జనసేన ఎంట్రీని తెలంగాణ ప్రజలు ఆహ్వానిస్తారా..

తెలంగాణ రాష్ట్ర వేర్పాటు ప్రకటన వెలువడిన తర్వాత తనకు వారం రోజుల పాటు భోజనం సహించలేదని, అన్నం తినడమే మానివేశానని ఆయన పేర్కొనడాన్ని తెలంగాణ ప్రజలు నేటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడమన్నది ఆయనకు ఏమాత్రం ఇష్టంలేదన్న విషయాన్ని ఆ మాటలు స్పష్టంచేస్తున్నాయి. తాజాగా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు ఇదే విషయాన్ని ఇటీవల గుర్తుచేశారుకూడా. నిజంగానే వారం రోజులపాటు భోజనం సహించని జనసేనానికి ఇక్కడేమి పని అని ఇప్పుడు తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

-మండువ రవీందర్‌రావు 
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీచేసేందుకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఇంకా ఎన్ని స్థానాల్లో పోటీచేయాలన్న విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. అనేక తర్జనభర్జనల అనంతరం  పదకొండు సీట్లకు ఖాయమైందంటున్నారు. కాని, తొమ్మిది సీట్లకే పవన్‌ను పరిమితం చేయాలని బిజెపి వర్గాలు పట్టుపడుతున్నట్లు తెలుస్తున్నది. చర్చంతా కూకట్‌పల్లి, శేర్‌లింగంపల్లి పైనే జరుగుతున్నది. ఆ విషయంలోకూడా ఇరుపార్టీలు ఒక అవగాహనకు వొచ్చినట్లు తెలుస్తున్నది. కూకట్‌పల్లి స్థానాన్ని జనసేనకు, శేర్‌లింగంపల్లిలో బీజేపీ పోటీచేసే విథంగా ఒప్పందం అయిందంటున్నారు. అయితే ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సిఉంది. ఇదిలా ఉంటే  సినీ గ్లామర్‌తో  రెండు తెలుగు రాష్ట్రాల్లో అపారమైన అభిమానులను సంపాదించుకున్న జనసేనాని, తన పార్టీ ఏర్పాటు చేసిన నాటినుండి ఆమేరకు వోటర్లను సాధించుకోలేకపోయారనడానికి ఇంతవరకు ప్రజాక్షేత్రంలో పోరాడి గెలిచిందిలేదు. తెలంగాణలో ముఖ్యంగా మూడు పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా జరుగుతున్న నేపథ్యంలో మొదటిసారిగా ఇక్కడ  శాసనసభ బరిలో దిగేందుకు సిద్దమైన జనసేన పార్టీని తెలంగాణ ప్రజలు ఏమేరకు ఆదరిస్తారన్నదే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ప్రధాన చర్చ.
    జనసేన పార్టీ ఏర్పాటు అనంతరం ఆయన వివిధ సభలు, సమావేశాల్లో  తెలంగాణ గురించి చేసిన వ్యాఖ్యానాలను బహుషా ఆయన మరిచి పోయి ఉండవొచ్చు, కాని  తెలంగాణ ప్రజలు  మాత్రం ఏనాటికి  మరిచిపోరు, మరిచిపోలేరు కూడా .. తెలంగాణ రాష్ట్ర వేర్పాటు ప్రకటన వెలువడిన తర్వాత తనకు వారం రోజుల పాటు భోజనం సహించలేదని, అన్నం తినడమే మానివేశానని  ఆయన పేర్కొనడాన్ని  తెలంగాణ ప్రజలు నేటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడమన్నది ఆయనకు  ఏమాత్రం ఇష్టంలేదన్న విషయాన్ని ఆ మాటలు స్పష్టంచేస్తున్నాయి. తాజాగా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు ఇదే విషయాన్ని ఇటీవల గుర్తుచేశారుకూడా. నిజంగానే వారం రోజులపాటు భోజనం సహించని జనసేనానికి ఇక్కడేమి పని అని ఇప్పుడు తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలను భాష, యాస విషయంలో తీవ్రంగా వ్యతిరేకించడమేకాదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా అడ్డు తగిలిన వారంతా ఇవ్వాళ తామే అసలు సిసలు తెలంగాణ వాదులమన్నట్లుగా కొత్త అవతారాలెత్తుతున్నారు. తెలంగాణ ప్రజలంటే మాకు చాలా అభిమానమని ఒకరు. తెలంగాణ ప్రజలకు  అన్యాయం జరుగతుంటే చూడలేక వారి పక్షాన గొంతుకనవడానికి రాజకీయాల్లోకి వొచ్చామని మరొకరు ఇలా మళ్ళీ తెలంగాణపైన తమ ఆధి పత్యాన్ని దొడ్డిదారిలో చెలాయించేందుకు ఆంధ్రపార్టీలు సిద్దమవుతున్నాయి. హరీష్‌రావు ఇదే విషయాన్ని మరొసారి తెలంగాణ ప్రజలకు గుర్తు చేస్తున్నారు. ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక పవన్‌ కళ్యాణ్‌ విషయానికొస్తే   జనసేన పార్టీ కార్యక్రమాల్లో భాగంగా ఏపీలో పలు సభల్లో అనేకసార్లు తెలంగాణ ప్రస్తావన తీసుకొచ్చారు.  తెలంగాణవారు మనను గెంటి వేశారని, తన్ని తరిమేశారంటూ పలు సందర్భాల్లో ఆయన చేసిన ఆవేశపూరిత ప్రసంగాలు తెలంగాణ ప్రజల గమనంలో లేకపోలేదు. అంతవరకేనా ఒక పక్క తెలంగాణ అంటే  ప్రేమ, అక్కడి ప్రజలంటే తనకు గౌరవం అంటూనే, ఎన్టీఆర్‌ వొచ్చేవరకు తెలంగాణ ప్రజలకు వరి అన్నమే తెలియదనడాన్ని తెలంగాణ ప్రజలు ఎలా అర్థంచేసుకుంటారో వేరే చెప్పాల్సిన అవసరం లేదు.  తెలంగాణ ప్రాంతంపట్ల, ఇక్కడి ప్రజల గురించి ఆయనకు ఏ మేరకు అవగాహన ఉందన్నది ఈ మాటతోనే అర్థమవుతున్నది.  ఇక్కడి  ప్రజలకు  రాగులన్నం  తప్ప వరి పంట పండించడమే తెలియదని,  పండుగలకో, పబ్బానికో తప్ప వరి అన్నం వండుకునేవారు కాదని తెలంగాణ సమాజంపట్ల తనకున్న అపార జ్ఞానాన్ని ప్రదర్శించుకున్నాడు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కొందరు ఆంధ్ర నాయకుల భూ, ధన దాహమే కారణమని,  వారు తెలంగాణలో చేసిన అక్రమాల కారణంగా అక్కడి ప్రజలు తిరుగ బడ్డారని,  అందుకు మనం  తెలంగాణను వదులుకోవాల్సి వొచ్చిందంటూ  సీమాంధ్ర సభల్లో ఆయన తెగ  బాధ బాధపడ్డ విషయాన్ని తెలంగాణ ప్రజలు నిజంగానే మరిచిపోతారా?
జారవిడుచుకున్న తెలంగాణను ఏ విధంగానైనా హస్తగతం చేసుకోవాలన్నదే ఇప్పుడు సీమాంధ్రుల ఆలోచన. అందుకే వివిధ రీతుల్లో  పావులు కదుపుతున్నారు.  కొందరు సొంతంగా రాజకీయ పార్టీలు ఏర్పాటు చేస్తే, మరి కొందరు  రాజకీయల ముసుగులో  తెలంగాణపైన ఆధిపత్యంకోసం అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. అందుకు తెలంగాణ వేర్పాటుకు కారణమైన బిఆర్ఎస్‌ను మట్టుపెడితేనే తమకు మనుగడ ఉంటుందన్న భావన వారిలో కనిపిస్తున్నది. వైఎస్ఆర్‌టిపి, టిడిపి పార్టీలు అనూహ్యంగా పోటీ విషయంలో తమ నిర్ణయాన్ని మార్చుకోవడం వెనుక అదే వ్యూహం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు  భావిస్తున్నారు.  తాము విడివిడిగా పోరాటం చేయడంవల్ల బిఆర్ఎస్‌ వ్యతిరేక వోట్లు చీలుతాయన్న ఉద్దేశ్యంగానే పోటీనుండి ఈ పార్టీలు విరమించుకున్నాయి. బిఆర్ఎస్‌ను ఓడిస్తే తెలంగాణ సేఫ్‌గార్డ్‌ను తొలగించినట్లు అవుతుందన్నదే ఈ పార్టీల ఉద్దేశ్యంగా కనిపిస్తున్నది.
తెలంగాణలో బిఆర్ఎస్‌కు ప్రత్యమ్నాయం నిన్నటివరకు బిజెపి నిలిచింది. కాని, రాజకీయాల్లో త్వరితగతిన మారుతున్న పరిణామాలతో ఇప్పుడు కాంగ్రెస్‌ బిఆర్ఎస్‌కు ప్రత్యమ్నాయంగా మారింది. దీంతో వైఎస్ఆర్‌టిపి బహిరంగంగానూ, టిడిపి పరోక్షంగానూ కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నాయి.  మొదటినుండి టిడిపి, బిజెపితో స్నేహంగా ఉంటున్న పవన్‌ కళ్యాణ్‌కు తెలంగాణ ఎన్నికలు ఇక్కడ అరంగెట్రం చేసేందుకు అవకాశంగా మారాయి. అందుకే  బిజెపితో కలిసి పోటీకి సిద్దమైంది. ఈ ఎన్నికల్లో టిడిపి పోటీనుండి తప్పుకోవడంతో సెటిలర్స్‌ వోట్లను క్యాష్‌ చేసుకోవడానికి బిజెపి జనసేనను పావుగా వాడుకుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే తాను  32 స్థానాల్లో పోటీచేస్తున్నట్లు ప్రకటించిన పవన్‌ కళ్యాణ్‌ బిజెపి ఎన్ని సీట్లు ఇచ్చినా సరే అంటున్నాడు.  ఈ విషయంలో బిజెపి ట్రాప్‌లో పవన్‌ పడ్డాడంటున్నారు  రాజకీయ విశ్లేషకులు. అయితే పవన్‌ను తెలంగాణ వోటర్లు ఎంత వరకు విశ్వసిస్తారన్నది వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page