రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియామకం కావడంపై అభినందనలు
రేపు నూతన గవర్నర్ ప్రమాణ స్వీకారం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 29 : తెలంగాణ నూతన గవర్నర్‌గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో రాజ్‌భవన్‌కు వెళ్లి శాలువాతో సన్మానించారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కాబోయే గవర్నర్‌తో చర్చించారు. ఇటీవల తెలంగాణ గవర్నర్‌గా జిష్ణు దేవ్ వర్మను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించిన సంగతి తెలిసిందే.
గవర్నర్ నియమితులైన తర్వాత హైదరాబాద్‌కు వొచ్చిన సందర్భంగా రేవంత్ రెడ్డి ఆయనను కలిశారు. రాష్ట్ర ప్రజల తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలకు సీఎం వెళ్లారు. కాగా ఈ నెల 31న రాజ్ భవన్‌లో జిష్ణుదేవ్ వర్మను గవర్నర్‌గా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
గతంలో జిష్ణుదేవ్ వర్మ త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. ఈయన త్రిపుర రాజకుటుంబానికి చెందిన వ్యక్తి కాగా..1990లో రామ జన్మభూమి ఉద్యమానికి ఆకర్షితులపై బీజేపీలో చేరారు. తెలంగాణ ఇన్‌ఛార్జ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీ కావడంతో ఆయన నేడు రిలీవ్ కానున్నారు.
శాసనసభ సమావేశాల అనంతరం రాధాకృష్ణన్‌కు వీడ్కోలు పలికేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు రాజ్ భవన్‌కు వెళ్లనున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా రాధాకృష్ణన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం మొత్తం పంటలతో సస్యశ్యామలంగా ఉండాలని మహంకాళి, ఎల్లమ్మతల్లిని కోరుకుంటున్నట్లు ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.