అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రం•కులమత భేదాలు, వివక్ష లేకుండా జీవిస్తున్న ప్రజలు•పల్లెలు, పట్టణాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నాం•ఐటీ రంగంలో బెంగళూరును దాటేసిన హైదరాబాద్•ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ•కేంద్రం ఇచ్చింది శూన్యం – కాంగ్రెస్, బీజేపీలకు అభివృద్ధిపై విజన్ లేదు•పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ పైనే ప్రజలకు నమ్మకం•ప్రతీకార రాజకీయాలు చేస్తే రేవంత్ ఇప్పటికీ జైల్లోనే ఉండేవాడు•అభివృద్ధికి ఓటు వేయాలంటూ ‘మీట్ ది ప్రెస్’లో ప్రజలను కోరిన కెటిఆర్
హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28 : తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి పనులు చెప్పుకొని మూడోసారి ఎన్నికలకు వెళ్తున్నామని, ప్రజలు అభివృద్ధికి ఓటు వేయాలని బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కోరారు. భారత దేశానికి తెలంగాణ దిక్సూచి అయిందని అన్నారు. ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్(ఐజెయూ) అధ్యక్షుడు కె.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టియూడబ్ల్యూజె-ఐజే యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ సారధ్యంలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమానికి హాజరైన మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో సమగ్ర, సమతుల్య, సమ్మిళిత, సమీకృత అభివృద్ధి కొనసాగుతున్నదని వెల్లడించారు. ఇది తొమ్మిదిన్నరేండ్లలో సీఎం కేసీఆర్ పాలన సాధించిన ఘనత అని నేడు తెలంగాణ ఆచరిస్తున్నది, దేశం అనుసరిస్తున్నదని చెప్పారు. 2014 లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.లక్షా 14 వేలుగా ఉందని, ప్రస్తుతం అది రూ.3లక్షల 17 వేలకు పెరిగిందన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు ఎలాంటి వివక్ష, కులమత భేదాలు లేకుండా జీవిస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలన సంక్షేమానికి స్వర్ణయుగమన్నారు. అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందని చెప్పారు. అభివృద్ధికి పెద్దపీట వేశారని తెలిపారు. రాష్ట్రాన్ని అప్పులపాటు చేశారన్న ఆరోపణలు సరికాదన్నారు. అప్పులు చేసిన నిధులు సంపద సృష్టికి ఉపయోగిస్తున్నామని చెప్పారు. రుణాలు మొత్తం సాగునీటి రంగం, మిషన్ భగీరథకు వినియోగించామన్నారు. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందిస్తున్నామని వెల్లడించారు. విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం రుణాలు తెచ్చారని చెప్పారు. తద్వారా స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచామన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో సమతుల్యం సాధించామని తెలిపారు. అటు పల్లెలు, ఇటు పట్టణాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి జాతీయ అవార్డుల్లో తెలంగాణకే సింహభాగం దక్కాయని చెప్పారు. 7.7 శాతం గ్రీన్ కవర్ పెంచడం దేశంలోనే అద్భుతమన్ని వెల్లడించారు. ఐటీ రంగంలో బెంగళూరును హైదరాబాద్ దాటేసిందని చెప్పారు. ఐటీ ఎగుమతులు 400 శాతం పెరిగాయని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. దేశానికి అన్నపూర్ణగా ఎదిగిందని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది శూన్యమని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలకు అభివృద్ధిపై విజన్ లేదని విమర్శించారు. అధికారం కోసం అర్రాజ్ పాటలా హామీలు గుప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలవారికి పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ పైనే ప్రజలకు నమ్మకమున్నదని స్పష్టం చేశారు. మోదీ ఇస్తానన్న ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పేదల ఖాతాలో వేస్తానన్న రూ.15 లక్షలు ఎక్కడపోయాయని నిలదీశారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్నారని, దేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చేస్తానన్నారని, దేశంలోని పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామన్నారని అవన్నీ అయ్యాయా అని ప్రశ్నించారు. ప్రతీకార రాజకీయాలు చేస్తే రేవంత్ ఇప్పటికీ జైల్లోనే ఉండేవాడని చెప్పారు. ముస్లిం మైనార్టీలకు దేశంలోని ఏ రాష్ట్రంలో లేనంత బడ్జెట్ తెలంగాణలోనే ఉందని వెల్లడించారు. అనంతరం మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు.