు.
అపోజిషన్ లీడర్లకు అనుమతి ఉండదా అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి కనిపించలేదన్నారు. గతంలో సీఎంను ఎవరైనా నేరుగా కలిసే అవకాశం ఉండేదన్నారు. కేసీఆర్ పాలన నియంత కంటే ఎక్కువగా ఉందని, కేసీఆర్ నియంత కాదు క్రిమినల్ పొలిటిషన్ అని, కోట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ఇచ్చిన చాలా మాటలు అమలు కాలేదని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ దేశానికే ఆదర్శం అని, ఇప్పుడేమో కర్ణాకటలో కాంగ్రెస్ ఇది చేస్తలేదు అది చేస్తలేదని అంటున్నారని మండిపడ్డారు. కర్ణాకటలో కాంగ్రెస్ గెలవడం ద్రోహం, నేరం అంటున్నారని..మరి బీజేపీ గెలవాలా అని ప్రశ్నించారు. అంటే బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే అని..మోదీ కేడీ ఒక్కటే అంటూ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి మూలం కాంగ్రెస్ విధానాలేనని రేవంత్ అన్నారు. మూసీ ప్రక్షాళన, అంతర్జాతీయ ప్రమాణాలతో రోడ్లు, రాచకొండ గుట్ట పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే ప్రణాళికలు తమ వద్ద ్ననాయని తెలిపారు.
2050 నాటి కల్లా తెలంగాణ సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్‌కు మాస్టర్ ప్లాన్ ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఐటీకి పునాది వేసింది కాంగ్రెస్ పార్టీయేనని, హైదరాబాద్‌ను పెట్టుబడి నగరంగా తీర్చిదిద్దుతామనన్నారు. హైటెక్ సిటీని కాంగ్రెస్ హయాంలో నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి ప్రారంభించరన్నారు. గంగా నదిలా మూసీని ప్రక్షాళన చేస్తామని, మూసీ రివర్ ఫ్రంట్‌ను అద్భుతంగా అభివృద్ధి చేసే ప్రణాళిక తమ దగ్గర ఉందన్నారు. అర్బన్, సెమీ అర్బన్, రూరల్ హైదరాబాద్‌కు కనెక్టివిటీ ఇవ్వనున్నామన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచానికే తలమానికంగా మారుస్తామన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గురించి తాము ఏమి చెప్పనవసరం లేదని.. ఆయన తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. చివరికి జర్నలిస్టులను కూడా ఆగం చేశారంటూ విరుచుకుపడ్డారు. కేసీఆర్ పెట్టిన తెలంగాణ తల్లి శ్రీమంతుల తల్లిని చూపించారంటూ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ తల్లి ముఖంలో దర్పం..ప్రేమ..త్యాగం ఉండాలన్నారు. కేసీఆర్ ఉద్యమంలో టీజీ అని అనుకున్నామన్నారు. కానీ తెలంగాణ వొచ్చాకా టీఆర్‌ఎస్ స్పురించేలా టీఎస్ పెట్టుకున్నాడని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంత నిర్బంధం లేదన్నారు. సెక్రటేరియట్‌కి..ప్రతిపక్ష సభ్యులకు.. మీడియాకు అనుమతి లేదన్నారు. కేసీఆర్.. నియంత ముసుగులో ఉన్న క్రిమినల్ పొలిటీషియన్ అన్నారు. క్రిమినల్‌ని ఎదుర్కునవచ్చు..నియంతను ఎదుర్కునవచ్చు..కానీ..నియంత ముసుగులో ఉన్న క్రిమినల్‌ని ఎదుర్కునడం కోసం కొత్త దారులు వేతకాల్సి వొస్తుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మేడిగడ్డ స్తంభం మూడు అడుగుల మేర కుంగిపోయిందన్నారు రేవంత్ రెడ్డి. పిల్లర్ దిగువన ఇసుక ఉందన్న విషయం నీటిపారుదల శాఖ ఇంజినీర్లకు తెలియదా అని ప్రశ్నించారు. పిల్లర్లు కుంగాయి కాబట్టే మేడిగడ్డ బ్యారేజీ జాయింట్‌లో గ్యాప్ పెరిగిందని, ఒక మీటరు కుంగిందని అధికారులే చెబుతున్నారని, తప్పించుకోవడానికే కేటీఆర్ ఏవేవో మాట్లాడుతున్నారని విమర్శించారు. తాము తప్పు చెబుతున్నామంటే..అఖిలపక్షాన్ని తీసుకెళదామని, ప్రాజెక్టు కుంగిందో లేదో వాళ్లే చెబుతారని అన్నారు.
