మీకు ఎప్పుడైనా ‘ఆధార్’ నెంబర్లను, పుట్టిన తేదీ ఇతర వివరాలను తెలుసుకుని ఇతరులు మిమ్మల్ని మోసం చేస్తున్నారనే ఆందోళన ఉందా? ‘ఆధార్’ కార్డును ఎవరైనా దుర్వినియోగం చేస్తున్నారనే భయం ఉందా..? అలాంటి అనుమానాలు, లేనిపోని భయాలు ఇక అక్కర్లేదు. ఎందుకంటే ‘ఆధార్’లో బయోమెట్రిక్ డేటాను విలీనం చేసిన రీతిలోనే ఇక మీదట డీఎన్ఏ డేటాను విలీనం చేస్తే ఎవరు ఎంత ప్రయత్నించినా మీ వ్యక్తిగత సమచారాన్ని ఛేదించలేరు.
డీఎన్ఏ అంటే ‘డీ ఆక్సీ రైబో కేంద్రక ఆమ్లం’. ఇది క్రోమోజోముల్లో, మైటోకాండ్రియాలో కనిపిస్తుంది. జీవులన్నింటిలో డీఏన్ఏ ముఖ్యమైన జన్యుపదార్థంగా ఉంటుంది. జీవుల్లో అనువంశికతకు డీఎన్ఏ మూలాధారం. డీఎన్ఏ విశ్లేషణలే మనం ‘జన్యు విశ్లేషణ’ అంటున్నాం. ప్రపంచంలో ఏ ఇద్దరికీ ఒక రకమైన జన్యు విశ్లేషషణ ఉండదు. ఇదే ఈ శాస్త్రానికి ఉన్న ఏకైక మూల సూత్రం. ఎలాంటి అక్రమాలకు తావు లేని సరికొత్త సాంకేతికత దిశగా భారత్ ప్రయాణించబోతోంది. ఈ విశ్లేషషణ నమూనాల వల్ల కేవలం వ్యక్తిగత గుర్తింపునకు మాత్రమే పరిమితం కాకుండా అనేక విషయాల్లో దానిని వినియోగించుకునేందుకు వీలుకలుగుతుంది.
మానవ డీఎన్ఏ ప్రొఫైలింగ్ బిల్లు-2016 స్థానంలో డీఎన్ఎ ఆధారిత సాంకేతిక (ఉపయోగం, నియంత్రణ) బిల్లు -2017 మసాయిదాను రూపొందించి గతంలో లోక్సభలో ప్రవేశపెట్టారు. గత కొద్ది సంవత్సరాలుగా వివిధ దశల్లో మూలుగుతున్న ఈ బిల్లు ఎంత త్వరగా అమలులోకి వస్తే అంత పెద్ద ఎత్తున ప్రయోజనాలు ఉండబోతున్నాయి. వాస్తవానికి ఈ బిల్లు ముసాయిదాను 2017 జూలైలో ‘లా కమిషన్’ తన 271వ నివేదికలో అందజేసింది. లోక్సభలో బిల్లును నెంబర్ 142 రూపంలో ప్రవేశపెట్టారు. అలాగే బిల్లును డీఎన్ఏ బిల్లు-2018గా స్వల్ప మార్పు చేశారు. అదృశ్యమైన వారు, గుర్తు తెలియని మృతదేహాల మధ్య సంబంధాన్ని బేరీజు వేసేందుకు, నేరాలను అదుపుచేసేందుకు, డీఎన్ఏ ల్యాబ్లు ఇష్టారాజ్యంగా నెలకొల్పకుండా క్రమబద్ధం చేసేందుకు డీఎన్ఏ బ్యాంకుల ఏర్పాటుకు, మొత్తంగా పర్యవేక్షణకు డీఎన్ఏ నియంత్రణ మండలి ఏర్పాటుకు ఈ బిల్లు దోహదం చేస్తుంది. డీఎన్ఏ అమరికకు సంబంధించి మన దేశంలో అనేక అధ్యయనాలు జరిగాయి. వీటిని మిళితం చేస్తూ సీఆర్పీసీకి సవరణలు తీసుకురావాలని మలిమిత్ కమిటీ సిఫార్సులు చేసింది. కేసుల దర్యాప్తులో ఆదేశాలు ఇవ్వడానికి క్రిమినల్ కోర్టులకు అధికారాలు ఇవ్వాలని కమిటీ సూచించింది. రాత, వేలిముద్రలు, రక్తం, వీర్యం , తలవెంట్రుకలు, ఇతర నమూనాలను వైద్యులు తీసుకునేందుకు వీలుగా ఖైదీల గుర్తింపు చట్టం సెక్షన్-4కు, ఉగ్రవాద నిరోధక చట్టం సెక్షన్-27కు సవరణలు తీసుకురావాలని సూచించింది.
