“ఎవరినైనా సరే, చట్ట వ్యతిరేకంగా, చంపగూడదు. ఎంత పెద్దనేరమైనా సరైన విచారణ జరిపి శిక్ష విధించాలి. ఇది ఒక ఉదారవాద ఆలోచన. దానికీ పార్టీ రాజకీయాలకూ ఏమీ సంబంధం లేదు. ఒక వ్యక్తి అవలంబించే రాజకీయాలతో నీకు ఇష్టం లేకపోయినా, ఆ వ్యక్తిని చంపివేసే అధికారం నీకు లేదు అనేది ఒక చట్టబద్ధ పాలన సూత్రం. అది మా విధానం. ఇప్పటికీ మారని విధానం.”
నాకు హఠాత్తుగా ఏమనిపించిందంటే ఈ గొల్లవాడు ఇంతగా రూల్ ఆఫ్ లా గురించి, చట్టబద్ధపాలన గురించి మాట్లాడుతున్నాడు. ఈ విషయం పోలీసులకు కూడా తెలియదు గదా అనిపించింది.పోలీసులకు మాత్రమే కాదు, ఈ రూల్ ఆఫ్ లా ఉండాలనే విషయం మన న్యాయవాదులలో కూడా చాలామంది కి తెలియదు. ఎందుకంటే నేను గిరాయిపల్లి నుంచి కోర్టుకు వెళ్ళాను. అక్కడ కొంతమంది న్యాయవాదులు కలిశారు. అప్పుడే జస్టిస్ భార్గవా కమిషన్ విచారణ ముమ్మరంగా జరుగుతోంది. పత్రికల్లో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. అది చాల వేడిగా ఉంది. ఒక లాయర్ వచ్చి నన్ను సూటిగా అడిగాడు. మంచి ఇంగ్లీషులో ‘‘మిస్టర్ కన్నబిరాన్, సూటిగా సమాధానం చెప్పండి. రాజ్యాంగంలో, చట్టంలో విశ్వాసం లేదని చెప్పుకునే నక్సలైట్లకు, రాజ్యాంగంలో, చట్టంలో చెప్పిన రక్షణలు ఎందుకు ఇవ్వాలి’’ అని అడిగాడు.చాలా గంభీరంగా, చాలా సైద్ధాంతిక ప్రశ్న అడిగిన పద్ధతిలో ఆయన ఆ ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న తిరుగులేదని, నేను జవాబు చెప్పలేని ప్రశ్న అని ఆయన అనుకున్నట్టున్నాడు. నేను అప్పుడే ఆ గొల్లవాని సమాధానం విని వస్తున్నాను.
అందుకని, అదిగో నేను ఆ సంఘటన వివరించాను. ‘‘మరి కోర్టులు ఎందుకున్నయయా’’ అని ఆ గొల్లాయన అడిగాడు అని చెప్పాను. ఆ గొల్లాయన సహజ న్యాయ సూత్రాలు, చట్టాలు, ఉద్గ్రంధాలు వగైరాలేవీ చదవలేదు. మీ తల్లి దండ్రులు చాలా కష్టపడి, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మీ చేత అవన్నీ చదివించారు. అయినా మీకు రూల్ ఆఫ్ లా గురించి కనీస అవగాహన కలగలేదు. మీ చదువు దండగ’’ అని చెప్పాను. ఇటువంటి ప్రశ్నలు ఎందుకు పుట్టుకొస్తాయంటే, అసలు విషయం పక్కకు పోయి ఇటువంటి అనవసరపు విషయాల మీద చర్చ జరుగుతుంది.