బీఆరెస్ నేతలవి లాజిక్ లేని వాదనలని, కేసీఆర్ పాపాల వల్లే మేడిగడ్డ బ్యారేజీ కూలిపోయిందని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. వోటుకు నోటు పెంచింది కేసీఆర్ అని రేవంత్ రెడ్డి విమర్శించారు. సంక్షేమాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పెన్షన్లు, పక్కా ఇళ్లు, ఆరోగ్య శ్రీ లాంటి పథకాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని గుర్తు చేశారు. కేసీఆర్ తాను చేసింది చెప్పుకోలేక కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తున్నారని, కేసీఆర్ వాదనల్లో డొల్లతనం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. కాంగ్రెస్ మైనారిటీలను ఎప్పుడూ కేవలం వోటు బ్యాంకుగా చూడలేదన్నారు. మైనారిటీలను అన్ని రకాలుగా సంక్షేమంలో భాగస్వాములను చేస్తామని, జర్నలిస్టుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. పేదలకు విద్యను చేరువ చేసింది కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన స్కూళ్లలో 6,540 సింగిల్ టీచర్ స్కూళ్లను కేసీఆర్ హయాంలో మూసేశారని విమర్శించారు. తన లోపాలను కప్పిపుచ్చుకునేందుకే పక్క రాష్ట్రాల అంశాన్ని తెరపైకి తెస్తున్నారని రేవంత్ ఆరోపించారు.
కాంగ్రెస్ దశాబ్ద పాలన-బీఆరెస్ దశాబ్ద పాలనపై తాము చర్చకు సిద్ధమని, తమ పార్టీ నుంచి తాను, సీఎల్పీ భట్టి వొస్తామని, మిగతా. పార్టీల నుంచి ఇద్దరు చొప్పున వావాలని, చర్చ పెడితే పాలకు పాలు, నీళ్లకు నీళ్లు బయట పడతాయని వ్యాఖ్యానించారు. ధరణి పోర్టల్ పేరుతో ప్రభుత్వమే పెద్ద దలారీగా మారిందన్నారు. ధరణిలో అత్యంత పెద్ద దలారులు కేసీఆర్ కిటుంబ సభ్యులే అని ఆరోపించారు. ధరణి పేరుతో రికార్డులను జిల్లాలకు తరలించారన్నారు. ఈ రికార్డుల్లో ఏవైనా మార్పులు చేయాలంటే ఆధార్ వంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సి వొస్తుందని, ధరణి నిర్వహణ మల్టీనేషనల్ కంపెనీ చేతుల్లో ఉండటంతో మన సమాచారం విదేశీ చేతుల్లోకి వెళ్తుందన్నారు. ధరణి ఎట్టిపరిస్థితుల్లో రద్దు చేస్తామని దానికంటే మెరుగైన విధానం తీసుకొస్తామన్నారు. ధరణిని రద్దు చేస్తామంటే కేసీఆర్‌కు ఎందుకంత దుఃఖమని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
2018లో తెలంగాణ సెంటిమెంటును నిద్రలేపి కేసీఆర్ రాజకీయంగా లాభం పొందారని, 2018లో చంద్రబాబు రూపంలో కేసీఆర్‌కు అవకాశం దొరికిందన్నారు. కానీ పదేళ్లలో కేసీఆర్ గుడ్‌విల్ సున్నాకు చేరిందన్నారు. కాంగ్రెస్‌కు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. బీఆరెస్ కూటమి, కాంగ్రెస్ కూటమి మధ్యే ఈ ఎన్నికలని రేవంత్ వ్యాఖ్యానించారు. బీజేపీ, ఎంఐఎం బీఆరెస్ కూటమి ఒక వైపు, కాంగ్రెస్, కోదండరామ్, కలిసి వొస్తే కమ్యూనిస్టులు, ప్రజా సంఘాలు తమ వైపు ఉన్నాయన్నారు. వందశాతం ప్రజలు ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఓడించి తీరతారని కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ రెడ్డి అన్నారు. తాము పాజిటివ్ అప్రోచ్ తోనే ప్రజల ముందుకు వెళుతున్నామని చెప్పారు. తాము అధికారంలోకి వొస్తే ఏం చేస్తామో చెప్పి, పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలతోనే తాము విజయం సాధిస్తామని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.