అయితే డీఎన్ఏ వివరాల సేకరణ దుర్వినియోగం కాకుండా , వైయుక్తిక గోప్యతకు ఆటంకం లేకుండా రక్షణ చర్యలను చేపట్టాలని కూడా సూచించింది. డీఎన్ఏ పరీక్షల విషయంలో ఒక నియంత్రణ వ్యవస్థ ఉండాలనే అంశంపై ఎవరికీ విభేదాలు లేవు. రెండు దశాబ్దాలుగా దేశంలో డీఎన్ఏ పరీక్షలు, వాటి ఆధారంగానే కేసుల నిర్ధారణ కొనసాగుతున్నా దానికి చట్టబద్ధమైన ప్రాతిపదిక లేదు. దీనికి ఒక చట్టం ఉండాలని 2003లో అప్పటి ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం కొంత ప్రయత్నం చేసింది. ముసాయిదాను రూపొందించి నిపుణుల కమిటీని వేసింది. అయితే దానిపై పెద్దగా చర్చ జరగలేదు. జాతీయ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, డయాగ్నస్టిక్స్ సెంటర్ హైదరాబాద్లో ఉన్నందున 2015 ముసాయిదా ప్రకారం జాతీయ జన్యు సమాచార నిధిని హైదరాబాద్లోనే ఏర్పాటు చేయాల్సి ఉంది. మానవజాతి ఆవిర్భావం నుండి ఏదో ఒక రూపంలో నేరాలు జరుగుతునే ఉన్నాయి. శాస్త్ర సాంకేతిక విజ్ఞాన శాస్త్రాల ప్రగతితో నేర భావనతో పాటు నేరస్థులు అవలంబించే విధానాల్లో కూడా చెప్పుకోదగ్గ మార్పు వొచ్చింది. ఒకవైపు తెలివైన నేరస్థులు విజ్ఞాన శాస్త్రాన్ని తమకు అనుకూలంగా త్వరగా వినియోగించుకుంటున్నారు. మరో వైపు దర్యాప్తు సంస్థలు కూడా నేర పరిశోధనకు సంబంధించి తాతల నాటి విధానాలను వొదిలి నూతన సాంకేతికత వైపు దృష్టిసారిస్తున్నాయి. నేరశోధనకు సంబంధించి ఆటవిక, చిత్ర హింసాపూర్వకమైన విధానాలకు నేడు నాగరిక సమాజంలో స్థానం లేదు. గతంలో నిందితులను పోలీసు స్టేషన్లకు తీసుకువచ్చి వారిని చితక్కొట్టి వాస్తవాలను తెలుసుకునే వారు. నేడు ఎంతటి తీవ్రమైన నేరాలు చేసిన వారినైనా ఎలాంటి గాయాలు లేకుండానే వారి నుండి సమాచారం రాబడుతున్నారు. అన్నింటికీ నేడు న్యాయ వైద్య విజ్ఞాన శాస్త్రాన్ని ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. మనం అంతా ఫోరెన్సిక్ సైన్స్ అని చెప్పుకునే ఈ విజ్ఞాన శాస్త్రం నేడు మరింత విస్తృతం అయింది. నేర న్యాయపాలన కోసం ప్రకృతిసూత్రాలను, పద్ధతులను అన్వయించడం ద్వారా భౌతిక సాక్ష్యాధారాలను గుర్తించడం, వైయుక్తీకరించడం, మదింపు చేయడం వంటి అంశాలను నిర్దేశించిన ఈ శాస్త్రంలో మానవ శరీర మాపనం, వేలిముద్రలు, పాదముద్రలు, తుపాకీ గుళ్లు, దంత విజ్ఞానం వంటివి విలీనం అయి ఉంటాయి.