ఇంకొక ఉదాహరణ చెపుతాను.. గిరాయిపల్లి వెళ్ళి ఆ అడవిని పరిశీలించాలి అని నేనొక పిటిషన్ వేశాను.పోలీసులు దానికి కౌంటర్ వేశారు. వాళ్ళు ఒక అడవి బొమ్మ చిత్రించారు. ఆ అడవి బొమ్మను జస్టిస్ భార్గవకు సమర్పించారు. అందులో ముదురు ఆకుపచ్చ, నలుపు చిక్కని పుట్టి రంగుల్లో చెట్లు, పొదలు, తీగలు, మొక్కలు చిత్రించి, అది చిక్కని అడవి, అందులోకి ప్రవేశించడం కష్టం అని చెప్పారు. చీమలు దూరని చిట్టడవి, కాకులు దూరని కారడవి అన్న మాదిరిగా, చాలా ఊహాత్మకంగా అడవిని చిత్రించామని వాళ్ళు అనుకున్నారు. అయినా సరే, జస్టిస్ భార్గవ దాన్ని చూడవలసిందే అన్నారు. అక్కడిదాకా వెళ్ళ వచ్చునని, సమస్యేమీ లేదని మేమన్నాం. సరే అని బయల్దేరాం. నేను, జస్టిస్ భార్గవ ఒక అంబాసిడర్ కారులో ఉన్నాం. అక్కడి దాకా వెళ్ళకపుందే ‘‘కార్లు అక్కడికి వెళ్ళలేవు సార్. జీపుల్లో పోవలసిందే. దిగి జీపు లెక్కండి’’ అన్నారు పోలీసులు. ‘‘చూద్దాం. కారు ఎక్కడిదాకా వెళితే అక్కడిదాకా వెళ్ళి అక్కడి నుంచి నడుద్దాం. లేకపోతే అక్కడ జీపు ఎక్కుదాం’’ ఆని నేను కారు ముందుకు కదలమన్నాను.
చివరికి మా కారు సరిగ్గా జనార్దన్, మురళీమోహన్, ఆనందరావు, సుధాకర్‌లను ఏ చెట్లకు కాల్చి చంపారో ఆ చెట్ల దగ్గరికి వెళ్లగలిగింది.అట్లాగే ఆ నలుగురిని ఎక్కడ దహనం చేశారో అక్కడికి కూడా వెళ్ళాం. అక్కడ జనార్దన్‌ను దహనం చేసిన చోటునుంచి వాళ్ళ నాన్న రామా రావు గారు అస్థికలు ఏరి తెచ్చాడు. ఆ అస్థికల్ని ఆ తర్వాత నేను హుసేన్ సాగర్‌లో నిమజ్జనం చేయించాను. ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే, పోలీసులు పరిశోధనను, రూల్ ఆఫ్ లా ను అడ్డుకోవడానికి ఇంత మూర్ఖంగా, అజ్ఞానంతో, అనాగరికంగా ప్రవర్తించగలరని చెప్పడానికే. సరే, కె.లలిత రొద్దం ప్రభాకరరావు తన మీద అమలు చేసిన చిత్రహింసలను గురించి కమిషన్ ముందర చెప్పిన తర్వాత, అవన్నీ పత్రికలలో వచ్చిన తర్వాత పోలీసు అధికారుల ప్రతినిధి బృందం ఒకటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి దగ్గరికి వెళ్ళింది. తమ నైతిక స్థయిర్యం దెబ్బతింటున్నదని ఫిర్యాదు చేసింది.
ఒకవేళ మీరు మీ వృత్తి ధర్మాన్నే అనుసరించినట్టయితే, ఆ ప్రవర్తన బయట పడినప్పుడు నైతిక స్థయిర్యం ఎందుకు దెబ్బతింటుంది? మీరు చేసిన పని సరైనదేనని మీ అంతరాత్మకు అనిపిస్తే, అది బయటపడినప్పుడు నైతికస్థయిర్యం ఎందుకు దెబ్బతింటుంది?
ఒకవేళ మీరు మీ వృత్తి ధర్మాన్నే అనుసరించినట్టయితే, ఆ ప్రవర్తన బయట పడినప్పుడు నైతిక స్థయిర్యం ఎందుకు దెబ్బతింటుంది? మీరు చేసిన పని సరైనదేనని మీ అంతరాత్మకు అనిపిస్తే, అది బయటపడినప్పుడు నైతికస్థయిర్యం ఎందుకు దెబ్బతింటుంది?
అయినా సరే, ప్రతి సందర్భంలోనూ పోలీసుల వాదన ఈ నైతిక స్థెర్యం దెబ్బతినడం అనే పునాది మీదనే ఆధారపడుతుంది. ఇది పుప్పైఏళ్ళ కింద జస్టిస్ భార్గవా కమిషన్ విచారణ సందర్భంలో మాత్రమేకాదు, ఇవాల్టికీ ఎక్కడ పోలీసు అత్యాచారాల సంఘటన, పౌరహక్కుల ఉల్లంఘన వార్త బయటపడినా వెంటనే పోలీసు అధికారులందరికీ గుర్తుకు వచ్చేది నైతిక స్థయిర్యం సమస్యే. ఇటీవల నేషనల్ పోలీసు అకాడమి దగ్గర ఒక సిగరెట్ల అంగడి వ్యక్తిని ట్రెయినీ పోలీసు అధికారులు కొట్టిన సంఘటనే చూడండి. జరిగిన సంఘటన వాస్తవాలు పత్రికలలో వస్తుంటే పోలీసు అధికారులు పాత పాటే పాడుతున్నారు. పోలీసుల నైతిక స్థయిర్యం దెబ్బతింటుంది అని.
ఒకవేళ ఆ దుకాణాదారుదే తప్పనుకుందాం. అతను ఎవరయినా గానీ. అతణ్ని కొట్టడానికి పోలీసులకు ఏం అధికారం ఉంది? ఒకవేళ ఆ అంగడివాడు ‘నేను నీకు సిగరెట్ అమ్మను’ అన్నాడనుకో, ‘ఇరవై రూపాయలకు ఒక సిగరెట్ కొంటే కొను లేకపోతే పో’ అన్నాడనుకో. అంగడి పెట్టుకున్నాడు అతని ఇష్టం. అతణ్ని కొట్టడం ఎందుకు? కొట్టి సరుకు తీసుకోవడమేనా? ఎందుకు కొట్టారయ్యా అంటే అదే చిలక పలుకు…నైతిక స్థయిర్యం దెబ్బతింటుంది అని…. చర్చల సందర్భంగా ఏం జరిగింది? నక్సలైట్లు వచ్చి ప్రభుత్వాన్ని, పోలీసులను విమర్శించారు. వాళ్ళ తప్పులు బైటపెట్టారు. అంతే ప్రభుత్వపు నైతిక స్థయిర్యం దెబ్బతింది. ఇంత సులభంగా దెబ్బతినే నైతిక స్థయిర్యం ఉంటే ఏం, పోతే ఏం? సరే, అట్లా నైతిక స్థయిర్యం సమస్య ముందుకు తెచ్చి జస్టిస్ భార్గవా కమిషన్ విచారణ రహస్యంగా జరగాలని ఒత్తిడి తెచ్చారు. ఎంవి రామమూర్తి గారు, పంచాగ్నుల సత్యనారాయణ, నేను దీనిమీద చాలా చర్చించుకున్నాం. మా మధ్య ఇతరంగా భిన్నాభిప్రాయాలున్నా ఈ విషయంలో మాత్రం ఏకాభిప్రాయం ఉండింది. ఎవరినైనా సరే, చట్ట వ్యతిరేకంగా, చంపగూడదు. ఎంత పెద్దనేరమైనా సరైన విచారణ జరిపి శిక్ష విధించాలి. ఇది ఒక ఉదారవాద ఆలోచన. దానికీ పార్టీ రాజకీయాలకూ ఏమీ సంబంధం లేదు. ఒక వ్యక్తి అవలంబించే రాజకీయాలతో నీకు ఇష్టం లేకపోయినా, ఆ వ్యక్తిని చంపివేసే అధికారం నీకు లేదు అనేది ఒక చట్టబద్ధ పాలన సూత్రం. అది మా విధానం. ఇప్పటికీ మారని విధానం.
-కె.జి. కన్నబిరాన్
ఆత్మకథాత్మక సామాజిక చిత్రం
ఆత్మకథాత్మక సామాజిక చిత్రం
అక్షరీకరణ :ఎన్ .వేణుగోపాల్