“అప్పుడు ఐపిఎస్ అధికారి రొద్దం ప్రభాకర రావు ఎపిఎస్‌ఆర్‌టిసికి ఎండిగా ఉండేవాడు. ఆ ప్రభాకరరావే లలితను ఎమెర్జెన్సీ లో అరెస్టు చేసినవాడు. లలితను నిర్బంధంలో క్రూరమైన చిత్రహింసలకు గురిచేసినవాడు అతనే. ఆమె తనను ఎట్లా కిటికీకి కట్టేసి పెట్టిందీ, ఎట్లా చిత్రహింసలు పెట్టిందీ ఒక్కొక్క సంఘటనా జస్టిస్ భార్గవ ముందర వివరించింది. రొద్దం ప్రభాకరరావును గుర్తుపట్టింది.లలిత వాంగ్మూలం పత్రికల్లో పెద్ద ఎత్తున వచ్చింది. ఒక పుహిళ మీద పోలీసులు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో పత్రికా పాఠకులకు, సమాజానికంతా తెలిసిపోయింది.”
ఈ కమిషన్ విచారణ జరిగినన్ని రోజులు, శివశంకర్‌కు ఇచ్చినట్టుగానే కన్నబిరాన్ కు కూడా రోజుకు పదిహేను వందల రూపాయలు భృతి ఇవ్వాలని ప్రధాని మొరార్జీ దేశాయి అన్నారని శ్రీనివాస వరదన్ జస్టిస్ భార్గవకు చెప్పాడట.‘కన్నబిరాన్‌కు ఈ విషయం చెప్పి ఆయన అనుమతి తీసుకుని ఈ ఏర్పాట్లు చేయండి’ అని శ్రీనివాస వరదన్ జస్టిస్ భార్గవకు సూచించాడు. జస్టిస్ భార్గవ ఈ మాట నాకు కోర్టులో చెప్పారు. అప్పుడు డిఫెన్స్ తరఫున ముగ్గురం వాదిస్తున్నాం గదా. మా ముగ్గురిలో ఒకరికి ఈ రకంగా రోజుకు పదిహేను వందల రూపాయల భృతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నదని, మా అంగీకారం తెలుపమని ఆయన కోరారు. మేం అక్కర్లేదన్నాం. నన్ను ఆయన తన ఛాంబర్‌కు పిలిపించారు. ‘మీకే ఈ భృతి ఇమ్మని కేంద్ర ప్రభుత్వం నుంచి సూచన వచ్చింది. మీ గురించి ఒక సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఇనస్పెక్టర్ తో విచారణ జరిపించాను. మీకు చాల మంచి ప్రాక్టీసు ఉందని నాకు తెలిసింది. ఆ ప్రాక్టీసు వదులుకుని, ఈ కమిషన్ విచారణకు మీరు సహకరిస్తున్నారు. కనుక ఎంతో కొంత పరిహారంగా ఈ భృతి అంగీకరించండి’ ఆని ఆయన అన్నారు.
‘నాకు ఈ డబ్బు అవసరం లేదండీ. నేను నా రాజకీయ విశ్వాసాల కోసం ఈ పని చేస్తున్నాను గాని పారితోషకం ఆశించి కాదు’ అని చెప్పాను. బహుశా అప్పటికి రోజుకు పదిహేను వందల రూపాయల లెక్కన ఎనభై వేలో, తొంభై వేలో వచ్చేదనుకుంటాను. 1978లో అది చాలా పెద్ద మొత్తమే. అయినా సరే, నాకు అక్కర్లేదని వచ్చేశాను. తర్వాత కోర్టులో ఏదో ఒక తేదీన విచారణ జరపడానికి తమ కు వీలుకాదంటే వీలు కాదని అనంతబాబు, శివశంకర్ వాదిస్తున్నారు. ‘‘ఈ కోర్టులో నేను ఏ తేదీ చెపితే మీరు ఆ తేదీన రావలసిందే. ఏ మాత్రం డబ్బులు తీసుకోకుండా కేవలం కేసు మీద ఆసక్తితో వాదనకు వస్తున్నది కన్నబిరాన్ గనుక ఆయనకు ఏ తేదీ అయినా వీలు కాదంటే నేను ఒప్పుకోగలను. కాని మీరిద్దరూ డబ్బులు తీసుకుని, ఉద్యోగులుగా ఈ కోర్టుకు వస్తున్నారు. మీకు ఏ రోజయినా కుదరదనడానికి వీలు లేదు. నేను రమ్మన్నప్పుడు రావాల్సిందే’ అన్నారు జస్టిస్ భార్గవ. అంతేకాదు, జస్టిస్ భార్గవ ఆ విచారణను మొత్తం చాలా జాగ్రత్తగా అధ్యయనం చేశారు. ప్రతి వాంగ్మూలం మీద, క్రాస్ ఎగ్జామినేషన్ మీద ఆయన ఎర్ర పెన్సిల్ మార్కులు, నీలం పెన్సిల్ మార్కులు ఉండేవి. ‘‘మీరు మీ కేసును రుజువు చేశారు’’ అని నాతో స్పష్టంగా అన్నారాయన.
‘మరి అట్లయితే, ఈ గిరాయిపల్లి కేసు వరకు మీ నిర్ధారణ ఏమిటో ప్రకటించ వచ్చు గదా’ అన్నాను. కాదు అన్ని సంఘటనల విచారణ అయిపోయిన తర్వాత ఒకేసారి తీర్పు ప్రకటిస్తాను’ అన్నారాయన.అప్పుడు మాత్రం ఆయన అర్థం లేకుండా ప్రవర్తిస్తున్నట్టు నాకు అనిపించింది. మనసుకు కష్టం వేసింది. జస్టిస్ భార్గవ పంపించిన ఇంటిలిజెన్స్ ఆఫీసరే స్వయంగా పోలీసు అధికారులు సాక్షులను ఎట్లా తారుమారు చేస్తున్నారో రాశాడు. గిరాయిపల్లి వెళ్ళి సాక్షుల దగ్గర స్వయంగా వాంగ్మూలాలు సేకరించుకుని రమ్మ ని జస్టిస్ భార్గవ తన ఇంటిలిజెన్స్ అధికారులను పంపించారు. ఆ అధికారి గిరాయిపల్లి వెళ్ళడానికి అరగంట ముందే స్థానిక పోలీసుల స్పెషల్ బ్రాంచి అధికారులు వెళ్ళి ఆ సాక్షికి బాగా కల్లు తాగించి తప్పుడు సాక్ష్యం ఇప్పించారు. ఆ సాక్షి పేరు కొమురయ్య అనుకుంటాను. ఆయన ఆ సాక్ష్యం తీసుకుని తిరిగి వస్తూ సిద్ధిపేట బస్టాండ్‌లో స్పెషల్ బ్రాంచి అధికారులను చూశాడు. వీళ్ళే గిరాయిపల్లి వెళ్ళి ఆ సాక్షిని బెదిరించి వచ్చి ఉంటారనుకుని ఆయన గిరాయిపల్లికి మళ్ళీ వెళ్ళాడు. మరో రకమైన సాక్ష్యం తీసుకువచ్చి అదంతా జస్టిస్ భార్గవకు నివేదించాడు.
భార్గవ కమిషన్ విచారణ క్రమం లో ఇటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. గిరాయిపల్లి విచారణలో కామేశ్వరరావు టేప్ రికార్డర్ వాంగ్మూలం గోల జరుగుతుండగానే ఆ తర్వాత ఏ సంఘటనను విచారించాలనే ఆలోచన మొదలయింది.రామనర్సయ్యను ఎన్కౌంటర్ పేరిట కాల్చి చంపిన ఘటనను ఆ తర్వాత విచారణకు తీసుకోవాలని అనుకున్నాం. కాని ఆ ఆలోచన సాగుతుండగానే ఆ సంఘటనలో కీలక సాక్షి ప్రీతం సింగ్‌ను పోలీసులు ఎత్తుకుపోయారు. నాగ్‌పూర్‌కు ఎత్తుకుపోయారు. ప్రీతం సింగ్‌ను పోలీసులు ఎత్తుకు పోయిన ఘటన విచిత్రంగా జరిగింది. ఆయన పాత పులక్పేటలో ఉండేవాడు. ఆయన ఇంటి నుంచే రామ నర్సయ్యను పోలీసులు ఎత్తుకుపోయి వరంగల్ జిల్లా నర్సంపేట సమీపంలోని చిలకలగుట్ట దగ్గర కాల్చి చంపేశారు. భార్గవా కమిషన్ విచారణ మొదలయిన తర్వాత ఈ ప్రీతం సింగ్ తన వాంగ్మూలం ఇవ్వదలిచాడు. పాత మలక్‌పేటలో ఉండే కెవిఎన్ నరసింహారావు అనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ బోర్డు చూసి, న్యాయవాది గదా అని లోపలికి వెళ్ళాడు. ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రీతం సింగ్‌ను కూచోబెట్టి పోలీసులను పిలిపించాడు. పోలీసులు ప్రీతం సింగ్‌ను ఎత్తుకుపోయి నాగ్‌పూర్ తీసుకుపోయారు. ఈ సంగతి తెలియగానే నేను ముగ్గురు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల మీద కోర్టులో పిటిషన్ వేశాను. ఆ ముగ్గురికి పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా ఉండే అర్హత లేదని వాదించాను. వాళ్లు కేవలం పోలీసు శాఖ ఉద్యోగులుగా ప్రవర్తిస్తున్నారని వాదించాను. షాద్‌నగర్ కోర్టులోనూ, హైకోర్టు లోనూ నేను చేసిన వాదనల వల్ల ఆ ముగ్గురిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఆ కేసు ఫలితంగానే పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా నియమించడానికి ఉండవలసిన అర్హతల గురించి చట్ట సవరణ వచ్చింది.
సరే, రామనర్సయ్య కేసు విచారణ చేపడదాపుంటే ఓంకార్ కొందరు సాక్షులను తీసుకొచ్చాడు. కాని నాకు ఆ సాక్ష్యాల మీద పూర్తి విశ్వాసం కుదరలేదు. వాళ్ళందరూ రామ నర్సయ్యను, ఆయనతోపాటు మరి ముగ్గురిని హైదరాబాదు నుంచి పోలీసు వ్యాన్లలో ఎట్లా వరంగల్ తీసుకొచ్చారో, నర్సంపేటకు, చిలకలగుట్టకు తీసుకుపోయారో చెప్పేవారు. ఆ సాక్ష్యం ఎవరయినా చెప్పవచ్చునని, ప్రత్యక్ష సాక్షి కానక్కరలేదని నాకు అనిపించింది. ఆ కేసులో కీలక సాక్షీ, ప్రత్యేక సాక్షీ ప్రీతం సింగే. ఆయన ఇంట్లో నుంచి రామ నర్సయ్యను పోలీసులు పట్టుకుపోయారని ఆయన చెపుతున్నాడు. కాని విచారణ ప్రారంభిద్దామంటే ఆయనను ఎత్తుకుపోయారు. ప్రీతం సింగ్ వచ్చి ఉంటే, సాక్ష్యం చెప్పి ఉంటే చిలకలగుట్ట కేసులో కూడ, గిరాయిపల్లి కేసులో లాగనే, మా వాదన నిర్ధారణ అయి ఉండేది. అందుకని నేనేం చేశానంటే, ఇప్పుడు రామ నర్సయ్య కేసు విచారణ పక్కన పెడదాం, రామ చంద్రయ్యను, జంపాల ప్రసాద్‌ను చంపివేసిన ఇల్లందు ఎన్కౌంటర్ ఘటనపై విచారణ ప్రారంభించమని అడుగుదాం అని మా వాళ్ళతో అన్నాను. ఆ కేసులో నా దగ్గర పోస్ట్‌మార్టమ్ రిపోర్టు ఉండింది. నా దగ్గర ఆ పోస్ట్‌మార్టమ్ రిపోర్టు ఉందని పోలీసులకు తెలియదు. ఆ రిపోర్టు ప్రకారం వాళ్ళిద్దరినీ అతి సమీపం నుంచి కాల్చినట్టుగా ఉంది. గుండెలలోంచి తూటా దూసుకు పోయినట్టుగా ఉంది. అటూ ఇటూ ఎదురుకాల్పులు జరిగితే అటువంటి తూటా గాయాలు ఉండే అవకాశం లేదు.
ఈ పోస్టుపూర్టం రిపోర్టు కాపీ సంపాదించడంలో డాక్టర్ వై. రాధాకృష్ణమూర్తి గారు సహాయం చేశారు. ఆ రోజుల్లో నక్సలైట్ల మీద హత్యాకాండను ఖండించడంలో, వారికి న్యాయ సహాయం చేయడంలో సిపిఎం నాయకులందరూ శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఈ ఎన్కౌంటర్ ఘటనలో మొట్టమొదటి సాక్షి కె.లలిత. ఆమె అంతకు ముందు ప్రోగ్రెసిప్ డెమొక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ నాయకురాలిగా ఉండింది. ఎమెర్జెన్సీలో జంపాల చంద్రశేఖర ప్రసాద్‌ను అరెస్టు చేసిన ఘటనకు ఆమె ప్రత్యక్ష సాక్షి. అప్పుడు ఐపిఎస్ అధికారి రొద్దం ప్రభాకర రావు ఎపిఎస్‌ఆర్‌టిసికి ఎండిగా ఉండేవాడు. ఆ ప్రభాకరరావే లలితను ఎమెర్జెన్సీలో అరెస్టు చేసినవాడు. లలితను నిర్బంధంలో క్రూరమైన చిత్రహింసలకు గురిచేసినవాడు అతనే. ఆమె తనను ఎట్లా కిటికీకి కట్టేసి పెట్టిందీ, ఎట్లా చిత్రహింసలు పెట్టిందీ ఒక్కొక్క సంఘటనా జస్టిస్ భార్గవ ముందర వివరించింది. రొద్దం ప్రభాకరరావును గుర్తుపట్టింది.లలిత వాంగ్మూలమంతా పత్రికల్లో పెద్ద ఎత్తున వచ్చింది. ఒక మహిళ మీద పోలీసులు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో పత్రికా పాఠకులకు, సమాజానికంతా తెలిసిపోయింది.
-కె.జి. కన్నబిరాన్
ఆత్మకథాత్మక సామాజిక చిత్రం
అక్షరీకరణ :ఎన్ .వేణుగోపాల్