19వ శతాబ్దంలో దీనిని పారిస్లో మాథ్యూ ఓర్ ఫిలా అభివృద్ధి చేశారని చెప్పవొచ్చు, ఆ తర్వాత అల్పిన్సె బెర్టిల్లమ్, ఫ్రాన్సిస్ గాల్టం, హాన్స్ గ్రాస్, ఎడ్మండ్ లోకార్డ్, కార్ల లాండ్ స్టీవెర్, కాల్విన్ గోడ్డార్డ్, అల్బర్ట్ ఒప్బార్న్ వంటి నిపుణులు అభివృద్ధి చేసిన తర్వాత ఇపుడిపుడే ఈ శాస్త్రానికి ఒక స్వరూపం వస్తోంది. ఇందులో తాజాగా డీఎన్ఏ కూడా కీలక పాత్ర పోషించబోతోంది. మొత్తం మీద డీఎన్ఏ ఆధారిత సాంకేతిక బిల్లు ముసాయిదా సిద్ధమైంది. గతంలో దానిని లోక్సభలో ప్రవేశపెట్టినా ఇంతవరకూ అది ఆమోదం పొందలేదు. డీఎన్ఏ డేటా బ్యాంకు, చట్టబద్ధమైన డీఎన్ఏ ప్రొఫైలింగ్ బోర్డును ఏర్పాటు చేయాలి, డీఎన్ఏ ప్రయోగశాలలను ఏర్పాటుచేయడానికి అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయాలి. అవసరమైనపుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు, మంత్రిత్వశాఖలకు, మంత్రులకు సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. పోలీసులతో పాటు ఇతర దర్యాప్తు సంస్థల అధికారులకు శిక్షణ ఇవ్వాలి. అంతర్జాతీయ మార్గదర్శకాలకు అనుగుణంగా మానవ హక్కులకు సంబంధించిన సలహాలను ప్రభుత్వానికి ఇవ్వాలి. డీఎన్ఏ ప్రొఫైలింగ్ అనేది కేవలం వ్యక్తిని గుర్తించడానికి మాత్రమే పరిమితం చేసేలా చట్టబద్ధమైన నియంత్రణలను రూపొందించాలి. జాతీయ డీఎన్ఏ బ్యాంకుతో పాటు రాష్ట్ర స్థాయిలో డీఎన్ఏ బ్యాంకుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి. డీఎన్ఏ సేకరించాక నిల్వ చేసిన తర్వాత ఎంత కాలానికి దానిని ధ్వంసం చేయాలనేది కూడా నిర్ణయించాలి. విదేశీ సంస్థలు, ప్రభుత్వాలతో డీఎన్ఏ సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంలో పరస్పర ఆమోదయోగ్యమైన అంగీకారాన్ని ఏర్పరచుకోవాలి. డీఎన్ఏ సేకరణలో ఉల్లంఘనలకు పాల్పడేవారికి కఠినమైన శిక్షలు ఉండేలా చట్టసవరణలు చేయాలి.
రానున్న రోజుల్లో డీఎన్ఏ అనేది న్యాయవ్యవస్థలోనూ కీలక పాత్ర పోషిస్తుందనడం నిస్సందేహం. డీఎన్ఏ నియంత్రణ బోర్డుకు జీవసాంకేతిక శాఖ కార్యదర్శి చైర్మన్గా వ్యవహరిస్తారు. ఆ రంగంలో కనీసం 25 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తిని ఉపాధ్యక్షుడిగా నియమిస్తారు. ఎన్ఐఏ, సీబీఐ ప్రతినిధులు, హైదరాబాద్లోని డీఎన్ఏ కేంద్రం డైరెక్టర్, ఎన్సీబీటీసీఎల్ డైరెక్టర్, సీఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, న్యాయశాఖల నుండి ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉంటారు. మరో ఇద్దరు నిపుణులను కూడా ఈ కమిటీలో కేంద్రం సభ్యులుగా నియమించనుంది.
అయితే, ఈ బిల్లుతో సమస్యలు కూడా లేకపోలేదని నిపుణులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నేరస్థుల రికార్డుల్లో డీఎన్ఏ రికార్డు అయి ఉండే ఆ వ్యక్తి ఒక సారి తప్పుచేసినా, జీవితకాలం నేరస్థుడిగా అన్ని రకాల డాటాల్లో నిక్షిప్తమయ్యే ముప్పు ఉంది. బ్రిటిష్ వలస పాలకులు కొన్ని జాతులపై నేరస్థులుగా వేసిన ముద్ర నేటికీ తొలగిపోలేదు. మరో ప్రమాదం ఏమిటంటే.. అనుమానితుల పేరిట ఎవరి డీఎన్ఏ అయినా సేకరించే ముప్పు ఉంది. డీఎన్ఏ విశ్లేషణకు రక్తం ఇచ్చే వారి నుండి తీసుకునే అంగీకార పత్రంలో వారి పేరు, ఇతర అంశాలతో పాటు వారి కులం పేరు కూడా రాయాలి. అంటే కులాల వారీ , మతాల వారీ విశ్లేషణ జరిగే ప్రమాదం ఉంది. ఈ పరిణామాలు కుల మత విద్వేషాలకు దారి తీస్తాయేమో ఆలోచించాలి. ఈ బిల్లుపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీలోని సభ్యులు అనేక సహేతుక అభ్యంతరాలను లేవనెత్తారు. వాటిపై ప్రభుత్వం ఇంత వరకూ దృష్టిసారించినట్టు లేదు. డీఎన్ఏలను తారుమారు చేసి అసలు నేరస్థులను తప్పించే ప్రయత్నాలు కూడా జరగొచ్చు అనే మరో వాదన లేకపోలేదు. ఇదంతా చివరికి వ్యక్తిగత గోప్యతకు ముప్పు తెచ్చే పరిస్థితికి దారితీస్తుంది. మానవ తప్పిదం కారణంగా డీఎన్ఏలు తారుమారైతే వారికి విధించే శిక్షలు ఏమిటనేది కూడా చట్టంలో పేర్కొనలేదు. ఇప్పటికే డీఎన్ఏ బ్యాంకులు నిర్వహిస్తున్న దేశాల్లో పరిస్థితులు, సమస్యలను అధ్యయనం చేసిన దాఖలాలు లేవు.
సీనియర్ జర్నలిస్ట్
సెల్: 98484 43599