వడగాలులు తోడుకావడంతో ప్రజల ఉక్కిరిబిక్కరి
అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
విశాఖపట్నం,మే15 : తీవ్రమైన ఎండలు, వడగాడ్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తెలంగాణ,ఆంధ్రాలో వడగాలులకు తోడు తీవ్రమైన ఎండలు ఆందోళన కలిగిస్తున్నాయి. అనేకచోట్ల 40 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో ఎండలు పెరిగి వడగాడ్పులు వీయనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో దాదాపు అన్ని మండలాల్లో గాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం ఎక్కువ ఉంటుందని హెచ్చరించింది. ఈ రెండు రోజులూ అక్కడక్కడా 45 నుంచి47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. కోస్తాలో పలు ప్రాంతాలు ఉడికిపోయాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో వడగాడ్పులు వీచాయి. బంగాళాఖాతంలో ఉన్న తుఫాన్ దిశగా పడమర దిశ నుంచి వీచిన గాలుల్లో తేమ లేకపోవడంతో ఎండ మండిపోయింది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ఎండలు కొనసాగాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. పలుచోట్ల 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు రోజుల నుంచి కాస్తున్న ఎండలకు చిన్నారులు, వృద్ధులు విలవిలలాడిపోతున్నారు.ఎండలు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు.
ఈ ఎండలకు రహదారులన్నీ కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. తెలంగాణలో పలుచోట్ల రికార్డు స్థాయిలో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో నిర్మానుష్య వాతావరణం ఏర్పడింది. ఇక సత్తుపల్లిలో ఈ ఏడాది హరితహారం కోసం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన టేకు మొక్కల ప్లాంటేషన్‌లో వాటి రక్షణ కోసం గ్రీన్ మ్యాట్‌లను అధికారులు ఏర్పాటు చేశారంటే పట్టణంలో ఎండ వేడిమి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉదయం 8గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించాడు. 11 గంటల తరువాత రహదారులపై జనసంచారం లేకుండా పోవడంతో నిర్మానుష్యంగా మారిపోయాయి. వాహనదారులుసైతం ఎండకు బయటకు రాలేదు.ఎండలు మరిన్ని రోజులు ఉంటాయని ప్రజలు సూచనలు పాటించాలని వాతావరణశాఖ హెచ్చరించింది.
తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ప్రచండ తుఫాన్ ’మోకా’ ఆదివారం ఉదయానికి పెనుతుఫాన్‌గా బలహీనపడింది. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2.30 గంటల మధ్య ఆగ్నేయ బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ మధ్య సిట్టవా సపంలో తీరం దాటింది. ఆ సమయంలో గంటకు 180 నుంచి 210 కిలోటర్ల వేగంతో పెనుగాలులు వీచాయని వాతావరణ శాఖ తెలిపింది. పెను తుఫాన్ తీరం దాటిన తరువాత సాయంత్రానికి మరింత బలహీనపడిందని పేర్కొంది. తుఫాన్ తీరం దాటిన నేపథ్యంలో అనేక రాష్టాల్ల్రో పొడి వాతావరణం నెలకొందని, నాలుగైదు రోజులపాటు ఎండలు, వడగాడ్పులు ఉంటాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.