జర్నలిస్టులపై దాడులను ఉద్యమాలతో ఎదుర్కొంటాం

• దాడులను గర్హిస్తూ నేడు  ర్యాలీ
• ఐజేయూ,టీయూడబ్ల్యూజే పిలుపు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 4: ‌పథకం ప్రకారం మీడియా సంస్థలపై, జర్నలిస్టులపై దాడులకు, అక్రమ కేసులకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఉద్యమలతోనే తగినరీతిలో బుద్ధి చెబుతామని ఐజేయూ, టీయూడబ్ల్యూజే సంఘాలు హెచ్చరించాయి.  దిల్లీలో న్యూస్‌ ‌క్లిక్‌ ‌పోర్టల్‌ ‌కార్యాలయంపై, జర్నలిస్టులపై నిన్న పోలీసులు జరిపిన దాడిని ఖండిస్తూ తెలంగాణ స్టేట్‌ ‌యూనియన్‌ ఆఫ్‌ ‌వర్కింగ్‌ ‌జర్నలిస్టస్ (‌టీయూడబ్ల్యూజే), హైదరాబాద్‌ ‌యూనియన్‌ ఆఫ్‌ ‌జర్నలిస్టస్ (‌హెచ్‌ ‌యూజే)ల ఆధ్వర్యంలో బుధవారంనాడు బషీర్‌ ‌బాగ్‌ ‌లో నిరసన ప్రదర్శన జరిగింది. ఇండియన్‌ ‌జర్నలిస్టస్ ‌యూనియన్‌ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌ ‌రెడ్డి, ప్రముఖ సంపాదకుడు కె.రామచంద్రమూర్తి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్‌ అలీ,ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్‌ ‌రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఆలపాటి సురేష్‌ ‌కుమార్‌, ‌కల్లూరి సత్యనారాయణ, హెచ్‌.‌యూ.జే అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌.‌శంకర్‌ ‌గౌడ్‌, ‌షౌకత్‌, ‌టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు ఏ రాజేష్‌, ‌బీ కిరణ్‌ ‌కుమార్‌, ‌కల్కురి రాములు, జనం సాక్షి సంపాదకుడు రహ్మాన్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఐజేయూ అధ్యక్షుడు శ్రీనివాస్‌ ‌రెడ్డి మాట్లాడుతూ స్వతంత్రంగా పనిచేసే జర్నలిస్టుల మీద, మీడియా సంస్థల మీద కేంద్ర ప్రభుత్వం ఒక పథకం ప్రకారం దాడులు చేస్తూ మీడియా గొంతు నొక్క డానికి ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ఇందులో భాగంగానే న్యూస్‌ ‌క్లిక్‌ ‌పోర్టల్‌ ‌లో పని చేస్తున్న 46 మంది జర్నలిస్టులను ప్రశ్నించి, కొందరిని అరెస్టు చేయడం దేశంలోని జర్నలిస్టులకు విస్మయం కలిగించిందని అన్నారు. ఈ దాడులకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టేందుకు ఎడిటర్స్ ‌గిల్డ్ ఆఫ్‌ ఇం‌డియా, ప్రెస్‌ ‌క్లబ్‌ ఆఫ్‌ ఇం‌డియా, ఐజేయూ, ఇతర  సంఘాలు కార్యచరణ రూపొందిస్తున్నాయని చెప్పారు. కే రామచంద్ర మూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను, అధికార పార్టీ భావజాలాన్ని విమర్శిస్తూ రాసే వారిని లక్ష్యంగా పెట్టుకొని ఈ దాడులు జరుగుతున్నాయని అన్నారు. వీటిని సమైక్యంగా ప్రతిఘటించాలని జర్నలిస్టు సంఘాలకు, మేధావులకు ప్రజాస్వామ్యవాదులకు ఆయన పిలుపునిచ్చారు.

 నేడు  ర్యాలీ
న్యూస్‌ ‌క్లిక్‌ ‌జర్నలిస్టులపై జరిగిన దాడులను గర్హిస్తూ గురువారం నాడు ఉదయం 11గంటలకు, బషీర్‌ ‌బాగ్‌  ఎల్బీ స్టేడియం ప్రక్కన ఉన్న తమ కార్యాలయం నుంచి ట్యాంక్‌ ‌బండ్‌ ‌వద్ద గల అంబేద్కర్‌ ‌విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించినట్లు ఐజేయూ, టీయూడబ్ల్యూజే నాయకులు కే.శ్రీనివాస్‌ ‌రెడ్డి, ఎన్‌.‌శేఖర్‌, ‌కే.విరాహత్‌ అలీ తెలిపారు. విశ్రాంత న్యాయమూర్తులు, సంపాదకులు, న్యాయవాదులు,  విద్యావేత్తలు, పౌర సంఘాల కార్యకర్తలు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొంటారని వారు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page