జీవితమంటే..
గత గాయాల్ని తవ్వటం కాదు..
రేపటి గనుల్లో రత్నాలు అన్వేషించటం !
కష్టం, దుఃఖం, వేదన కానే కాదు..
సమరం, సాధన, ఆస్వాదన మాత్రమే !
బతుకంటే..
పుట్టటం, గిట్టడం కానే కాదు..
రెంటి మధ్య సాఫల్యత సాధించటమే !
మెతుకుల్ని గతకడానికేనా..
పరుల వెతల్ని తీర్చడానికి కూడా !
లైఫ్ అంటే..
ఊరు ‘ఛీ’ కొట్టడం కానే కాదు..
పల్లె పల్లెంతా ‘జే’ కొట్టడమే కదా !
భయం కమ్మిన కారు చీకట్లు కాదు..
మసకల తెరలు చీల్చుకుంటూ నడవడమే !
తనువంటే..
లాభ నష్టాల లెక్క కాదు సుమా..
మంచి చెడుల విచక్షణ మాత్రమే !
జీతం కోసమే జీవితం కదేమోగా..
జీవి విడిచినా జీవించడం కోసమేగా !
జిందగీ అంటే…
సుఖ నిధి అన్వేషణకే కాదు
సుఖ సాధనకు ఎంచుకున్న సన్మార్గమేగా !
తలరాత, హస్తరేఖల్ని నమ్మడం కాదు..
మన జాతకాన్ని మనమే రాసుకోవడమే !
– మధుపాళీ, కాన్బెరా, ఆస్ట్రేలియా, 99497 00037.