- మంచినీటి కోసం బాధితుల నరకయాతన
- కొనసాగుతున్న భారత్ సహాయక చర్యలు
- మరో సహాయక బృందం వెళ్లినట్టు విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్
న్యూ దిల్లీ, ఫిబ్రవరి 9 : టర్కీ, సిరియాలో మృత్యు విలయం కొనసాగుతోంది.. ఎటు చూసినా శిథిలాలు.. శవాల గుట్టలే కనిపిస్తున్నాయి.. ఇప్పటికే 15వేల మందికి పైగా మృతి చెందారు. మృతుల సంఖ్య 25వేలకు పైగానే ఉంటుందా..? అంటే అంతకు మించి అన్నట్టుగా ఉంది అక్కడి పరిస్థితి.. భూ ప్రళయం అనంతరం విపత్కర పరిస్థితులతో టర్కీ, సిరియా దేశాల ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఎక్కడ చూసినా హృదయ విదారక పరిస్థితులు.. శిథిలాల నుంచి చిన్నారులను కాపాడుతున్న దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కంట తడి పెట్టిస్తున్నాయి. తాగేందుకు గుక్కెడు నీరు లేక అలమటించిపోతున్నారు ఆ పసిబిడ్డలు. ఆ దృశ్యాలు కలిచివేస్తున్నాయి. ఇక ఎక్కడ చూసినా ఆకలి కేకలే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో భారత్ దళాలు సహాయక చర్యలను ముమ్మరం చేసింది. రెండ్రోజులుగా తినేందుకు తిండి, తాగేందుకు నీరు లేక విలవిలలాడిపోతున్నారు స్థానికులు.
భూకంపం ధాటికి ఇళ్లు కూలిపోయి నిలువ నీడ లేక నరకయాతన అనుభవిస్తున్నారు. ఇక శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. ఎముకలు కొరికే చలిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టర్కీ ప్రెసిడెంట్ రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ భూకంప కేంద్రానికి సపంలో ఉన్న ప్రాంతాన్ని సందర్శించారు. భూకంపం అనంతరం ప్రభుత్వం ప్రతిస్పందనపై విమర్శల వ్యక్తమవుతున్న వేళ.. ఎర్డోగాన్ ప్రభుత్వ లోపాలను అంగీకరిస్తున్నట్లు తెలిపారు. టర్కీతో పాటు సిరియాకు కూడా సాయం అందించేందుకు భారత్ ’ఆపరేషన్ దోస్త్’ ప్రారంభించింది. భారత్ నుంచి రెండు వాయుసేన విమానాల్లో సహాయక బృందాలు, రెస్క్యూ ఆపరేషన్స్ కోసం ట్రైనింగ్ పొందిన డాగ్ స్క్వాడ్ టర్కీకి తరలివెళ్లాయి.
ప్రస్తుతం ముమ్మరంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇక గురువారం కూడా హిండన్ ఎయిర్‌బేస్ నుంచి అ-17 గ్లోబ్ మాస్టర్ ఎయిర్ క్రాప్ట్ సహాయసామగ్రి, బృందాలతో భూకంప బాధిత ప్రాంతాలకు బయలుదేరింది. రేషన్, మెడిసిన్‌తో పాటు 51మంది టీమ్.. భూకంప బాధిత ప్రాంతాల్లో సహాయకచర్యలు చేపట్టనుంది. ఈ మేరకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్విట్ చేశారు. భూకంపం బాధితులకు సాయం అందించడానికి భారత్ నుంచి వెళ్లినట్లు పేర్కొన్నారు. మరిన్ని సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్‌లు, డాగ్ స్క్వాడ్లు, అవసరమైన పరికరాలు, మందులు, సహాయక సమాగ్రిని పంపించినట్లు పేర్కొన్నారు.